💠 శ్రీ భావిగి భద్రేశ్వరస్వామి దేవాలయము తాండూరు పట్టణములో నడిబొడ్డున ఉన్నది. కోర్కెలు తీర్చే దేవాలయంగా ఇది ప్రసిద్ధి చెందింది.
ఈ పురాతన భావిగి బద్రేశ్వర ఆలయం లో వీరభద్రస్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు .
150 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ దగ్గరలోనే కగ్నా నది ఉన్నది.ఇక్కడ రోజు స్వామి వారికి పూజలు,అభిషేకాలు శాస్త్రోక్తంగా జరుగుతాయి.
💠 పెళ్లిళ్లు జరగడానికి, మంచి ఆయురారోగ్యాల కోసం భద్రేశ్వర స్వామి వారిని భక్తులు దర్శించుకుంటారు.
అలాగే ఇక్కడ అన్ని రకాల కోరికలు కూడా నేరువేరుతాయని భక్తుల నమ్మకం
🌀 ఆలయ చరిత్ర:
💠 కర్నాటక రాష్ట్రంలో బీదర్ జిల్లాలో భావిగ అనే కుగ్రామంలో 200 సంవత్సరాల క్రితం భద్రప్ప అనే అతను జన్మిం చాడు. ఇతడు సాక్షాత్తు వీరభద్రుని అవతారమని అక్కడి వారి నమ్మకం. భద్రప్ప నిజసమాధి ఉన్న భావిగలో కూడా అత్యంత వైభవంగా వేడుకలు జరుపుతారు.
💠 తాండూరుకు చెందిన పటేల్ బసవన్న అనే భక్తుడు ఏటా భద్రప్ప ఉత్సవాలకి ఎడ్లబండ్లు కట్టించుకుని వెళ్ళి ఎంతో భక్తితో పూజలు నిర్వహించి తిరిగి తాండూరు చేరుకునే వాడు. ఒకసారి ఇలాగే ఉత్సవాలకి హాజరయ్యి తిరిగు ప్రయాణం అవుతూ భద్రేశ్వరునికి వెళ్ళి వస్తానని మనసులో విన్నవించుకున్నాడు. ఎడ్లబళ్ళు ఎక్కి వస్తుండగా ఒక బాలుడు పటేల్ బండి వెనుక నడుచుకుంటూ వస్తున్నాడు.
పటేల్ అతనిని భద్రేశ్వరుడిగా గుర్తించి, బండి ఎక్కమని అనగా అందుకు ఆబాలుడు అంగీకరించలేదు. అలాగే తాండూరు వరకూ వచ్చి, ఇప్పుడున్న దేవాలయం స్థలానికి రాగానే మాయం అయిపోయాడు. అదేరోజు పటేల్ బసవన్నకి కలలో కనిపించి తన పాదుకలు భావిగ నుంచి తెచ్చి, వాటిని ఇక్కడ ప్రతిష్టించి ఆలయం నిర్మించమని ఆదేశించాడు.
ఆయన చెప్పినట్టే పటేల్ బసవన్న ఆలయ నిర్మాణం చేశాడు.
నాటి నుంచి ఈ ఆలయం ఎంతో వైభవంతో వెలుగొందుతోంది. ఈ ప్రాంతంలో స్వామి మహిమలెన్నో ప్రచారంలో ఉన్నాయి.
💠 వందల సంవత్సరాల నుంచి నిత్య పూజలందుకుంటున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామికి ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో ఉత్సవాలు జర్గుతాయి.
భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి తాండూరు, వికారాబాదు, పరిగి, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, కోడంగల్, కోస్గి నుంచే కాకుండా ప్రక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి విపరీతంగా వస్తుంటారు.
💠 ఇక్కడ వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో చివరి రెండు రోజులు ప్రధానమైనవి. శని, ఆది వారాల్లో జరిగే రథోత్సవం, లంకా దహనం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు అత్యుత్సాహంతో అర్థరాత్రి నుంచి తెల్లవారు ఝామువరకు వేచి ఉంటారు.
శనివారం అర్థరాత్రి రథోత్సవంలో 50 అడుగులు ఎత్తు గల రథాన్ని వందలాది భక్తులు తాళ్ళతో లాగుతూ బసవన్న కట్ట వరకు తీసుకువెళ్ళి మరలా యధాస్థానానికి చేరుస్తారు.
💠 ఆదివారం అర్థరాత్రి లంకాదహన కార్యక్రమంలో రకరకాల ఆకారాలు, డిజైన్లు ఉన్న బాణాసంచా కాలుస్తారు. ఇది చూడముచ్చటగా ఉంటుంది
భక్తులు తమ కోరికల్ని మనస్సులో తలచి రథంపైకి అరటిపళ్ళు విసురుతారు.
కలశపు భాగానికి అవి తగిలితే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
💠 ఉత్సవాలలో భాగంగా వారం రోజులపాటు ఎడ్ల సంత నిర్వహిస్తారు. ఈ సంతలో వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన ఎండ్లను క్రయ, విక్రయాలు జోరుగా సాగుతాయి. జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తారు
💠 భావిగి భద్రేశ్వరస్వామి ఆలయంలో నిత్యం వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రత్యేక పూజలు ధార్మిక ప్రసంగాలు, బసవ, శివపురాణ ప్రవచనాలు నిర్వహిస్తున్నారు. సేవ నిరతికి తార్కాణంగా ఆలయం ఆధ్వర్యంలో వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వసతి గృహంలో ఉండి ఎంతో మంది పేద విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
💠 మందిరంలో శివలింగాన్ని నల్ల రాతితో ఏర్పాటు చేయగా, పాలరాతితో ఉమామహేశ్వర, విగేశ్వర, అక్కమాదేవి మూర్తులను రూపొందించారు.
అలాగే దేవాలయంపైన నిర్మించిన అల్లమ ప్రభు బసవేశ్వరాధి శివశరణులతో పాటు పార్వతీ పరమేశ్వరులు,లక్ష్మీనారాయణుడు, శ్రీవాణి చతర్ముఖుల విగ్రహాలు దేవాలయ శోభను మరింత పెంచాయి. ఈ మద్యనే నిర్మించిన గాలిగోపురం సైతం ఆలయ శోభను మరింత ఇనుమడింప చేస్తోంది.
No comments:
Post a Comment