Adsense

Wednesday, June 15, 2022

శ్రీ కోదండరామాలయం : తిరుపతి.


🔅 తిరుపతి పట్టణం నడిబొడ్డున విశాలమైన ప్రాంగణంలో శ్రీ కోదండ రామాలయం నయన మనోహరంగా దర్శనమిస్తుంది.  ఈ ఆలయానికి ఎదురుగా శ్రీ భక్తాంజనేయస్వామి ఆలయం ఉంది. ఇక్కడ శ్రీ రాముడు సీతా లక్ష్మణ సమేతంగా కొలువుదీరడం వెనుక ఆసక్తికరమైన స్థలపురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
 
👉భవిష్యోత్తర పురాణంలో శ్రీరాముడు సీతాన్వేషణ సఫలమగుటకు శ్రీవారి పుష్కరిణిలో స్నానమాచరించినట్లు చెప్పబడింది. రావణాసురుడి పై విజయం సాధించిన శ్రీరాముడు నేరుగా అయోధ్యకు వెళ్ళకుండా తన పరివారంతో తిరుపతి చేరుకుని ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్లు, ఇక్కడి  పుష్కరిణిలో స్నానమాచరించినట్లు స్థలపురాణం చెబుతోంది.  ఆలయ ప్రాంగణంలో ఆనాడు సీతమ్మవారు కూర్చుని సేదతీరిన అశ్వర్థనారాయణ వృక్షం ఇప్పటికి  మనం చూడవచ్చు.

👉అందుకు నిదర్శనంగా జాంబవంతుడు ఈ ఆలయంలో విగ్రహాల స్థాపన చేసినట్టు స్థలపురాణ కథనం. 
 
👉జనమేజయుడి తన తండ్రి పరీక్షిన్మహరాజు మరణానికి కారణమైన సర్పజాతిని పూర్తిగా నిర్మూలించాలని భావించిన జనమే జయుడు, సర్పయాగం చేసి, ఆ పాప పరిహారార్ధం 108 శివాలయాలను, 108 వైష్ణవాలయాలను నిర్మించినట్లు ప్రతీత. ఈ వైష్ణవాలయాల్లో తిరుపతిలో శ్రీ కోదండరామాలయం ఒకటి అని స్థలపురాణం చెబుతోంది.

👉ఈ గర్భాలయంలో శ్రీ రామచంద్రమూర్తి, కోదండరాముడుగా కొలువుదీరి వున్నాడు. స్వామివారు చేతిలో కోదండం, బాణం ధరించి దర్శనమిస్తారు. స్వామివారికి ఇరువైపులా శ్రీ సీతాదేవి, శ్రీలక్ష్మణస్వామి కొలువుదీరి ఉన్నారు. మామూలుగా రామాలయాల్లో శ్రీరాముడికి కుడి వైపున లక్ష్మణుడు, ఎడమవైపున సీతాదేవి వేంచేసి ఉంటారు. 
అయితే ఈ ఆలయంలో శ్రీ కోదండరామ స్వామివారు, దక్షిణ భాగంలో సీతమ్మ, వామ భాగంలో లక్ష్మణస్వామి స్థానక భంగిమలో ఆర్చామూర్తులుగా వెలసి ఉన్నారు. ఇలా దక్షిణభాగంలో అమ్మవారు ఉండడం వైఖానస ఆగమశాస్త్ర నియమం. ఇలా కుడి ప్రక్కన అమ్మవారు ఉండేలా దర్శించడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని పూర్వీకుల నమ్మకం.

👉ఈ ఆలయ ప్రతిష్టాపన సందర్భంగా పూజలు చేయడానికి ఉదయగిరి నుండి బ్రాహ్మణులను తీసుకుని వచ్చారట. వీరినే ఉదయగిరి బ్రాహ్మణులు అంటారు.

👉శ్రీ అన్నమయ్య మనువడు అయిన తాళ్ళపాక చిన్న తిరుమలయ్య ఒక ఉత్సవంలో రాములవారికి "తిరుప్పళి ఓడమ్'' అనే ఇడ్లీ నైవేద్యాన్ని ఏర్పాటు చేశాడట.

🔅శ్రీ ఆంజనేయ స్వామివారు ఈ గుడిలో లేకపోవడానికి కారణం 🔅

👉 ఇక్కడ శ్రీ రాములవారి గుడి లో ఆంజనేయుని మూలవిగ్రహం ఉండదు దాని వెనక ఒక గమ్మత్తయిన కథ ప్రచారంలో ఉంది ....అది ఏమిటంటే లంకలో రావణ వధ అయిన తరువాత శ్రీరాముడు సీతా లక్ష్మణ వానర సైన్యం సమేతంగా ఇక్కడికి వచ్చారు అనేది ఇక్కడి స్థలపురాణం . కానీ ఇక్కడకు ఆంజనేయుడు మాత్రం రాలేదు. 
దానికి కారణం రావణాసురుని మరణం తర్వాత తిరిగి అయోధ్యకు వస్తున్నాం అని అయోధ్యలో ఉన్న భరతుడికి వర్తమానం చెప్పమని శ్రీరామచంద్రుడు ఆంజనేయుడికి ఆదేశించాడు. 
రామ ఆజ్ఞ ప్రకారం ఆంజనేయుడు లంక నుండి నేరుగా అయోధ్యకు వెళ్ళిపోయాడు కనుక శ్రీరాముడు మరియు  వానర సైన్యం తో ఆంజనేయుడు ఈ క్షేత్రానికి రాలేదు కనుకే జాంబవంతుడు ఆంజనేయుని విగ్రహం లేకుండానే శ్రీరామ ,సీత ,లక్ష్మణ విగ్రహాలు గర్భగుడిలో ప్రతిష్టించాడు.
 
👉ఈ విషయం తెలుసుకున్న ఆంజనేయుడు ఎంతో బాధపడి, స్వామి వారి మీద అలిగాడాట... " నాకు నీ గుడిలో ఉండే అర్హత లేదా స్వామి అని, జాంబవంతుడికి చెప్పి నువ్వు నా విగ్రహం పెట్టించలేకపోయావా " అని స్వామి వారి మీద అలిగి గుడి బయటే బాధతో ఉండిపోయాడట...అందుకే ఈ గుడిలో మాత్రం ఆంజనేయుడి విగ్రహం గుడి ఎదురుగా ఉండే రోడ్డులో గుడికి అభిముఖంగా చిన్న అంగడి వీధిలోని ఆంజనేయస్వామి ఆలయం ఉంటుంది. 

🔅 గర్భగుడిలో రాములవారి పాద సౌందర్యం : 
👉 అలిగి బాధపడుతున్న పుత్రసమానుడైన ఆంజనేయుడిని ఓదార్చడానికి ఎప్పుడు బయలుదేరి వెళ్దామా అన్నట్టుగా కోదండ రామాలయం గర్భగుడిలోని రాములవారి మరియు సిత అమ్మవారి పాదాలు కొంచెం ముందు వెనుక గా, నడిచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న రీతిలో ఉంటాయి. లక్ష్మణ స్వామి విగ్రహ పాదాలు మాత్రం స్థానక భంగిమలో ఉంటాయి.
ఈ అద్భుతమైన పాద సౌందర్యం, ఆ నిల్చున్న భంగిమలో మార్పు మనం ఆ గుడికి వెళ్ళినప్పుడు తప్పక చూసి తీరవలసిందే.

👉( పరమాత్మకి భక్తులందరూ పుత్ర సమానులే కనుక ఆర్తితో, ప్రేమతో, భక్తితో పిలిచే ప్రతి భక్తుడిని కాపాడటానికి ఆ తల్లి తండ్రి కదలి రావటానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటారు  అని చెప్పడానికే ఇక్కడ స్వామి అమ్మవార్లు నిలుచున్న భంగిమలో, ఆ పాదాల అమరికలో స్పష్టమైన తేడా చూపిస్తున్నారు)

No comments: