💠.భారతీయుల ఆనాది నుండి వైదిక పౌరాణిక మంత్రాల ద్వారా శ్రీ గణపతిని ఆరాధించి, పూజిస్తున్నారు. అట్టి పరమాత్మ అయిన గణపతి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు ఒకటిన్నర శతాబ్దాల క్రితం
ఆవిర్భవించారు.
సుదీర్ఘ చరిత్ర కలిగిన శ్రీగణపతి దేవాలయమునందు వెలసిన విఘ్ననాయకుడు తన కరుణాకటాక్ష వీక్షణాలతో నమ్మినవారికి శుభములు ప్రసాదిస్తున్నారు.
💠 1824 వ సంవత్సర ప్రాంతంలో నైజాము నవాబులు సరుకు రవాణా నిమిత్తము రైల్వే ట్రాక్స్ ప్రారంభం చేసారని రైల్వే లైన్ నిర్మాణము చేస్తు సమయములో వారికి విఘ్నములు ఏర్పడినవి.
అప్పుడు ప్రస్తుత రైల్వే స్టేషన్ శ్రీ గణపతి ఆలయము గల స్థలము వ్యవసాయ భూమియని అట్టి వ్యవసాయ భూమిలో దిగుడు బావి ఉండేదని ఆ బావిని నీటి సౌకర్యార్ధం బాగు చేయు సమయములో శ్రీ స్వామివారి విగ్రహం బావిలో లభ్యమైనదని పెద్దలు (పూర్వీకులు) చెప్తారు.
💠 ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ట చెయ్యడానికి
బ్రిటీష్ అధికారులు అభ్యంతరం తెలుపగా అధికారులకు స్వప్నంలో శ్రీవారు దర్శనమిచ్చి ఆలయ నిర్మాణమునకు ఎలాంటి అభ్యంతరములు తెలుపవద్దని ఆదేశించారు. వెంటనే ఆయన ఆలయ నిర్మాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగింది.
💠 అప్పుడు రాష్ట్ర అధికారులు, రైల్వే కార్మికులు శ్రీ స్వామి వారిని ఆరాధించి విఘ్నములు తొలగించుకొని రైల్వే లైను పూర్తిచేసినట్లు తదనంతర కాలంలో వారి అడ్డంకులు కూడా తొలగినట్లు, అప్పటి రైల్వే అధికారి సంతాన నిమిత్తం స్వామివారిని ఆరాధించి సంతానము పొంది ఆలయ నిర్మాణము గావించినారని పెద్దలు (పూర్వీకులు) స్వామివారి లీలలు వివిధములుగా చెప్పుకొనుచుందురు.
💠 ఇక్కడి వినాయకుడి విగ్రహము చతుర్భుజములు కలిగి కుడి చేతులలో అంకుశము ఎడమ చేతిలో డమరుపాశం కలిగి, క్రింది చేయి కతిమోకాలిపై ముద్రలో బోర్లించుకొని ఎడమచేతిలో బీజాపూర ఫలము కలిగి బింబముపై కుడివైపు చంద్రవంక ఎడమవైపు సూర్య బింబము కలిగి కుబేరస్థానము (ఉత్తరము) వైపు వెళ్ళు మూషికారూరుడై వెలసిన స్వామి భారతావనిలోనే విభిన్న రూపము అయిన విరుపాక్ష గణపతి రూపంలో వెలసినారు.
💠 శ్రీ గణపతికి వారి బాల్యములో ఉపనయన కాలములో సమస్త దేవతలు సమస్త ఆయుధములు బహుమతిగా ఇవ్వగా, ఈశ్వరుడు సాక్షాత్ తన రూపమైన (ఆత్మావై పుత్రనామాసి) అన్నట్లుగా తనయొక్క డమరుకము బహుమతిగా మొసంగి విరుపాక్ష గణపతిగా నామకరణము చేసినట్లు చెప్పబడియున్నది.
కావున ఈ స్వామి వారు విరూపాక్ష గణపతి అవతారములో ఉన్న విగ్రహం.
💠 ఈ దేవాలయం నందు 1932 సంవత్సరంలో శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం, శ్రీ ఆదిత్యాది నవగ్రహాలు నిర్మింపబడి ఆయా దేవతా విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి.
💠 1968 సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు తమ అధీనములోకి ఈ దేవాలయమును తీసుకొన్నారు.
నాటి నుండి ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది.
💠 శ్రీ గణపతి ఆలయంలో వేంచేసియున్న శ్రీ గణపతి అత్యంత మహిమాన్వితులు. ఈ దేవాలయమునందు శ్రీ ప్రతినిత్యం సత్యగణపతి వ్రతం జరుగును.
భక్తులు వారి కోరికలను అనుసరించి పూర్ణఫలం (కొబ్బరికాయ) మొక్కుబడిగా కట్టి మండలం (41) రోజులు, అర్థ మండలం (21) రోజులు పూజాధికములు నిర్వహించి వారి వారి కోరికలు తీర్చుకొంటున్నారు.
💠 ప్రతి నెలా కృత్తికా నక్షత్రమున శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి, శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామికి, శివరాత్రి సందర్భంగా శ్రీ ఉమా మహేశ్వర స్వామి వారికి, దసరా సందర్భంగా శ్రీ ఉమా మహేశ్వరి దేవికి నవరాత్రోత్సవములు జరుపుట ఇక్కడి సంప్రదాయం.
💠 శ్రీ గణపతి దేవాలయము నందు శ్రీ నవగ్రహ ఆలయములో
🔅 సూర్యునితో కలిసి ఉన్న నవగ్రహ సమూహమును ఆరాధించినా ఆరోగ్యసిద్ధి ;
🔅రుద్ర సుబ్రహ్మణ్య ఆదిత్యాది నవగ్రహ ఇత్యాది హోమములు నిర్వహించిన ధన లాభము ;
🔅ఉమామహేశ్వర ఆరాధన వలన జ్ఞానము;
🔅ఇక్కడి క్షేత్రపాలకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల మోక్షము ;
🔅శ్రీ ఉమామహేశ్వర ఆరాదన వల్ల జ్ఞానము;
🔅శ్రీ మహాకాళీ ,మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిని అయిన శ్రీ ఉమా మహేశ్వరి అమ్మవారి ఆరాధించుట వలనను సమస్త సన్మంగళములు సిద్ధించును ;
🔅హనుమత్ ఆరాధన వలన సమస్త శత్రు బాధలు ప్రయోగ బాధల నివారణ జరుగును
🔅 ఆలయములో వెలసిన సర్పబంధ విగ్రహములకు అభిషేకాదులు రాహు కేతు పూజ నిర్వహించడం వలన కాలసర్ప సర్ప దోషములు తొలగి భక్తుల అభీష్టం నెరవేరును.
💠 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు అనుకొని ఉన్న ఈ దేవాలయానికి ఎక్కడి నుంచి అయినా సులభంగా చేరుకోవచ్చు.
No comments:
Post a Comment