Adsense

Wednesday, June 15, 2022

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం : పెన్న అహోబిలం. (అనంతపురం)



🔅 ఈ క్షేత్ర మహత్యం ప్రకారం స్వామి వారు హిరణ్యకశిపుని సంహారం చేసాక ఇక్కడకు రావడం...స్వామి కోసం ప్రహ్లాదుడు, పరమేశ్వరుడు, మహా లక్ష్మి, బ్రహ్మా మొదలగు దేవతలు రావడం ....స్వామి పాదాలు బ్రహ్మ కడగడము అదే పెన్నా నదిగా మారడం అనేది స్థూల చరిత్ర.

👉ఇప్పటికి స్వామి వారి గర్భలయం లో స్వామి పాదాల వద్ద చిన్న గుంట లో నీరు రావడం చూడచ్చు.. అదే పెన్నా నదిగా మారింది.
ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన నీరు, ఈ బిలం గుండా వెళ్ళి పెన్నా నదిలో కలుస్తుంది. అందువలన ఈ క్షేత్రానికి "పెన్న అహోబిలం" అను పేరు వచ్చిందని స్థలపురాణ కథనం.

👉ద్వాపర యుగంలో ఉద్ధాలక మహర్షి క్షేత్రగిరిపై ఘోర తపస్సు చేయగా స్వామి ప్రసన్నుడై తన కుడిపాద ముద్రికను గిరిపై అలాగే కర్నూలు జిల్లా అహోబిల క్షేత్రంలో ఎడమ పాదాన్ని ప్రతిష్టించినట్లు ఇక్కడి శాసనాలు, స్థల, పద్మ పురాణాలను బట్టి తెలుస్తోంది.

👉పెన్న అహోబిల క్షేత్రం అనంతపురం జిల్లా, ఉరవకొండ మండలానికి చెందిన గ్రామము.. ఈ గ్రామం ఉరవకొండ మండలకేంద్రానికి, 12 కి.మీ.దూరంలోనూ, అనంతపురానికి 40 కి.మీ.దూరంలోనూ ఉన్నది.

👉శ్రీ నరసింహస్వామి కొలువుదీరిన ప్రాచీన పుణ్యక్షేత్రం ఇది.

👉క్రీ.శ. 14,15 శతాబ్దాలలో విజయనగర చక్రవర్తుల పరిపాలనా కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది..

👉విజయనగర పాలకుడు సదాశివరాయలు దిగ్విజయ యాత్రముగించుకొని పెనుగొండ నుంచి రాజధాని నగరానికి పోతూ స్వామి వారిని దర్శించుకొన్నాడు. అప్పుడు జీర్ణావస్థలో ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించమని రాజప్రతినిధి ఉదిరప్ప నాయుడుని ఆదేశించారు. అలాగే దేవాలయానికి 2వేల ఎకరాల భూమిని దానం చేశారు. 1979లోశ్రీ లక్ష్మీనరసింహస్వామి పాదముద్రికకు కొంత పైభాగంలో స్వామివారి మూలవిరాట్‌ను ప్రతిష్టించారు. అప్పటినుంచి స్వామివారి మహిమలు ద్విగుణీకృతమైనట్లు భక్తజనకోటి ప్రతీతి. అలాగే దేవస్థానానికి దిగువభాగంలో శ్రీ ఉద్భవ లక్ష్మి అమ్మవారి ఆలయాన్ని 1987లో నిర్మించారు. 
స్వయంభువుగా వెలసిన పుట్టుశిల ముందు భాగంలో ప్రతిష్టించారు. 

👉ఆగమశాస్త్రం ప్రకారం నిత్యం అలంకరణ, పూజలు నిర్వహిస్తున్నారు. 
స్వామివారికి ఆకు పూజలంటే బహుప్రీతి. స్వామివారికి ఆకు పూజలు కట్టించి మొక్కులు నివేదిస్తే 41 రోజుల్లో కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 
అమ్మవారిని ప్రసన్నం చేసుకొనే విధంగా అవివాహితులు, సంతానహీనులు పట్టువస్త్రాలను సమర్పించి కుంకుమార్చనలు చేస్తే తమ కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

👉తమ మొక్కు నెరవేరినందుకు ఓ గొల్లభామ పాలమ్మిన సొమ్ముతో గోపురాన్ని నిర్మించారు. దాన్ని పాలగోపురంగా నేటికి పిలువబడుతోంది. అది భక్తులను విశేషంగా ఆకట్టుకొంటుతోంది.

🔅 ఏటిగంగమ్మ జాతర 🔅
👉ప్రతిఏటా మాఘమాసంలో స్థానిక వంతెన సమీపంలో వైభవంగా ఏటి గంగమ్మ జాతర నిర్వహిస్తారు. నిత్యంస్వామివారి పాదాబి షేకం చేసిన జలంకలిస్తుంది. దీంతో గంగ స్నానాలు చేస్తే సర్వపాపాలు హరించి సకలశుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

🔅 బసవన్నకోనేరు 🔅
👉ఆలయ దిగువ భాగంలోఉన్న లక్ష్మమ్మ మంటప సమీపంలో బుగ్గ బసవన్న కోనేరులో ఏడాది పొడుగునా నీరు ప్రవహిస్తోంది.
చెట్ల తొర్రల నుంచి బసవన్న నోటి గుండా నీరు కోనేరులో చేరుతుంది.
ఈ కోనేటిలో స్నానాలు చేస్తే మానసిక రుగ్మతలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారనేది భక్తులు భావన.

🔅 భగిరి గుండ్ల ప్రాముఖ్యత 🔅
👉 స్థానిక దేవస్థానం నుంచి రెండు కి.మీ దూరంలో ఉన్న భగిరిగుండ్ల అటవీప్రాంతంలో ఉగ్రనరసింహస్వామి వెలసి ఉన్నారు. ఉగ్రనరసింహస్వామి పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుని ప్రార్థనలకు శాంతించి చెంచులక్ష్మిని తన వెంటబెట్టుకొని వనవిహారంగా వ్యాహాళికి ఈ అరణ్య ప్రాంతానికి వచ్చి వరాహ రూపంలో ఉన్న ఒక రాక్షసున్ని తరిమితరిమి భగిరిగుండ్లపై సంహరించినట్టు తెలుస్తోంది.
 స్వామివారికి బ్రహ్మ రథోత్సవం తర్వాత రెండవ రోజున భక్తులు వచ్చి పూజలు చేస్తారు

👉ఇక్కడ స్వామి వారు దేవేరి "స్వయంభూ ఉద్భవ మహా లక్ష్మీ", అమ్మవారు స్వయంభూ మూర్తిగా వెలిసారు
స్వామి తో పాటు,గరుడ,క్షేత్ర పాలకుడు :ఆంజనేయ స్వామి, పడమర ముఖంగా పరమేశ్వరుడు వెలిసి ఉన్నారు.

👉ఇక్కడకు వచ్చిన వారు పెన్నా నది లో తప్పకుండా స్నానము చేయడం పద్ధతి కనీసం,ముఖము కాళ్ళు అయిన కడుగుకోవడం పద్ధతి.

👉ఇక్కడ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడు కావున ఎక్కడ లేనాన్ని కోతులు ఇక్కడ ఆలయం లో చుట్టూ పక్కల దర్శనమిస్తాయి.
ఇక్కడ ఇతి బాధలు,పిశాచ భూత బాధలు ఉన్నవారు తీరని జబ్బులు ఉన్నవారు నిద్ర చేయడం కూడా అనాదిగా వస్తున్న సంప్రదాయం.

👉ఈ క్షేత్రము అనంతపురం నుంచి ఉరవకొండకు వెళ్లే మార్గంలో ఉంది.

No comments: