💠వృద్ధగౌతమి నదీ తీరంలో వెలిసిన సుప్రసిద్ధ శైవక్షేత్రం మురమళ్ల. ఇక్కడ ప్రధాన దైవం భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి.
స్వామి వారు నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్నారు.
మురమళ్ళ క్షేత్రం లో స్వామి వారికీ కళ్యాణం జరిపిస్తే ఆటంకాలు తొలిగి త్వరలోనే వివాహం అవుతుందని భక్తుల నమ్మకం.
💠 స్థలపురాణం ప్రకారం..
దక్షయాగ ఆహ్వానానికి నోచుకోకపోవడంతో వీరావేశానికి లోనెైన పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి... భద్రకాళీ రూపాన్ని ధరించిన పవిత్ర క్షేత్రం మురమళ్ళ.
ఇక్కడ భద్రకాళీ సమేతంగా భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు వీరేశ్వరుడు.
మునులు నివసించిన ఈ ప్రాంతాన్ని తొలుత ‘మునిమండలి’ అని పిలిచేవారు. అది కాలక్రమేణా ‘మురమళ్ళ’గా మారింది.
💠 దక్షుడు లోక సంరక్షణార్ధం చేస్తున్న ఒక యాగానికి అల్లుడెైన పరమేశ్వరుడిని ఆహ్వానించలేదు. ఈశ్వరుడి భార్య దక్షుడి కుమార్తె అయిన దాక్షాయని తన భర్త అనుమతి పొందకుండా ఆ యాగానికి వెళ్లింది. దక్షుడు అవమానించగా హోమాగ్నిలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంది. ఆ తర్వాత ఆవేశం తగ్గక కోటి సూర్య ప్రకాశంతో తిరిగాడు వీరభద్రుడు.
💠ఆ ఆవేశానికి భూమి అదిరింది. అక్కడక్కడ కొన్ని ప్రదేశాలు అగ్నికి ఆహుతయ్యాయి. వీరభద్రస్వామి ఆవేశాన్ని తగ్గించే బాధ్యతను తన మరో రూపమైన భద్రకాళికి అప్పగించింది ఆదిపరాశక్తి.
💠 గౌతమి నది ఒడ్డున ఒక ఆశ్రమం నిర్మించుకొని కొందరు మునులు నివసించేవారు.
అక్కడే ఆవేశంలో వున్న వీరభద్రుడు మదం పట్టిన ఏనుగులా తిరుగుతుండేవాడు.
భద్రకాళి ఆ ప్రదేశానికి వచ్చింది. ప్రక్కనే వున్న శరభయ్య చెరువులో మునిగి అతిలోక సౌంద ర్యవతిలా కన్యారూపం దాల్చి వీరభద్రుడికి దగ్గరెైంది. ఆమెను చూసిన క్షణమే వీరభద్రస్వామి ఆవేశం కొద్దిగా తగ్గింది. వెంటనే గాంధర్వ వివాహం చేసుకున్నాడు. వీరభద్రస్వామి ఆవేశమూ తగ్గింది. ఆనాటి నుండి వీరభద్రస్వామి దేవిని ప్రతి దినమూ కలుసుకునేవాడు.
ఈ నిత్య కల్యాణానికి అగస్త్యముని, విశ్వామిత్రుడు, వశిష్టుడు, గౌతమ మహర్షి మొదలెైన వారు వచ్చే వారని అంటారు.
💠 వీరభద్రస్వామి దేవిని వివాహం చేసుకున్న ఆచోట ఒక ఆలయం వెలిసింది. ఆ తర్వాత గౌతమి నది ఉప్పెనవల్ల మునిగిపోయింది. లింగరూపంలో వున్న వీరభద్రస్వామి, భద్రకాళిదేవి విగ్రహం వెల్లువలో కొట్టుకుని పోయి గోదావరి నదిలో మునిగిపోయి అట్టడుగుభాగాన వుండిపోయాయి.
💠 కుమారగిరిని పాలించేవాడు శరభరాజు. ఆ రాజుకు స్వప్నంలో వీరభద్రస్వామి గోదావరి నదిలో తానున్నట్టూ తనను వెలికి తీసి ఆలయం నిర్మించమని ఆజ్ఞాపించాడు. ఆ రాజు తన పరివారంతో గోదావరి నదికి వెళ్లి నదిలో మునిగిపోయివున్న వీరభద్ర స్వామిని వెలికితీసే ప్రయత్నంలో లింగం పై గునపం తగిలింది. రక్తం స్రవించగా గోదావరి నది ఎరబ్రారిపోయింది. ఆ సమయంలో ఆకాశవాణి తాను గోదావరి అడుగున వున్నానని బయటికి తీసుకెళ్ళమని పలికింది. రాజు అతని పరివారము లింగాన్ని వెలికితీశారు. కొంత దూరం తీసుకెళ్ళారు. అంతలో లింగం ఎవరూ మోయలేనంత బరువు పెరిగిపోయింది. ఆ స్వామికి అదే చోటే సరెైనదని నిర్ణయించు కున్న ఆ రాజు అక్కడే ప్రతిష్ట చేసి ఆలయం నిర్మించారు.
💠 మునులు ఆశ్రమంలో నివసించినందువల్ల ఆ ప్రదేశాన్ని మునిమండలి అని పిలువబడిన ఈ ప్రదేశం కాలక్రమేణా మురమళ్ళగా మారింది.
💠 ఇక్కడ ఆలయ గోపుర ద్వారం దాటి ముందుకెళ్తే పెద్ద ప్రాకారం బలిపీఠం, ధ్వజస్తంభం తర్వాత వున్న మండపంలో స్వామివారి ఎదుట రెండు నందులు. ఇందులోని చిన్న నందిని ఉపనంది అంటారు. గర్భగుడి ఎదుట కుడివెైపున వినాయకుడి దర్శనం లభిస్తుంది.
💠గర్భగుడిలో వీరేశ్వరస్వామి అనబడే వీరభద్రస్వామి లింగరూపం పశ్చిమ దిక్కున చూస్తున్నట్టున్న విగ్రహం చూడవచ్చు.
గునపం తగలడం వల్ల దెబ్బతిన్న స్వామి వారి లింగాన్ని దర్శించగలం.
💠ఇక్కడ వీరభద్రుడు భద్రకాళి కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఉంది వివాహ సాంప్రదాయం వైదిక స్మార్తాగమం ప్రకారం పురోహితులు నిత్యకళ్యాణం జరిపిస్తారు.
ఇక్కడ స్వామివారికి వివాహం జరిపిస్తే తమ సంతానానికి త్వరగా వివాహమవుతుందని భక్తులు విశ్వసిస్తారు.
అందువల్లే దాదాపు నెల ముందుగానే తమ పేర్లను భక్తుుల వివాహ మహోత్సవం జరిపించడానికి నమోదు చేసుకొంటారు.
💠కాకినాడ నుంచి యానాం మీదుగా బస్సు లు ఉంటాయి. రాజమండ్రి నుంచి మురమళ్లకు బస్సు లు ఉంటాయి.
No comments:
Post a Comment