Adsense

Wednesday, June 15, 2022

శ్రీ గోవిందరాజస్వామి ఆలయం : తిరుపతి (చిత్తూరు జిల్లా)

🔅 తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల్లో కొందరు వెంకన్నకు పెద్దన్నగా చెప్పబడే శ్రీ గోవిందరాజస్వామిని ముందుగా దర్శించుకొంటారు.
తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలసిపోయి తల కింద కుంచం పెట్టుకుని దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకొంటున్నాడట. 

👉శ్రీ గోవిందరాజ స్వామి గుడి తిరుపతి పరిసరాల్లోని గుడులన్నిటికంటే పెద్దది. ఇక గుడి రాజగోపురం అత్యంత ఆకర్షణీయంగా వుంది. సుదూర ప్రాంతం నుంచే కనిపిస్తుంది. 
 
👉 ఈ ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని నూతన పట్టణం ఏర్పడింది. అదే అభివృద్ధి చెందిన తిరుపతి మహానగరి. గోవిందరాజులు వెలసినారు కాబట్టి గోవిందరాజపట్టణం అనీ, రామానుజచార్యుల
వారు ప్రతిష్టించారు కనుక రామానుజపురం అనీ పిలిచేవారు. కాలక్రమేణ తిరుపతిగా మారింది. తిరు అంటే తమిళంలో శ్రీ అని అర్థం. శ్రీపతి అంటే వేంకటేశ్వరస్వామి అని కూడా అర్థం.

👉ఆ ఆలయ ప్రాంగణంలో పార్థసారథి శ్రీకృష్ణుడు (వేణుగోపాలుడు), ఆండాళ్  తదితర దేవాలయాలు ఉన్నాయి. విజయనగర శైలిలో నిర్మితమైన ముఖ మండపాలు, కళ్యాణ నుండపాలు అందులోని విశేష శిల్పసంపద అద్భుతంగా వుంది.

👉 తిరుపతి పట్టణంలో అడుగు పెడుతూనే యాత్రీకులను ముఖ్యంగా ఆకర్షించేది గోవిందుని రాజగోపురమే. ఆలయ రాజగోపురాన్ని మట్టి అనంతరాజు క్రీ.శ. 1624లో నిర్మించారు.

👉 శ్రీరామానుజా చార్యులు క్రీ.శ. 1129-30లో “ఎంబెరుమానార్' బిరుదాంకితమై తిరుమలకు వచ్చాడు.
 శ్రీ గోవిందరాజు విగ్రహ ప్రతిష్ట 24-2-1130 జరిగిందనే దానికి శాసన ఆధారాలున్నాయి.
రామానుజుని ఆదేశం ప్రకారం శయనమూర్తి విగ్రహ నిర్మాణం జరిగేటప్పుడు అనుకోని విధంగా మూర్తి భిన్నమయింది. భంగమయిన శయిన మూర్తి గోవిందుని అసలు విగ్రహాన్ని నరసింహాతీర్థం (మంచినీళ్ళ గుంట) ఒడ్డులో వదలి, ముహూర్త సమయం దగ్గరపడడంతో సున్నం (సుద్దతో విగ్రహాన్ని నిర్మించి ప్రతిష్టించారు. అందుకే శ్రీగోవింద రాజ స్వామి ఆలయంలో స్వామి వారికి అభిషేకాలుండవు. కేవలం "తైలకాపు" సేవలు మాత్రమే చేస్తారు.

👉ఈనాడు మనం చూస్తున్న విగ్రహం నిజమైన మూలవిరాట్ కాదు...శుద్ధతో చేసిన పెట్టుడు విగ్రహం. 

👉 చిదంబరంలో ఉత్సవ విగ్రహంగా వుండిన గోవింద రాజ స్వామి వారి విగ్రహం ఇక్కడ మూల విరాట్టు అయింది. అప్పటిటి వరకు మూల విరాట్టయిన వరద రాజ స్వామి విగ్రహం ఉత్సవ విగ్రహం అయింది.

👉 శ్రీ గోవిందరాజ స్వామి విగ్రహం ప్రతిష్ఠకు ముందే శ్రీ పార్థసారథి ఆలయం వుంది. ఇది ప్రధాన ఆలయం అనేదానికి కారణం మహా ద్వారానికి ఎదురుగా ఆలయం దక్షిణదిశలో శ్రీపార్థసారధి ఉత్తర దిశలో గోవిందుని ఆలయం వున్నాయి. 
శ్రీ అండాల్ అమ్మవారికి ఆలయంలో  ప్రత్యేక సన్నిధామం ఉంది.

👉ఈ ఆలయానికి రాజగోపురం (శ్రీమట్టి అనంతరాయల గోపురం) 7 అంతస్తులతోను , బంగారు కలశాలతోను నిటారుగ తిరుపతి పట్టణం మధ్యలో ప్రత్యేకతను సంతరించుకొని వుంది. 
ఈ గోపురం కాకుండా మరో రెండు గోపురాలున్నాయి. నడిమిగోపురం 15వ శతాబ్దంలో నిర్మితమయింది. ఈ గోపురపు అధిష్టానంలో గోడల పై రామాయణంలో రాముడు తన బాణంలో 7తాటి చెట్లను కూల్చిన దృశ్యం, భాగవతంలోని గోపికా వస్త్రాపహరణ దృశ్యాలను చెక్కబడి వుంది, అంతేకాక అనేక దేవతా మూర్తుల శిల్పాలు కూడా ఉన్నాయి.

👉 శ్రీపార్థసారధి ఆలయ ముఖమండపం కళ్యాణమండపం శ్రీకృష్ణదేవరాయల కళాభిరుచికి దర్పణం. ఇందులో శిల్పకళా నైపుణ్యం ప్రదర్శించబడింది. ముఖ్యంగా ఈ మండపంలో 4 విశిష్టమయిన నల్లరాతి స్థంభాల్లో ఎన్నో శిల్పాలున్నాయి. కేవలం ఐదారు అంగుళాల ఎత్తుగల కోలాట నృత్యభంగిమల శిల్పాలు వేదికపై కప్పులో వున్నాయి.

👉గోవిందుని ఆలయంలో వసంతమండపం, నీరాళీ మండపం, చిత్రకూట మండపం, కుంభ హారతి, లక్ష్మీదేవి మండపాలున్నాయి. ఆలయానికి అనుబంధంగా పుష్కరిణి ఉంది. దీనిని గోవిందరాజు పుష్కరిణి అంటారు. ఈ పుష్కరిణ లోనే తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ తెప్పోత్సవాలనే 'నీరాజోత్సవం' అని కూడా అంటారు.

👉 అనేక ఇతర సన్నిధానాలు ఈ ఆలయంలోని ప్రత్యేకత. 
శ్రీపార్థసారథి ఆలయం, గోదాదేవి గుడి (అండాళ్ సన్నిధి) శ్రీకళ్యాణ వేంకటేశ్వర ఆలయం, శ్రీలక్ష్మీ దేవి ( పుండరీక వల్లి తాయారు) గుడి, శ్రీభాష్యకారుల సన్నిధి (రామానుజాచార్యులు), శ్రీ తిరుమలనంబి, శ్రీమధురకవి ఆళ్వార్ల సన్నిధి. శ్రీ తిరుమంగై అళ్వారు. శ్రీవేదాంత దేశికుల సన్నిధులు వున్నాయి. విశేషంగా గోవిందుని ఆలయంలో దాదాపుగా ప్రతిరోజూ ఏదో ఒక ఉత్సవం ఉంటుంది. అది ఆళ్వారుల వారోత్సవ, పక్షోత్సవ, నక్షత్రోత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి.

👉 ఎప్పుడూ కళకళాడుతుండే ఈ ఆలయంలో నిత్యకళ్యాణాలే అధికారులు, ఇతర ప్రభుత్వాధికారులు - జడ్జిలు - సాధారణంగా ఈ ఆలయానికి విచ్చేసి దర్శనాడులు నిర్వహించుకొని తమ మొక్కులు తీర్చుకుంటుంటారు,

కానీ రాజకీయ నాయకులు మాత్రం ఈ గుడికి రావాలంటే వెనుకంజ వేస్తారు. రాజకీయ హోదాలో గుడిలో కాలుపెడితే పదవి కాస్తా గోవిందా! ఇది మాత్రం బలమయిన నమ్మకం.

No comments: