💠 భారతదేశంలో సుప్రసిద్ధంగా వెలుగొందుతున్న అనేక శైవక్షేత్రాలలో గుంటూరునకు 7 కి.మీ.ల దూరంలో గల పెదకాకాని గ్రామంలో వేంచేసియున్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం ఒకటి.
💠 శ్రీరామచంద్రుడు, ఇంకా అనేక పురాణ పురుషులేగాక, శ్రీకృష్ణదేవరాయలు కూడా పూజించి మొక్కులు తీర్చుకున్న కాకాని క్షేత్రం గుంటూరు జిల్లాలో వున్నది.
ఇది దాదాపు 1000 సంవత్సరాల పురాతన ఆలయం.
💠 ఇక్కడవున్న మల్లికార్జునుని, భ్రమరాంబను శ్రీశైలంలో నెలవైన మల్లికార్జనుడు, భ్రమరాంబల అంశలంటారు.
అష్టాదశ శక్తులలో ఒకరైన శ్రీ భ్రమరాంబా దేవి ,ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీ మల్లికార్జున స్వామి ఇద్దరూ కొలువై ఉండటం కాకాని విశిష్టత .
💠 శ్రీశైల స్థలపురాణం లో కూడా కాకాని ప్రసక్తి ఉంది. ఈ క్షేత్రానికి సంబంధించి ప్రచారంలో వున్న కొన్ని గాధలు ...
💠 ఇంద్రకీలాద్రికి (విజయవాడలో కనకదుర్గమ్మ కొలువైన కొండ) గర్చపురికి (గుంటూరు) మధ్యగల ఒక సుందర వనంలో పూర్వం ఒక సిధ్ధయోగి చాలాకాలం పరమేశ్వరునిగూర్చి తపస్సు చేయగా, పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. సిధ్ధయోగి పరమేశ్వరుని ఆ స్ధలమందే వుండి భక్తులను బ్రోవమని కోరుకున్నాడు. పరమేశ్వరుడు ప్రసన్నుడై స్వయంభువుగా వెలిశాడు.
💠 సిధ్ధయోగులు చాలామంది ఇక్కడ స్వామిని బిల్వార్చనలతో, నృత్యగీతాలతో సేవించి స్వామి కృపా కటాక్షాలు పొందారు.
అందుకే ఈ ప్రదేశానికి సిధ్ధయోగ సమాజమనే పేరుకూడా వుంది.
ఇప్పటికీ భక్తులు పర్వదినాలలో ప్రభలు కట్టి మేళతాళాలతో, నృత్యగీతాలతో స్వామిని సేవించటానికొస్తారు.
💠 ఇక్కడి శివలింగం మరకత లింగం.
భరద్వాజ మహర్షి ఈస్వామి మహిమను గుర్తించి వచ్చి అర్చించాడు .
యజ్ఞం చేయ సంకల్పించి మహర్షిగానాన్ని ఆహ్వానించి యజ్ఞశాల నిర్మించాడు .
యజ్ఞం నిర్విఘ్నంగా సాగుతోంది, దేవతా ప్రీతి బాగా జరిగింది.. ఇంతలో ఒక కాకి ఇక్కడికి వచ్చి యజ్న ఆహుతులను తినటం ప్రారంభించింది .
యజ్ఞం అపవిత్రం అయి పోతుందని భరద్వాజ మహర్షి దాన్ని వారించే ప్రయత్నం చేశాడు .అప్పుడాకాకి మనుష్య భాషలో ‘’నేను కాకాసురుడిని .బ్రహ్మ కోసం తపస్సు చేసి మెప్పించి దేవతల కిచ్చే హవిర్భాగాన్ని తినే వరాన్ని పొందాను .అందుకే వచ్చి తింటున్నాను నువ్వు నిర్విఘ్నంగా యజ్ఞం పూర్తి చేసే సమయం దగ్గర కొచ్చింది .సమస్త నదీ జలాలతో శ్రీ మల్లేశ్వర స్వామికి అభి షేకం చేసి అభిషేక జలాన్ని నా మీద చల్లు .అప్పుడు నాకు శాప విమోచనం జరుగుతుంది ‘’అని చెప్పింది కాకి.
💠 ఆ కాకి చెప్పినట్లే భరద్వాజ మహర్షి చేయగా కాకి తెల్లని రంగులోకి మారి మానస సరోవరానికి యెగిరి వెళ్ళింది . ఇలాంటి మహా మహిమాన్విత లింగాన్ని మల్లె పూలతో మహర్షి అర్చించాడు అందుకే మల్లేశుడయ్యాడు .
💠 ఆ పక్షి,మానస సరోవరం నుండి ఆకాశ మార్గం లో ఎగురుతూ తమిళనాడు లోని పక్షి తీర్దానికి వెళ్లి సర్వేశ్వర దర్శనం చేసి .బలిని స్వీకరించి మళ్ళీ వెళ్లి పోతూ ఈ కాకాని మల్లేశుని దర్శనం చేసుకొంటుంది .
💠 ఇప్పటికీ ఆలయ తూర్పు భాగాన భరద్వాజుడు త్రవ్వించిన బావి ఉంది .మహర్షులందరూ సకల తీర్ధ పవిత్ర జలాలను తెచ్చి ఇందులో ఉంచారు .భరద్వాజ మహర్షి యజ్న ద్రవ్యాలను కూడా ఇందులో వదిలాడు .అందుకే దీనికి’’యజ్ఞాల బావి ‘’అనే పేరొచ్చింది.
💠 1440లో శ్రీకృష్ణ దేవరాయలు సందర్శించి మంత్రి ‘’రెంటూరి చిత్తరుసు’’ సలహాతో ఆలయ పునర్నిర్మాణానికి దనం సమర్పించాడు .
శ్రీకృష్ణదేవరాయని ఆస్ధానమునగల మంత్రి రెంటూరి చిట్టరుసుది ఈ గ్రామమని చెబుతారు.
శ్రీకృష్ణ దేవరాయలు స్వామిని దర్శించిన తర్వాతే పుత్రుడు జన్మించాడని చరిత్ర.
💠 ఇక్కడ భ్రమరాంబా మల్లికార్జునులతోపాటు సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా కొలువై వున్నాడు. అందకనే భక్తులు తమ పిల్లలకు చెవులు కుట్టించటం, నాగ ప్రతిష్ట చెయ్యటం వగైరాలు ఇక్కడ చేస్తారు.
💠 ఈ దేవాలయ ప్రాంగణంలో రాహు-కేతు గ్రహ మండపంలో గ్రహ పూజలు జరుగుతాయి. సర్పదోషమున్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటారు.
💠 పాలపొంగలి ::-----
శ్రీ స్వామి వారికి పాలపొంగలి నివేదనలు ఇక్కడ ప్రత్యేకత. శివ క్షేత్ర మైన ప్పటికీ వివాహాలు, సత్యన్నారాయణ వ్రతాలు,ఉపనయనాలు జరుపుకుంటారు. ముఖ్యంగా వాహనపూజకు ఇక్కడ అదిక ప్రాధన్యం ఉంది. వాహన యజమానులు క్రొత్త వాహనాలను కొన్నప్పుడు శ్రీస్వామి వారి సన్నిథి లో పూజచేయించుకోవడం శుభకరం గా భావిస్తారు.
💠 రాహుకేతుపూజలు ::----- ఎవరి జాతకం లోనైనా కాలసర్పదోషం టే రాహుకేతు పూజలు చేయించుకోవాలని శాస్త్రం చెపుతోంది. అటువంటి వారి కోసం ఈ ఆలయ ప్రాగణం లో నైరుతి దిక్కున రాహుకేతు మండపాన్ని నిర్మించి, విగ్రహాలను ప్రతిష్ఠించారు.పర్వదినాల్లో యాత్రీకుల రద్దీని తట్టుకొనేందుకు ప్రత్యేకం గా అభిషేకమండపాన్ని కూడ నిర్మించారు.
No comments:
Post a Comment