Adsense

Wednesday, June 15, 2022

" కలియుగ వైకుంఠం " శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం : తిరుమల




" వేంకటాద్రి సమం స్థానం 
బ్రహ్మాండే నాస్తి కించన
 వేంకటేశ సమో దేవో 
న భూతో న భవిష్యతి" 

🔅 బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. 
అలాగే శ్రీనివాసుడికి సాటిరాగల దేవుడు ఇటు భూతకాలంలో కానీ.. అటు భవిష్యత్తులో కానీ మరెవరూ ఉండరు... ఇదీ శ్లోకానికి అర్థం.

👉 తిరుమల పుణ్యక్షేత్రం ‘కలియుగ వైకుంఠ’మని ప్రసిద్ధి. ఈ ప్రశస్తికి మూలకారణం.. స్వయం వ్యక్త స్వరూపంలో వెలిసిన శ్రీవేంకటేశ్వరుడు. తిరుమలగిరిపై పవిత్రాద్భుతమైన ఒక సాలగ్రామశిల ద్వారా స్వయంభూగా వెలసిన శ్రీ వేంకటేశ్వరుణ్ణి శ్రీనివాసుడని, సప్తగిరీశుడని, ఏడుకొండలవాడని, బాలాజీ, తిరుమలప్ప, తిమ్మప్ప అని.. ఇలా ఎన్నో పేర్లతో భక్తజనులు ఆర్తిగా సంబోధిస్తూ ఉన్నారు. ఆనందనిలయుడైన శ్రీవారు నెలకొన్న బంగారు మందిరానికి ‘ఆనంద నిలయ’మనే వ్యవహారం అనాదిగా ప్రసిద్ధమై ఉంది.

👉 "వేం" కారము అమృత బీజము, కటము అనగా ఐశ్వర్యము. అమృత ఐశ్వర్యముల సంగమముగా ఈ గిరి వేంకటాద్రి అయినది అనునది ఒక వివరము కాగా, "వేం" అనగా పాపము, "కట" అనగా హరించునది, కావున వేంకటాద్రి పాపహారిణి అనునది మరియొక వివరణము. 

👉 నారాయణుడు అను ఒక విప్రుడు ఈ అద్రియందు తపమాచరించి శ్రీమహావిష్ణువును ప్రత్యక్షము పొందినంత, ఆ విప్రుని పేరున నారాయణాద్రిగా ఈ గిరి వెలయునట్లు శ్రీమహావిష్ణువు అనుగ్రహించెను. 
మరియు చింతించిన దానిని ఇచ్చునది కావున "చింతామణి", జ్ఞానము నిచ్చునది యగుటచే " జ్ఞానాద్రి", సర్వ తీర్థమయము అగుటచే “తీర్థాద్రి", పుష్కరిణులు మిక్కిలిగా నుండుటచే "పుష్కరాద్రి", ఈ విధములుగా ఎన్నియో నామములతో ఈ గిరి విలసితమై యున్నది.

👉 108  శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో తిరుమల ( " తిరువెంగడం" ) ఒకటి.
శ్రీ భగవత్ రామానుజాచార్యులవారు తిరుమలను శ్రీగిరి అన్నారు .
 శ్రీ  అనే పదము తమిళంలో "తిరు " అని పిలుస్తారు ;  గిరి అనే పదము " మలై " అని పిలుస్తారు.. కావున ఆనాటి నుండి ఇది తిరుమలై అని పిలువబడింది

👉 ఈ పర్వతము కృతయుగమున" వృషాద్రి " అని త్రేతాయుగమున "అంజనాద్రి" అని,  ద్వాపరయుగమున " శేషాద్రి"  అదే కలియుగమున " వేంకటాద్రి " అని పిలువబడింది.

👉 ఈ పర్వతం సప్తాద్రి అనే పేరు కూడా కలదు.
ఈ వెంకటాద్రి ఇరవై పేర్లతో పిలువబడుతుందని బ్రహ్మాండపురాణం తెలియజేయునది.
అవి  అంజనాద్రి ,వృషాద్రి, శేషాద్రి, గరుడాద్రి, వేదాద్రి, శ్రీనివాసాద్రి, చింతామణిగిరి, వృషభాద్రి, వరాహద్రి, జ్ఞ్యానాద్రీ, కనకాచలము, ఆనందాద్రి,  నీలాద్రి, సుమేరు, శిఖరాచలం, వైకుంటాద్రి, పుష్కరాద్రి, వేంకటాద్రి ,నారాయణగిరి, తిరుమలై, సింహాచలం అనేవి ఆ 20 పేర్లు.

👉 శ్రీ వేంకటేశ్వర స్వామి నల్లని వర్ణంతో, తొమ్మిది అడుగుల ఎత్తులో, శంఖ, చక్ర, వరద, కట్యవలంచిత ముద్రలతో, కర్పూర తిలకంతో, సమదృష్టితో దర్శనమిస్తాడు. సాలగ్రామశిలా మూర్తి, ఆగమశాస్త్రాలకు అతీతంగా   ఉంటుందని చెబుతారు.

👉 కృతయుగంలో వృషభుడనే రాక్షసుడు తపస్సు చేయడం వల్ల వృషభాద్రియని, త్రేతాయుగంలో అంజనాదేవి తపస్సు వల్ల అంజనాచలమని, ద్వాపరంలో ఆదిశేషుడు దాగియుండడం వల్ల శేషాచలమని, కలియుగంలో పాపాలను పోగొట్టే పర్వతంబట్టి వేంకటాచలమని ప్రసిద్ధి. 

👉 ఈ యాత్రా స్థలం శ్రీవైష్ణవ సంప్రదాయం లోని 108 దివ్యదేశాలలో ఒకటి.

👉 శ్రీ వైఖానస భగవఛ్ఛాస్త్రోక్త మార్గాన్ననుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి. 
దీనినే ఆగమ పరిభాష లో షట్కాల పూజ అని అంటారు. అవి...ప్రత్యూష, ప్రాత:కాలం, మధ్యాహ్న, అపరాహ్ణ, సాయంకాల, రాత్రి పూజలు. 

👉 తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూష పూజలకు నాంది.
 రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే పవళింపు సేవనే ఏకాంతసేవ అంటారు. 
దీంతో ఆరోజుకి నిత్యపూజకి స్వస్తి వాచకం. 
 
👉 శ్రీవారిని దర్శించుకునే భక్తులు ముందుగా క్షేత్రపాలకుడైన వరాహస్వామివారిని దర్శించుకోవాలని స్థలపురాణంలో ఉంది.

👉 ఈ ఆలయంలో దాదాపు ఏడాది పొడవునా అనేక ఉత్సవాలు, పూజలు జరుపుకుంటారు.
9 రోజుల పాటు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ ఆలయంలో ప్రధాన ఘట్టం.

👉వైష్ణవ దేవాలయాలలో వైకుంఠ ఏకాదశి చాలా ముఖ్యమైనది.
రథసప్తమి మరో ముఖ్యమైన పండుగ. 
ఇతర వార్షిక ఉత్సవాలలో రామ నవమి, జన్మాష్టమి, ఉగాది, శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు, పుష్ప యాగం, పుష్ప పల్లకీ, తెప్పోత్సవం, వసంతోత్సవం ఉన్నాయి.

👉 రోజువారీ అర్చనలు, ధూపదీపనైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో తిరుమలవాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. 
అవి సోమవారం విశేషపూజ, మంగళవారం అష్టదళ పాద పద్మారాధన, బుధవారం సహస్ర కలశాభిషేకం,   గురువారం సడలింపు-నేత్ర దర్శనం-తిరుప్పావడ- నిజరూప దర్శనం సాయంత్రం పూలంగిసేవ, శుక్రవారం నాడు శుక్రవార అభిషేకం. 

No comments: