Adsense

Wednesday, June 15, 2022

శ్రీ ఉమా సమేత మార్కండేశ్వర స్వామి ఆలయం : రాజమండ్రి.


ఓంకార రూపం శివం శివం...

👉 శివుడి అనుగ్రహంతో చిరంజీవి అయిన భక్తమార్కండేయుడి కథ తెలిసిందే. సారంగధరుడి గురించి కథలూ నాటకాలూ సినిమాల ద్వారా వినే ఉంటాం. 
ఆ రెండు కథలకూ పుట్టినిల్లు మన రాజమహేంద్రవరమేనని తెలుసా..!

👉రాజకీయ, ఆర్థిక, సాంఘిక, చారిత్రక, ప్రాముఖ్యత కలిగిన పట్టణం రాజమండ్రి. ఆధ్యాత్మిక ప్రాశస్త్యమూ చెప్పుకోదగిందే. లలితాదేవి శ్రీ చక్రమధ్యగతమై దర్శనమిచ్చి ఇంద్రుడికి విజయాన్ని ప్రసాదించినట్టు చెప్పే కోటిలింగాల రేవు రాజమండ్రిలోనే ఉంది. 

👉అలాగే ఈ పట్టణంలో ఉన్న మరో రెండు పుణ్యధామాలు... ఉమామార్కండేశ్వరస్వామి ఆలయం, సారంగధరేశ్వరాలయం.

🔅మార్కండేశ్వర ఆలయ చరిత్ర : 

👉పూర్వం మృకండు మహర్షి ఆయన భార్య మరుద్వతికి సంతానం కోసం శివుని ఆర్థిస్తూ ఘోరతపస్సు చేశారు. ఆ తాపసి ఆ భక్తికి చలించిన మహాశివుడు ప్రత్యక్షమై ఏంకావాలో కోరుకోమని అడగ్గా తనకు సంతానం కావాలని కోరుకున్నాడు. అప్పుడు శివుడు... సంపూర్ణ ఆయుర్ధాయంతో ఐదోతనం లేని ఆడశిశువు కావాలో లేక పదహారేళ్లకే ఆయుషు నిండే తేజోవంతుడైన కుమారుడు కావాలో కోరుకోమన్నాడు. దానికా మహర్షి కొడుకునే ఇమ్మని కోరుకున్నాడు. కొంతకాలానికి మృకండు మహర్షి దంపతులకో మగబిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాడికి మార్కండేయుడు అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచసాగారు  

👉ఒక రోజు ఆ దంపతులు మార్కండేయునికి అతని ఆయుషు గురించి చెప్పి విలపించారు. మార్కండేయుడు తల్లిదండ్రులను ఊరడించి చివరి రోజుల్లో పరమేశ్వరుని సేవ చేసుకుంటానంటూ బయల్దేరాడు. తపస్సుకు అనువైన ప్రదేశం కోసం వెదుకుతూ రాజమహేంద్రి ప్రాంతంలోని గౌతమీ తీరానికి చేరుకున్నాడు. పవిత్రమైన ఆ ప్రదేశంలో ఇసుకతో శివలింగాన్ని చేసి ఘోర తపస్సు చేయసాగాడు.

👉అతని ఆయువు తీరే ఘడియలు సమీపించగానే యమధర్మరాజు తన పాశాన్ని అతడి పైకి విసిరాడు. మార్కండేయుడు అప్పటిదాకా తాను ఆరాధిస్తున్న లింగాన్ని కౌగిలించుకుని హరుని రక్షణ కోరాడు. భక్తుని మొర విని పరమశివుడు మహాగ్రంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ కోపం చూసి యముడు శంకరుని శరణు వేడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భక్తిప్రపత్తులతో తనను ప్రసన్నం చేసుకున్న మార్కండేయునికి పూర్ణాయువు ప్రసాదించాడు శివుడు. అలా ఆనాడు మార్కండేయుడు ప్రతిష్ఠించిన శివుడు ఉమామార్కండేశ్వరస్వామిగా భక్తుల పూజలందుకుంటున్నాడని స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది. 

👉శాసనాల ఆధారంగా రాజరాజ నరేంద్రుడు, చోళరాజులు, రెడ్డి రాజులు ఆలయ నిర్వహణ జరిపినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయ నిర్వహణా బాధ్యతలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దేవాలయ ధర్మదాయ శాఖ గ్రేడ్ ఒకటి కార్యనిర్వహణాధికారి ద్వారా చేబట్టుతోంది. 
 
👉ఈ దేవాలయం గోదావరి నది ఒడ్డున ఉంది. 
ఈ దేవాలయం ఉన్న ప్రదేశం దగ్గరలో చంద సత్రం శిథిలమైన మసీదు ఉండేది. శిథిలమైన మసీదుని పురావస్తు శాఖ వారు పరిశోధించి ఇక్కడ ఒక శివుని దేవాలయం ఉండేదని నిర్ధారణ జరిపారు.

👉1818 సంవత్సరంలో గుండు శోభనాధీశ్వర రావు అనే వ్యక్తి ఈ శివాలయాన్ని నిర్మించాడు. 
ఈ ఆలయం ఉన్న వీధిని గుండు వారి వీధీ అని పిలుస్తారు.

No comments: