💠 కాకులు దూరని కారడవి అనే పదం మీరు వినే ఉంటారు. కానీ కాకులు వాలని కొండ గురించి ఎప్పుడూ విని ఉండరు.
అవును ఈ కొండపై కాకులు వాలవు. సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తాయి.
కానీ గుంటూరు జిల్లా నరసరావుపేటకు సమీపంలో ఉన్న కోటప్ప కొండపై మాత్రం కాకులు వాలవు.
దీనికి కారణం కాకులకు ఉన్నటువంటి శాపం ఆ స్థానికుల అభిప్రాయం.
అసలు ఈ కొండపై కాకులు వాలకపోవడానికి కారణం ఏమిటి?
ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందుగా కోటప్ప కొండ చరిత్ర గురించి తెలుసుకోవాలి.
💠 కోటప్పకొండను త్రికోటేశ్వరాయలం, త్రికుటాద్రి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఏ దిశలో చూసినా రుద్ర శిఖరం, బ్రహ్మ శిఖరం, విష్ణు శిఖరం అనే మూడు శిఖరాలు దర్శనమిస్తాయి.అందుకే దీనిని "త్రికుటాద్రి” అని పిలుస్తారు.
💠 కోటప్ప కొండ గొప్ప శైవ క్షేత్రంగా కీర్తి పొందింది. మహశివరాత్రికి ఘనంగా అభిషేకాలు, పూజలు జరుగుతాయి. ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక విద్యుత్ ప్రభలు వస్తాయి.
💠 కొండపై “చతుర్ముఖ బ్రహ్మ” ఆకృతి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది.ఈ ప్రధాన మండపంలో స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఒక పక్క వినాయకుడు మరొక ప్రక్క కుమార స్వామి, మధ్యలో మోద దక్షిణామూర్తి అయిన శివుడ్ని ఆరాధిస్తూ, సేవిస్తూ ఉన్న ఋషి పుంగవులు దర్శనం ఇస్తారు.
ఎడమ ప్రక్క పద్మాసనం మీద ఉన్న ధ్యాన శివుడి విగ్రహం గల “ధ్యాన మందిరం” ఉంది. యాగశాల, నవగ్రహ మండపం కూడా ఉన్నవి.
💠 దక్షయజ్ఞము వల్ల సతీదేవి వియోగం తర్వాత పరమ శివుడు పిచ్చివాడై ముల్లోకాలు తిరుగుతుండగా ఆ శివుడ్ని ఆకర్షించి, ఆశ్రయమిచ్చి, బాల దక్షిణామూర్తి రూపంలో 12 సంవత్సరాలు ధ్యాన నిమగుడ్ని గావించిన స్థలమే ఈ త్రికోటేశ్వరాలయం.
ఈ క్షేత్రం మీద శివుడు తపస్సు చేస్తుండగా “ఆనంద వల్లి” అనే గొల్ల భామ పాలు, తేనెలతో సేవించుచుండెను. శాలంకయ్య అనే రైతు శివుడు తపస్సు చేసే ప్రాంతానికి రావటంతో అతనికి బాలయోగి రూపంలో ఉన్న శివుడు కనిపించాడు. శివుడికి భక్తితో నమస్కరించి తన దగ్గర ఉన్న పండ్లను స్వామికి సమర్పించాడు.
💠 ఒకసారి గొల్ల భామ శివుడ్ని సేవించడానికి పాలను తీసుకువెళ్తూ అలుపు వల్ల తట్టను, పాల కుండలను ఒక గట్టు మీద ఉంచి సమీపంలో ఉన్న చెట్టు పూలను కోస్తూ ఉండగా ఒక కాకి వచ్చి పాల కుండలపై వ్రాలి పాలను ఒలకబోయటంతో అది చూచి గొల్ల భామ కోపంతో “ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదు” అని శపించెను.
💠 ఒకనాడు శాలంకయ్య శివుని వద్దకు వచ్చి “తన యింటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని” వేడుకున్నాడు.
అప్పుడు స్వామి “అలాగే వస్తానని, నువ్వు యింటికి వెళ్లమని” చెప్పారు. గొల్ల భామ గర్భవతై “కొండకు రాలేకపోతున్నాను తండ్రీ, నీవే క్రిందకు రా!” అని శివుడ్ని వేడుకొనెను. ఆమె మొర విని శివుడు గొల్లభామతో నేను క్రిందకు దిగునంత వరకు నీవు వెనుతిరిగి చూడరాదు” అని అనగా, “సరే” అంటూ ఆ గొల్లభామ పద ముందుకు నడుచుకుంటూ పోతూ ఉండగా సాంబశివుడు వెనుకగా బయలుదేరాడు.
శివుని పాద ధాటికి కొండలు పగిలి భయానకం కలిగించగా, ఆ గొల్లభామ వెనుకకు తిరిగి చూచినది.
💠 ఆమె చూడగానే పరమ శివుడు “లింగ రూపంగా మారాడు. ఆ గొల్లభామ “శిల” రూపంగా మారినది.
ఆ సమయంలో శాలంకయ్య “స్వామి ఆతిధ్యానికి” ఇంకా రాలేదని కొండ మీదకు రాగా ఈ దృశ్యం కనబడింది. శాలంకయ్య ఆశ్చర్యపోయి చూస్తూ విలపిస్తుంటే శివలింగం నుండి “ఈ కొండ క్రిందకు కోటి ప్రభలు ఏపుడు వస్తాయో, అప్పుడు నేను కొండ దిగి వస్తాను” అనే మాటలు వినిపించాయి. అప్పుడు శాలంకయ్య తన గ్రామం అయిన యలమందకు వచ్చి భక్తి శ్రద్ధలతో ఒక ప్రభను తయారు చేసి, దాని గురించి ప్రజలకు వివరించి, “మీరు ప్రభలు కట్టుకొని స్వామి దగ్గరకు రమ్మని” చెప్పెను.
💠 అప్పటి నుండి ప్రభలు కట్టుకొని భక్తులు వస్తున్నారు. స్వామి వారి అనుగ్రహంతో కొండవీడుని జయించిన శ్రీకృష్ణ దేవరాయులు “కోటప్పకొండకు వచ్చి విలువైన కానుకలు సమర్పించి, నిత్య ధూప దీప నైవేధ్యాలకు “కొండ కావూరు” అనే గ్రామాన్ని వ్రాసి యిచ్చాడు.
💠 ఇక్కడ గొల్లభామ ఆనందవల్లికి ఆలయం ఉన్నది. ఈ ఆలయమును, స్వామి వారి ఆలయమును శాలంకయ్య నిర్మించాడు. శాలంకయ్య అమ్మవారి ఆలయం కట్టించాలని అనుకున్నాడు. కాని. స్వామి వారు శాలంకయ్య కలలోకి వచ్చి "సతీ దేవి వియోగంలో ఉన్న వాడిని, ఆమెకు గుడి కట్టించవద్దు” అని చెప్పుటవలన అమ్మ వారి గుడి కట్టించలేదు.
💠 మహాశివరాత్రి, కార్తీక మాస సమయాల్లో కోటప్ప కొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. శివుడు దక్షిణామూర్తిగా, బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. కాబట్టి ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరగవు. పరమ శివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే.
💠 ఇది నరసరావుపేటకి 12 కి.మీ. గుంటూరుకి 56 కి.మీ. దూరంలో ఉంది.
No comments:
Post a Comment