Adsense

Wednesday, June 15, 2022

చింతల శ్రీ వేంకటరమణ స్వామి ఆలయం : తాడిపత్రి, అనంతపురం జిల్లా

 
🔅 తాడిపత్రి పట్టణం పేరు మొదట తాటిపల్లి తర్వాత తాటిపర్తిగాను, ప్రస్తుతము తాడిపత్రి గాను వ్యవహరించబడుతూ వుంది.
దీనికి వేదకాలంలో భాస్కర క్షేత్రము అనే పేరు కూడావుంది.

👉పూర్వం ఈ ప్రాంతములో తాటిచెట్లు ఎక్కువగా వున్నందున తాటిపల్లి అనే పేరు వచ్చిందని,తాటకి అనే రాక్షసిని శ్రీరాముడు సంహరించినందున వల్ల ఆ పేరువచ్చిందని కూడా అంటారు.

👉 శివకేశవ ఆలయాలు రెండూ ఉన్న క్షేత్రమిది. ఒకటి చింతల వేంకటరమణ స్వామి వారి ఆలయమైతే రెండవది బుగ్గరామలింగేశ్వర స్వామివారి దేవస్థానం. రెండు దేవాలయాలలోనూ అద్భుతమైన శిల్పసంపదతో మురిపిస్తాయని చెప్పవచ్చును.
 
👉ప్రపంచంలోనే అత్యధికంగా హిందూ భక్తులు దర్శించుకుంటున్న దేవాలయం తిరుమల. 
శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కలియుగ ప్రత్యక్షదైవంగా భక్తులు పూజిస్తుంటారు. తిరుమల శ్రీవేంకటేశ్వరుడైనా, చిలుకూరిలోని బాలాజీ అయినా మరే ఇతర ప్రదేశాలలోని దేవాలయామైనా  శ్రీ వేంకటేశ్వర స్వామి వారికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది.
 ప్రతి ప్రదేశంలోనూ శ్రీనివాసునికి మహిమాన్విత దేవాలయాలున్నాయి. 
అలా అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతంలోని చింతల వెంకరమణ స్వామి వారి దేవాలయం కూడా ఒకటి.

👉అధ్బుతమైన శిల్ప సంపద అంటే గుర్తొచ్చేది ఉత్తరాదిన ఖజురహో, దక్షిణాదిన హళేబీడు, బేలూరు లోని హొయసలేశ్వర గుడి మరియు చెన్నకేశావాలయం . అటువంటి గుడులకు ఏ మాత్రం తీసిపోని శిల్ప సంపద ఉన్న గుడులు తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం , శ్రీ చింతల వెంకట రమణస్వామి దేవాలయం. 
విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయాలు , ఆలయాల నిర్మాణంలో ద్రవిడ శిల్ప శైలికి చక్కటి ఉదాహరణలు.

👉చింతలరాయస్వామి దేవాలయం లేదా శ్రీ చింతల వెంకటరమణ దేవాలయం భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో ఉన్న ఒక వైష్ణవ దేవాలయం .
 
👉ఈ ఆలయంలో హంపిలోని విఠల దేవాలయంలో ఉన్నటువంటి గరుడ మండపాన్ని తిరిగే గ్రానైట్ చక్రాలతో రథంగా నిర్మించారు


👉ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో పూర్వం చింతచెట్లు ఎక్కువగా ఉండటం వల్ల, విగ్రహం చింతచెట్టు తొర్రలో దొరకడం వల్ల ఇక్కడి స్వామిని " చింతల తిరువేంగళ నాథ స్వామి"  అని పిలిచే వారు. 
క్రమంగా చింతల వేంకటేశ్వర స్వామి లేదా చింతల వేంకటరమణ స్వామి అని పిలుస్తున్నారు.
చింతలు తీర్చే దైవమని చింతల వెంకటరమణ అనే పేరు వచ్చింది అనే నమ్మకం కూడా ఉంది.

👉వేంకటరమణుని ఆలయం బుక్కరాయల కాలంలోనూ,. రామలింగ దేవాలయం ప్రొడదేవరాయల కాలంలోనూ నిర్మింపబడినట్టు తెలిపే శాసనాలు లభ్యమయ్యాయి. 
ఎవ్వరైనా ఇక్కడ సొగసులు తీరిన వేంకట రమణుని ఆలయాన్నీ, రామలింగేశ్వర ఆలయాన్ని చూస్తే ఈ స్థలం దేవాలయాల భూమియా! అన్న ఆశ్చర్య ఆనందాలు మదిలో నింపుకుని వస్తారు. 

👉ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. 
వాటిలో ముందుగా చెప్పుకోవాల్సినది సూర్యుని వెలుతురు కిరణాలు గర్భగుడిలోని స్వామి వారి పాదాలను తాకడం. ఆ తర్వాత చెప్పుకోవల్సినది ఆలయం నిర్మాణంలోని శిల్ప సౌందర్యం. ఆలయం ముందు భాగంలో ఉన్న రాతిరథం హంపిలోని ఏకశిలారథాలను పోలి ఉంటుంది. 
కదలిక మినహా రథానికి ఉండాల్సిల హంగులన్నీ ఉన్నాయి.

👉రథంలో నాలుగు అడుగుల గరుత్మండి విగ్రహం ముకుళిత హస్తాలతో దర్శనమిస్తుంది. ఆలయం చుట్టూ, లోపల అపారమైన శిల్పసంపద ఉంది.
 దేవాలయ మంటపం ఈ రాతి రథం నుంచి ప్రారంభమై 40 స్తంభాలపై నిర్మితమై ఉంది.
ఇది కూడా హంపీలోని విఠలాలయాన్ని పోలి ఉండటం విశేషం.

👉గర్భగుడిలోని మూల మూర్తి విగ్రహం సుమారు 10 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి నుంచి ప్రారంభించి వరుసగా మూడు రోజుల పాటు సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకుతాయి.
ఈ కిరణాలు స్వామి విగ్రహానికి సుమారు 70 అడుగుల దూరంలో ఉన్న రాతి రథంలోని రంధ్రాల గుండా ప్రవేశించి స్వామివారి మీద పడేలా ఏర్పాటు చేశారు.

👉ఈ ఆలయ ప్రాంగణంలోని సీతారామ స్వామి ఆలయం, పద్మావతీ దేవి ఆలయం, పన్నిద్దరాల్వార్ల్ వారి మందిరం, ఆంజనేయస్వామి వారి మందిరం, ఆనంద వల్లి, లక్ష్మి చెన్నకేశవ స్వామి మొదలైన ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. 

👉ఏటా ఆశ్వీయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) నుంచి బహుళ తదియ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి.

 
👉ఈ ఆలయం తూర్పు దిశగా ఉన్నది. వెంకట రమణుడి ప్రధాన ఆలయానికి ప్రక్కనే లక్ష్మి దేవి "ఆనందవల్లి అమ్మవారు" గా చిన్న ఆలయం లో కొలువై ఉన్నది.

No comments: