Adsense

Wednesday, June 15, 2022

శ్రీ సీతారామస్వామి ఆలయం : యనమదల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం : యనమదల (గుంటూరు జిల్లా)




🌀 1. సీతా రామస్వామి ఆలయం 

💠 ఈ ఆలయాన్ని 1823 వ సంవత్సరంలో శ్రీ గొల్లపూడి పట్టాభిరామారావు, శ్రీ గొల్లపూడి లక్ష్మణ్ నిర్మించారు.
 ఈ దేవాలయాన్ని రెండవ భద్రాద్రి లేదా గుంటూరు జిల్లా భద్రాద్రి అంటారు. 
కారణం ఏమిటో తెలుసా? 

💠 భద్రాచలం ఆలయంలో మాదిరే ఇక్కడ కూడా రాములవారి వామాంకంపై సీతాదేవి కూర్చుని వుండటం. కుడి పక్కన లక్ష్మణస్వామి, ఎదురుగా ఆంజనేయస్వామి వుంటారు. 
ఈ విగ్రహాలు గ్రామంలో వున్న చెరువు తవ్వకాలలో లభించాయి. 
రథం, వాహనాలు వగైరాలన్నీ తర్వాత చేయించారు.

💠 ఈ స్వామిని సేవిస్తే అనుకున్న పనులు నెరవేర భక్తుల విశ్వాసం. 
సంతానం లేనివారు అంకురార్పణ జరిగే రోజు స్వామి వారి  ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. 
ఈ ప్రసాదం కోసం గుంటూరు జిల్లా నుంచే కాక, ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తారు.

💠 ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామికి కూడా ప్రత్యేక ఉపాలయం ఉన్నది. ఆలయం కోసం జరిపే తవ్వకాలలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం బయల్పడింది. 
ఆ సమయంలో లక్ష్మీ నరసింహస్వామి ఒక భక్తునికి వంటిమీదకి వచ్చి తన సీతారామస్వామి ఆలయంలోనే ప్రతిష్ఠించవలసినదిగా సూచించారనీ, అందుకే ఇక్కడే ప్రతిష్ఠించారనీ తెలిసింది.

💠మరో ఉపాలయంలో శ్రీ వీరాంజనేయ స్వామి వున్నాడు. 
ఈ ఆలయం 12వ శతాబ్దంలోనిది.  తర్వాత 1556లో శ్రీ కృష్ణ దేవరాయల వంశంలోని రామరాజు అనే రాజు ఈ ఆలయ నిర్వహణకు భూ దానాలిచ్చాడని చరిత్ర ద్వారా తెలుస్తున్నది.

💠 పురాతనమైన ఈ ఆలయానికి తర్వాత ఆలయ నిర్వహణ కోసం, అభివృద్ధి కోసం కొందరు దాతలు అనేక ఎకరాల పంట భూములను స్వామికి సమర్పించారు. 
కానీ వీటిలో చాలామటుకూ అన్యాక్రాంతంగా వున్నాయి. . 
దీనితో పూర్వం ఇక్కడ జరిగే ఉత్సవాలు అన్నీ జరిపించలేకపోతున్నారు. 
ప్రస్తుతం ఈ ఆలయం ఎండౌమెంట్స్ వారి అధీనంలో వుంది. 


🌀 2. శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం

💠 ఈ దేవాలయం క్రీ.శ. 1286 సం.,లో నిర్మించినట్లు తెలుస్తుంది.
 దీనిని కాకతీయ రాజైన గణపతి దేవుని కుమార్తె గణపాంబిక నిర్మించినది. 

💠 గణపాంబికను ధరణకోట పాలకుడు అయిన బేతరాజుకు ఇచ్చి వివాహం చేశారు. వివాహం అయిన కొన్నాళ్ళకే బేతరాజు మరణించటంతో ఈమె పాలన చేసినది. 
భర్త పేరు మీద ఈమె అనేక దాన ధర్మాలు చేసినది. అంతేకాక ఈమె ఎన్నో "విష్ణు” ఆలయాలను కట్టిస్తూ, యనమదల గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామిని ప్రతిష్టించి, అంగరంగ వైభవంగా స్వామి వారికి ఉత్సవాలు చేసినది.

💠 స్వామి వారి ధూప, దీప నైవేద్యాలకు అనేక పొలాలు, ఇతర అవసరమైన వసతులు అనగా బావులు, స్థలాలు పూల తోటలు మొదలైనవి ఏర్పాట్లు చేసినది.

💠 కృష్ణాష్టమి, దసరా, ముక్కోటి, సంక్రాంతి, కళ్యాణోత్సవం మొదలైన ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. 
ఈ ఆలయంలో రాజుల శాసనాలు కూడా ఉన్నాయి.
ఈ ఆలయం దేవాదాయ శాఖ అధీనంలో ఉన్నది.

💠 గుంటూరు నుండి యనమదలకు 11కి.మీ. దూరం. గుంటూరు నుండి చిలకలూరి పేట వెళ్ళే (యన్. హెచ్. - 5) మార్గంలో యనమదలలో ఈ రెండు ఆలయాలు  ఉన్నవి.

No comments: