💠 పాలకడలి నుండి ఉద్భవించి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై కొలువుదీరి, జనావళికి సకల సంపదలను ప్రసాదించి సుఖసంతోషాలతో జీవితాన్ని గడిపేలా చూస్తూ వున్న చల్లని తల్లి శ్రీ మహాలక్ష్మి !
అటువంటి శ్రీలక్ష్మీదేవిని ఎనిమిది రూపాల్లో అష్టలక్ష్ములుగా ఆరాధిస్తూ వుండటం అనాది కాలం నుండి వస్తున్న ఆచారం.
💠 ధనం, ధాన్యం, విద్య, వైద్యం, విజయం, ఐశ్వర్యం, సంతానం, సౌభాగ్యం అనే అష్టకామనలు తీరుస్తూ వున్న అష్టలక్ష్ములు కొలువుదీరి ఆరాధనలందుకుంటూ వున్న ఆలయం హైదరాబాద్ కొత్తపేట వాసవీ కాలనీలోని శ్రీ అష్టలక్ష్మీ ఆలయం.
💠 కొత్తపేట వాసవీ కాలనీలో శ్రీ అష్టలక్ష్మీ ఆలయం నిర్మించడం వెనుక ఎంతో కృషి దాగియున్నది.
వాసవీ కాలనీలో నివసించే ప్రజల సంక్షేమం కోసం అందరూ కలసి వాసవీ వెల్ఫేర్ అసోసియేషన్ అనే సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారు తమ కాలనీలో ఒక ఆలయం నిర్మించాలని నిర్ణయించుకుని ఏం ఆలయం కట్టాలో అర్థంకాక పరిపరి విధాల ఆలోచించి గణపతి స్థపతి గారిని సంప్రదించారు.
ఆయన కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి వారిని సంప్రదించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని సూచించడంతో అసోసియేషన్ నాయకులు కంచికి వెళ్ళి స్వామి వారిని కలిశారు.
💠 వాసవీ కాలనీ వారి కోరిక విన్న స్వామివారు ఎంతో సంతోషించి అష్టలక్ష్మీ ఆలయం నిర్మిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.
స్వామివారి సలహా మేరకు అష్టలక్ష్మీ ఆలయాన్ని నిర్మించడానికి నిర్ణయించుకున్న అసోసియేషన్ వారు అప్పటికే ప్రసిద్ధి చెందిన తమిళనాడు రాష్ట్రంలోని ఉత్తర మేరూరులోను, చెన్నై అడయారులోనూ వున్న అష్టలక్ష్మీ ఆలయాలను దర్శించి, పరిశీలించి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
💠 అష్టలక్ష్మీ ఆలయ నిర్మాణానికి 1991 వ సంవత్సరం ఫిబ్రవరి 25న కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి, శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వాములవార్లు భూమి పూజ నిర్వహించి శంఖుస్థాపన చేయగా, ఐదు సంవత్సరాల వ్యవధిలో నిర్మాణం పూర్తికాగా 1996వ సంవత్సరం ఏప్రిల్ 28న దేవతా మూర్తులను ప్రతిష్ఠించి, కుంభాభిషేక కార్యక్రమాలను నిర్వహించారు.
💠 కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి, శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి, శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వాములవారు, ప్రతిష్ఠాకుంభాభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ విధంగా నిర్మితమైన ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఆరాధనలందుకుంటూ ఉంది.
💠 వాసవీ కాలనీలోని శ్రీ అష్టలక్ష్మీ ఆలయం అద్భుతమైన నిర్మాణంలో ప్రశాంతమైన వాతావరణంలో, మహిమాన్వితమైన దేవతా మూర్తులతో, నయనానందకరంగా దర్శనమిస్తుంది.
ఆలయం ఉత్తరాభిముఖంగా వుంది.
ప్రధాన ద్వారాన్ని దాటుకుని ఆలయంలోకి ప్రవేశిస్తే రెండు అంతస్తులుగా ఆలయం దర్శనమిస్తుంది. క్రింది అంతస్తులో కార్యాలయం, వంటశాల తదితరాలు వున్నాయి.
పై అంతస్థులో ప్రధాన ఆలయం ఉంది. సోపాన మార్గం ద్వారా పై అంతస్థుకు చేరుకోగానే సోపాన మార్గం సమీపంలోని చిన్న ఆలయంలో శ్రీ అభయ వినాయకుడు కొలువుదీరి పూజలందుకుంటున్నారు.
💠 వినాయకుడిని దర్శించుకుని ముందుకు వెళ్లే ప్రధాన ఆలయం, ఆలయానికి ఎదురుగా బలిపీఠం, ధ్వజస్తంభం వున్నాయి. మహామండపం, గర్భాలయ మండపాన్ని కలిగి ఉంది.
💠 గర్భాలయ మండపంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా ప్రధాన గర్భాలయం, దానికి చుట్టూ మరో ఏడు గర్భాలయాలు వున్నాయి.
ప్రధాన గర్భాలయంలో శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు శ్రీమన్నారాయణుడితో పాటు కొలువుదీరి దర్శనమిస్తాయి.
💠శ్రీమన్నారాయణుడు, శ్రీ ఆదిలక్ష్మీదేవి, ఇద్దరూ చతుర్భుజాలను కలిగి శంఖు చక్ర అభయ, వరద మద్రలో దివ్యాలంకార శోభితులై కన్నులపండుగగా దర్శనమిస్తారు.
💠 ఆలయానికి చుట్టూ, మూడువైపులా ఏడు గర్భాలయాలు వున్నాయి.
ఈ గర్భాలయాల్లో శ్రీ సంతాన లక్ష్మి, శ్రీ గజలక్ష్మి, శ్రీ ధనలక్ష్మి, శ్రీ ధాన్యలక్ష్మి, శ్రీ విజయలక్ష్మి, శ్రీ వీరలక్ష్మి, శ్రీ ఐశ్వర్యలక్ష్మి అమ్మవారు కొలువుదీరి, పూజలందుకుంటూ వున్నారు.
💠 గర్భాలయంలోని శ్రీమన్నారాయణుడు సాలగ్రామ మాలను ధరించి వుండడం వల్ల దర్శించుకున్నంతనే సర్వపాపాలు పరిహరింపబడతాయని, వీరిని దర్శించడం వల్ల అప్లైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర వచనం.
💠 శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ విదియ మొదలు వారం రోజులపాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
ఈ బ్రహ్మోత్సవాలలో శేష, హంస, గజ, గరుడ వాహన సేవలతోపాటు స్వామివారి కళ్యాణం, రథోత్సవం, కన్నుల పండుగగా జరుగుతాయి.
💠 ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శుక్లపక్ష ఏకాదశి నుండి, పౌర్ణమి వరకు పవిత్రోత్సవాలు, పుష్యమాసంలో అధ్యయనోత్సవాలు, వివిధ పర్వదినాల సందర్భంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు.
No comments:
Post a Comment