Adsense

Wednesday, June 15, 2022

శ్రీ వైకుంఠపురం వేంకటేశ్వర స్వామి ఆలయం ; శ్రీ నందివెలుగు అగస్తీశ్వరాలయం : తెనాలి.



🌀 తెనాలి వైకుంఠపురం 
      శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం. 

💠 కళలకు కాణాచిగా విద్యలకు, కళాకారులకు పేరెన్నికగా ధర్మదాతృత్వములకు పెన్నిధిగా స్వాతంత్ర్య సమర ప్రతిపత్తులకు సముజ్వలముగా శిల్ప నైపుణ్యములకు జేగీయ మానముగా "ఆంధ్రప్యారీస్"గా యావద్భారత ఖ్యాతిచెందిన “తెనాలి” పట్టణమునకు అంతర్భాగమై దక్షిణముగా రేపల్లె రైల్వే బ్రిడ్జి సమీపములో నిర్మితమైన " శ్రీ వైకుంఠపురం వేంకటేశ్వర దేవాలయం"  భారతదేశంలోని దివ్యక్షేత్రములలో “ఒకటిగా నానాటికి ప్రసిద్ధికెక్కుచున్నది.

💠 శాంతికి, ప్రశాంతికి నిలయమైన వాతావరణంలో నిర్మించబడిన ఈ దేవాలయం కమనీయంగానూ కన్నుల పండుగగానూ కామితార్థదాయకంగానూ విలసిల్లుచున్నది. 
నిత్యకళ్యాణం పచ్చతోరణంతో విలసిల్లే కలియుగ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడు భక్తాభీష్టవరదుడై లక్ష్మీపద్మావతీ సమేతముగా ఈ దేవాలయంలో పరమ ప్రసన్న శోభలు చిందిస్తూ బహుముఖ వైభవోపేతుడై విలసిల్లుచున్నాడు.

💠 ఈ దేవస్థాన సంస్థాపకుల స్వప్నంలో పరంధాముడు వేంకటేశ్వరుడు ఫణిరాజరూపమున స్వప్నమున సాక్షాత్కరించి ఈ స్థలము పరమపవిత్రమైనదని,  పూర్వకాలమున మహనీయులైన మహర్షులెందరో, ఇందు మహత్తర తపోనిష్టా గరిష్టులై మహనీయ తప్పసులు చేశారు అని...ఈ స్థలంమందలి జలపానము సమస్థ పాప సంతాపహరమనియు సర్వ వ్యాధినివారక మనియు, సకలార్ధ సిద్ధమనియు తనకీ స్థలము ప్రేమపాత్రమనియు తానందు వెలసితి వనియు నాగరాజు రూపమున భక్తులకు స్వయంగా సాక్షాత్కరమందించి వారికి నానాముఖ కామితార్థముల నందింతుననియు యీ దివ్యస్థలమున నాకొక దేవాలయము నిర్మించవలసినదిగా ఆజ్ఞాపించి అంతర్ధానమయ్యడు. ”

💠 మహత్తర వైకానశ శాస్త్రాను సారముగ బహుముఖ శిల్ప చిత్రాచిత్ర విచిత్ర వినిర్మిత రమణీయ నూతన దేవాలయ మందు స్వామివారి ప్రతిష్టామహూత్సవములు మహా వైభవముగా జరుగుచున్నవి. లక్షలాది భక్తుల మహూన్నతానంద కోలాహలములతో విలసిల్లుచున్నది.


🌀 శ్రీ అగస్తీశ్వరాలయం : నందివెలుగు

💠 వింద్యుడు ( వింధ్య పర్వతం)  దక్షిణాదికి వెళ్తున్న అగస్త మహర్షికి దారి ఇస్తూ, తిరిగి వచ్చేవరకు తాను మామూలు స్థితిలో ఉంటానని చెప్పాడు. అగస్త్యుడు తీరిగి రాలేదు. 

💠 అగస్త మహర్షి కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వరుని విడిచిపెట్టిన కలిగిన దుఃఖం తొలగించుకొనుటకై కొలకలూరు, నందివెలుగు, ఈమని ప్రాంతాలలో శివమూర్తులను ప్రతిష్టించారట. 
మూడు క్షేత్రాలను కలిపి త్రిలింగ క్షేత్రమని వ్యవహరిస్తారు. 
దుగ్గిరాలను నాభిగా వర్ణిస్తారు.
 మూడు ఆలయాలను అగస్తేశ్వర ఆలయాలుగానే పేరొందాయి.

💠 ఆగస్త్య మహర్షి ఆంధ్రదేశంలో అడుగడుగునా శివలింగాలు ప్రతిష్టిస్తూ తాను కాశీ విశ్వేశ్వరుని వదలివచ్చిన దుఃఖం పోగొట్టుకున్నాడని చెప్తారు. 
అలా ఆయన ప్రతిష్టించిన క్షేత్రాలలో ఒకటి తెనాలి దగ్గరి నందివెలుగు.


💠 ఈ నందివెలుగు గ్రామం అత్యంత పురాతన, చారిత్రక ప్రాముఖ్యం గల శైవ క్షేత్రం. 
ఏనాడో ఆగస్త్య మహర్షి ప్రతిష్టించిన ఈ లింగం, దేవాలయం కాలగతిలో దట్టమైన అడువులు పెరగడంతో మానవ సంచారం లేనిదై మరుగున పడిపోయాయి.

💠 చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో శివభక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఒకసారి ఈ అరణ్య ప్రాంతానికి రాగా ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. 

💠 మహాశివభక్తుడైన విష్ణువర్ధనుడు ఈ అగస్తేశ్వర స్వామికి తేజఃపుంజాలతో నిత్యార్చన జరగాలని సంకల్పించి, అమూల్యమైన రత్నాలను వినాయకుని బొజ్జలోనూ, నందీశ్వరుని శృంగంలోనూ నిక్షిప్తం చేయించారు. 

💠 వినాయకుడి బొజ్జలోని రత్నాల నుంచి వెలువడే తేజఃపుంజాలు నంది కొమ్ములలోని రత్నాలపైన పడి పరావర్తనం చెంది మూలవిరాట్టు పాదాలపై పడి నిత్యార్చన చేసేలా అతి గొప్పగా నిర్మాణం చేశారు ఆనాటి శిల్పులు. 

💠 నంది కొమ్ములలోంచి వెలుగు రేఖలు రావటం వలన ఆ గ్రామం పేరే నంది వెలుగుగా మారిపోయింది.

💠 ఒక మంత్రవేత్త ఇక్కడికి వచ్చి, నందివెలుగు చేరుకుని నంది శృంగాలు, వినాయకుని గర్భమూ ఛేదించి రత్నాలు అపహరించాడట. 

💠 మూలవిరాట్టు అగస్త్యశ్వరస్వామి వారికి ఒకవైపు పార్వతీ అమ్మవారు, ఎదురుగా జ్యోతిర్నంది, ఓ పక్క జ్యోతిర్గణపతి, మరోవైపు శ్రీ ఆంజనేయస్వామి ఉన్నారు. వీరేకాక ఇంకా తల్లి శ్రీకనకదుర్గ రమాసహిత సత్యనారాయణ స్వామివారు నటరాజు, చండీశ్వరుడు, కాలభైరవులు, నవగ్రహాధిపతులు, జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య, శ్రీ కంఠ శివాచార్యుల వారు కూడా ఇక్కడ ప్రతిష్టితులై నిలచి ఉన్నారు.

💠 విజయవాడ-చెన్నై రైలు మార్గంలో ఉన్న తెనాలికి రైలు ద్వారా కానీ, బస్సులో కానీ చేరుకుని తర్వాత ఆటోలో పదిహేను నిమిషాలు ప్రయాణం చేస్తే నందివెలుగు చేరుకుంటాం.
 ఈ గ్రామం తెనాలిలోని భాగమే అని కూడా భావించవచ్చు.

No comments: