Adsense

Wednesday, June 15, 2022

శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం : అలివేలుమంగాపురం/తిరుచానూరు.


👉తిరుచానూరు లేదా అలమేలు మంగాపురం అనే ఊరు చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణం సమీపంకి 5km దూరంలో ఉంది. 
  
👉 అలిమేలు మంగమ్మ పుట్టినిల్లుగా తిరుచానూరు ప్రసిద్ది. 
దీన్నే 'అలమేలు మంగాపురం' అని కూడా పిలుస్తుంటారు . 
ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీదేవి అవతారమైన అలమేలు మంగమ్మ కొలువై ఉంటుంది. 
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం  చేసుకోక ముందే తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ తీర్థయాత్రకు ఫలం లభించదని పెద్దలు చెబుతారు.

🔅 ఈ ఊరు పేరు తిరుచానూరు ఎందుకు అయింది ? 
👉 ఇది ఒకప్పుడు శ్రీ శుఖ మహర్షి ఆశ్రమం కనుక దీనిని శ్రీ శుకనూరు అని పిలిచేవారు. 
ద్రావిడ భాషలో "  శ్రీ " అంటే శ్రీకరం, పవిత్రం అని అర్థం. 
కనుక ఇది ఆ తర్వాతి కాలంలో 
తిరుశుకనూరు అయ్యింది...అదే కాలక్రమేణా "తిరుచానూరు"  అయింది.
తిరుచానూరు అంటే పవిత్రమైన కోనేరు కల ఊరు అనే అర్థం కూడా ఉంది శాసనాలలో.

🔅 ఈ ఊరు పేరు  " అలివేలు మంగాపురం"  ఎందుకు అయ్యింది ? 
👉 ద్రావిడ బాషలో అలర్ అంటే తామరపువ్వు, "మేల్ "అనగా పైన," మంగై"  అంటే మంచి అందమైన  స్త్రీ.
అనగా...తామరపువ్వు పైన ఉద్బవించిన మంచి స్త్రీ అని అర్థం.

🔅 తిరుమల యాత్రలో ముందుగా ఆ తల్లినే ఎందుకు దర్శించాలి ? 

👉 లోకంలో మొదట మనం మన భాదలు, కోరికలు  మన అమ్మ తోనే చెప్పుకోవాలి, అప్పుడే తండ్రి దగ్గర మన పని సులువుగా అవుతుంది. 
బిడ్డ తన బాధ తల్లికి  చెప్పుకుంటే... ఆ తల్లి బిడ్డ తరఫున తండ్రి తో వాదించి, నచ్చజెప్పి ఆ తండ్రి చేత బిడ్డకు కావాల్సిన కోరికలు తీర్చేలా  చేసేది  అమ్మే కదా. 
మరి అమ్మలకన్న అమ్మ అలివేలు మంగమ్మ కనుక ముందుగా ఆ అమ్మని దర్శించి మనం తిరుమల యాత్రకు వచ్చిన కారణం ఆ తల్లితో నివేదించి స్వామివారికి చెప్పి ఒప్పించి కరుణించమని వేడుకుంటే చాలు , మన పని ఐపోయినట్టే  ! 
ఆ తర్వాతే మనం తిరుమల లో స్వామి వద్దకు వెళ్ళాలి. అక్కడా అమె ఆయన వక్షస్థలంపై ఉండి, ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఎదురుచూస్తూ ఉంటుంది. ఆ అమ్మ ఆయనలోని దయను పైకి ప్రసరించేట్టు చేస్తుంది.

🔅 ఈ తల్లి యొక్క వాత్సల్యం ఏమిటి ? 
👉 వాత్సల్యం అంటే, వత్సం అంటే దూడ, "వాత్సమ్" అంటే దూడపుట్టినప్పుడు అది కల్గి ఉండే మురికి, "ల" అంటే నాకి తీసి తొలగించేది. 
మనం తెలియకుండా తెచ్చుకున్న దోషాలు కొన్ని మనపై ఉన్నాయి కదా, ఇవన్నీ తొలగాలంటే అయనలోని ఈ గుణాలు పైకి రావాలి. అందుకే అమ్మ ఎప్పుడూ అయన పక్కన ఉంటుంది.

🔅 స్థల పురాణం : 
👉 తిరుమల క్షేత్రం స్థలపురాణం ప్రకారం వైకుంఠంలో త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడు. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి కొల్హాపూర్ వెళ్ళింది. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు.

👉 ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం, ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో స్వామివారిని వరించింది. కనుక లక్ష్మీ దేవియే పద్మములో జనించిన పద్మావతి లేదా అలమేలు మంగ.

👉 మరొక కథనం ప్రకారం త్రేతాయుగంలో సీత బదులు రావణుని చెర అనుభవించిన వేదవతిని మరుజన్మలో పెండ్లాడుతానని శ్రీరాముడు చెప్పాడు. ఆ వేదవతియే ఆకాశరాజు కూతురు పద్మావతిగా అవతరించి శ్రీనివాసుని వరించి పెండ్లాడినది. 
శ్రీనివాసుడు శిలగా అయినపుడు లక్ష్మీదేవి కొల్హాపూర్‌లో వెలసింది. పద్మావతి అలమేలుగా తిరుచానూరులో వెలసింది.

👉భూదేవియే గోదాదేవిగా అవతరించి శ్రీరంగనాధుని వరించింది. ఈమెను ఆండాళ్, ఆముక్త మాల్యద (తాల్చి ఇచ్చిన తల్లి), చూడి కొడుత నాచియార్ అని కూడా అంటారు. భూదేవి స్వరూపమే సత్యభామ అనికూడా పురాణ కథనం గమనించాలి

👉అలమేలు మంగ గుడిలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవికి చతుర్భుజాలు. రెండు చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. రెండు చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి.

👉ఈ ఆలయంలో ఉన్న మరి కొన్ని సన్నిధులు శ్రీకృష్ణ బలరాములు, శ్రీ సుందరరాజస్వామి, 

👉 శ్రీనివాసుడు 12 సంవత్సరాల తప్పసు చేసే ముందు తన స్వహస్థలతో ప్రతిష్ట చేసిన శ్రీ సూర్యనారాయణ ఆలయం తప్పక దర్శించాలి. ఇది పద్మ సరోవరం ఎదురుగా ఉంటుంది.

👉కార్తీక బ్రహ్మోత్సవాలు ఇక్కడి ముఖ్యమైన ఉత్సవం. అమ్మవారి అవతరణ దినమైన కార్తీక శుద్ధ పంచమి నాడు తిరుమలనుండి గజవాహనంపై వచ్చే చక్రత్తాళ్వార్‌తో అమ్మవారు స్నానమాచరించడం సంప్రదాయం. ఆ సుముహూర్తంలో లక్షలాది జన సందోహం భక్తితో పుష్కరిణిలో స్నానమాచరిస్తారు.

👉అమ్మవారి ఆలయంలో ప్రతిదినం ఉదయం సుప్రభాత సేవ జరుగుతుంది. తరువాత సహస్ర నామార్చన, కళ్యాణోత్సవము, కుంకుమ పూజ , ఊంజల్ సేవ ఉంటాయి. రాత్రి ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసివేస్తారు.

👉 ఇక్కడ ప్రసాదంతో పాటు ఇచ్చే పసుపు కుంకుమలను భక్తులు అతి పవిత్రమైనవిగా స్వీకరిస్తారు.

No comments: