🔅 శ్రీమన్నారాయణ మూర్తి అవతారాల్లో మిక్కిలి వింతైనది, భయంకరమైనది, గగుర్పాటు కల్పించేది శ్రీ నృసింహావతారం. కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలు నడిచినప్పటికీ పాలకులు నిరంకుశులై, నియంతలై సాధు సత్పురుషులను, ఋషిశ్వరులను, మునీశ్వరులను, తామసోత్తములను హింసిస్తూ, ప్రజా కంటకులుగా మారినందువల్ల శ్రీమహావిష్ణువు అవతారమెత్తి శిష్టరక్షణ, దుష్ట శిక్షణ చేశారు.
👉అలా ఒక నియంత పాలకుడైన హిరణ్య కశ్యపుణ్ణి సంహరించుటకు, భక్తుడైన ప్రహ్లాదుని నమ్మకాన్ని వమ్ము చేయక హిరణ్యకశిపుని సభ స్తంభంలో ఉగ్రనరసింహుడుగా ఉద్బవించిన అవతారం శ్రీనృసింహావతారం
👉హిరణ్యకశిపునే గాక కన్పడ్డ రాక్షసులను ఎక్కడెక్కడ సంహరించాడో ఆ ప్రదేశాల్లో నృసింహాలయాలు వెలశాయి.
అలా ఏర్పడిందే అనంతపురం జిల్లా తాడిపత్రి తాలుకు పెద్దపప్పూరు మండలం తిమ్మన చెరువు గ్రామ శివార్లలో వజ్రగిరి అనే కొండపై వెలసిన క్షేత్రం- వజ్రగిరి శ్రీలక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం .
👉ఈ క్షేత్రం అనంతపురం జిల్లా, తాడిపత్రి తాలూకా, పెద్దపప్పూరు మండలం, తిమ్మన చెరువు గ్రామానికి ఆగ్నేయదిశలో వజ్రగిరి' అనే కొండపై వెలసింది. ఈ ప్రాంతంలో బదరీ వృక్షాలు మెండుగా ఉన్నందున దీనికి బదరికాక్షేత్రం అనీ, స్వామిని బదరికా నృసింహ స్వామి అని అలాగే వజ్రగిరిపై వెలసినందున వజ్రగిరిక్షేత్ర మనీ, స్వామిని వజ్రగిరి లక్ష్మీనృసింహస్వామి అని పిలుస్తూ, కొలుస్తూ ఉంటారు.
🔅స్ధలపురాణం :
👉 పూర్వం కాలనేమిలాంటి రాక్షసులు కొండల పై నివసిస్తూ ఉండేవారు. వజ్రదేహుడైన నృసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత కొండలపై ఉన్న రాక్షసులను తరిమి తరిమి సంహరించాడు.
ఏ గిరిపై రాక్షసుణ్ణి సంహరించాడో, ఆ గిరిపై నృసింహాలయాన్ని భక్తులు నెలకొల్పుతూ వచ్చారు.
ఆ విధంగా వెలసిన క్షేత్రాలే యాదగిరినృసింహ క్షేత్రం, సింహగిరినృసింహ క్షేత్రం, మంగళగిరి నృసింహ క్షేత్రం, వజ్రగిరి నృసింహ క్షేత్రం మొదలైనవి.
ఈ వజ్రగిరిపై ఏ రాక్షసుణ్ణి సంహరించాడో ఇదమిత్థమైన సాక్ష్యాధారాలు లేవు. ఇచట కొన్ని శిలాశాసనాలుండేవనీ, అవి కాలగమనంలో కనుమరుగయ్యాయనీ జనవాణి.
👉ద్వాపరయుగంలో జనమేజయుడు ప్రతిష్ఠించిన ఈ ఆలయ క్షేత్రాన్ని ఎవరెవరు పరిపాలించారో సాక్ష్యాధారాలు లేవు.
నృసింహ క్షేత్రాలకు చక్కటి రూపుదిద్దినవారు కాకతీయులు, విజయ నగరరాజులు. ప్రస్తుతమున్న సాక్ష్యాధారాలను బట్టి విజయనగర రాజుల ఏలుబడిలో తిమ్మన అనే సేనానాయకుడు ఈ ప్రాంతాన్ని పాలించా డని తెలుస్తుంది. అతని పేరున ఈ గ్రామానికి ప్రజా సంక్షేమం కోసం చెరువుత్రవ్వించినందున తిమ్మనచెరువు అని పిలుస్తున్నా రని చెబుతారు. వారి పేరుతోనే ఈ ప్రాంతం తిమ్మనచెర్ల, తిమ్మానాయునిపేట, తిమ్మంపల్లి, తిమ్మనచెరువులాంటి గ్రామాలు వెలశాయి.
👉దాదాపు 40 సంవత్సరాల క్రితం తోట చంద్రశేఖరయ్య అనే ఉపాధ్యాయుడు తిమ్మనచెరువు గ్రామానికి బదిలీ అయి వచ్చారు.
శ్రీ చంద్రశేఖరయ్యగారు మంచితనానికి మారుపేరు. అంతకుమించిన భక్తిపరుడు. ఇతని భార్య శ్రీమతి రంగనాయకమ్మ. ఆమె అనుకూలవతియైన అర్ధాంగి. వీరు ప్రతి శని, ఆదివారాల్లో వజ్రగిరినృసింహస్వామిని దర్శిస్తుండేవారు. అపుడు కొండపైకి కాలిబాటమాత్రమే ఉండేది. స్వామివారి దర్శనంచేతనే అతనిమదిలో పెనుమార్పు వచ్చింది. ఎలాగైనా ఈ క్షేత్రాన్ని, జీర్ణోద్ధరణ గావించా లని సంకల్పించి, అందుకై నడుం కట్టాడు.
గ్రామ పెద్దలను, అధికార సభ్యులను సంప్రదించి, కొండ పైకి రోడ్డు నిర్మాణం గావించారు. భక్తులు విరివిగా రావటంతో గ్రామగ్రామాలు తిరిగివారు ఇచ్చినవిరాళాలతో విశాలమైన 'హాలు' నిర్మించారు. విరాళా లిచ్చిన దాతల పేర్లను హాలుగోడలపై వ్రాయించారు. “మానవసేవయే మాధవసేవ" అనుకున్నారేమో ఆరుసంవత్సరాల క్రిందట అనగా 2008లో ఒక వృద్ధాశ్రమాన్ని నెలకొల్పారు. ఇరవైమంది వృద్ధులు ఇచట ప్రశాంత జీవనం సాగిస్తున్నారు. శ్రీ చంద్రశేఖరయ్య గారు కార్యకర్తగా కార్యనిర్వాహకుడై క్షేత్రావసరాలకు కావలసిన ప్రతిదీ వారే చూచుకోవటం విశేషం. శ్రీ చంద్రశేఖరయ్యగారిని తిమ్మన చెరువుకు శ్రీస్వామివారే రప్పించు కున్నారేమో అనిపిస్తుంది. చంద్రశేఖరయ్యగారు, ఆయనసహ ధర్మచారిణి రంగనాయకమ్మగారు స్వామి సేవలో పునీతులై గ్రామ ప్రజల ప్రశంసలు పొందారు. గుడికి పశ్చిమభాగంలో మెట్లు నిర్మించారు. గాలిగోపురాన్ని ఆధునిక వాస్తుకళారీతుల్లో నిర్మిస్తు న్నారు. వారి సేవలు అభిలషణీయం, అభినందనీయం.
👉స్వామి ఆలయానికి ఉత్తరభాగంలో అశ్వత్థవృక్షం దర్శనమిస్తూంది. ప్రతినిత్యం భక్తులు ఈ వృక్షానికి పూజాలు చేస్తున్నారు.
👉ఈస్వామిని సేవించటానికి ఈ ప్రాంత ప్రజలేగాక బహుదూరప్రాంతాలనుండీ భక్తులు వస్తుంటారు. శ్రీస్వామి కొలిచినవారికి కొంగుబంగార మని చెప్పటంలో అతిశయోక్తి లేదు.
👉 ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి, పున్నమి రోజులలో స్వామివారి కల్యాణం, ఆ తరువాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది.
👉తాడిపత్రి పట్టణం నుండి బస్సు సౌకర్యం ఉంది. విరివిరిగా ఆటోలు తిరుగుతుంటాయి.
No comments:
Post a Comment