Adsense

Tuesday, June 14, 2022

శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయం, వెలుగుగుట్ట, హైదరాబాద్


💠 వెలుగు గుట్ట ..భక్తుల కోర్కెలు తీర్చే దుర్గామాత

💠 ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, Genpac  సమీపంలో రెండు వందల సంవత్సరాల క్రితం గొర్రెల కాపరుల ద్వారా వెలుగు చూపిన వెలుగుగుట్ట పుణ్యక్షేత్రం నేడు ఎత్తైన ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులతో కిటకిటలాడుతోంది.

💠 ప్రకృతి ఒడిలో సకల సౌకర్యాలతో అందంగా తీర్చిదిద్దిన వెలుగు గుట్టపై వేకువ జామున తొలి సూర్య కిరణాలు పడడం వలననే వెలుగు గుట్టగా ప్రసిద్ధి చెందిందని (మల్లికార్జునుడు వెలసిన మల్లన్న గుట్టగా) పూర్వీకులు  చెబుతుండేవారు.

💠 దీన్ని ఉర్దూలో రోషన్ పహాడ్ అని పిలుస్తారు. రెండు దశాబ్దాల క్రితం గొర్రెలను మేపడానికి వచ్చిన గొర్రెల కాపరులను కొండపై ఎత్తైన రాళ్ళ మధ్య గుహలో కనిపించిన శ్రీ మల్లికార్జున స్వామి వారిని గుర్తించి  పూజలు చేయడం ప్రారంభించారు. 
ఆ తరువాత భ్రమరాంబ మల్లికార్జున స్వామిదేవాలయం, శ్రీ దుర్గామాత ఆలయం, ఆంజనేయస్వామి దేవాలయం, నవగ్రహ మండపాలను కురుమ యాదవులు, భక్తులంతా కలిసి నిర్మించుకుని నేడు ఆధ్యాత్మికతకు మారు పేరుగా వెలుగుగుట్టను తీర్చిదిద్దారు.

💠 వెలుగుగుట్టపై శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి, గణపతి సుబ్రహ్మణ్యస్వామి, నంది, నవగ్రహాలు, శ్రీ ఆంజనేయ స్వామి, విగ్రహ ప్రతిష్ఠలు అత్యంత వైభవంగా జరిగాయి. 

💠 గుడి, గోపురం, మండపాలు విశాలముగా నిర్మించారు. నల్గొండ జిల్లాలో తయారు చేసిన 35 అడుగుల ఏకశిల రాతి ధ్వజ స్తంభం ప్రతిష్ఠించారు. 

💠 శ్రీ జగద్గురు శంకరాచార్యులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఎందరో మహానుభావులు, ఋషులు తపస్సు చేసి దైవ దర్శనం పొందిన స్థలం అని, ఈ దేవాలయం నిర్మాణం అద్భుతంగా సాగుతుందని, భవిష్యత్తులో మహా పుణ్యక్షేత్రంగా వెలుగుతూ భక్తుల కోరికలు తీరుస్తూ కీర్తి ప్రతిష్టలు గడిస్తోందని తెలిపారు.

No comments: