Adsense

Wednesday, June 15, 2022

శ్రీ వీరవెంకట సత్యన్నారాయణస్వామి ఆలయం : అన్నవరం (తూర్పుగోదావరి)


శ్రీ సత్యనారాయణ స్వామివారిని
🔅 *" మూలతో బ్రహ్మరూపాయ*
    *మధ్యతశ్చ మహేశ్వరం*
    *అధతో విష్ణురూపాయ*
    *త్ర్త్యెక్య రూపాయతేనమః "* అని స్తుతిస్తారు.

👉 ఇతిహాసాల ప్రకారం అడిగిన (అనిన) (వరం)వరాలను తీర్చే దేవుడు కాబట్టి ( అనిన+ వరం = అన్నవరం) "అన్నవరం దేవుడు" అంటారు.

👉అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి చాలా ప్రసిద్ధమైంది. ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లా, అన్నవరంలో రత్నగిరి కొండమీద ఉంది.

🔅స్థలపురాణం 🔅

👉పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహం తో ఇద్దరు కొడుకులను  పొందుతారు. ఒకడేమో భద్రుడు , ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలం గా మారుతాడు. 
రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మహావిష్ణువు వరం కోరమనగా "దేవా! నిన్ను నా అన్న వలె నా శిరముపై మోసే భాగ్యాన్ని ప్రసాదించు" అని అడిగాడట.

👉 'కలియుగంలో భక్త సంరక్షణార్ధం త్రిమూర్తుల ఏకస్వరుపంగా సత్య రజో తమోరూప త్రిగుణాత్మకుడైన వీర వెంకట సత్యనారాయణ అను పేరుతో అర్చామూర్తిగా ఆవిర్భవించిన సుముహుర్తాన నీవు రత్నగిరి రూపంలో నీ శిరస్సున నన్ను వహిస్తావు” అని సాక్షాత్ విష్ణుమూర్తి రత్నాకరునికి వరమిచ్చాడు.
 ఆ ప్రకారమే రత్నగిరి , లేదా రత్నాచలం కొండగా మారుతాడు.... అదే స్వామి వారు వెలిసిన " అన్నవరం సత్యదేవుని కొండ "గా ప్రసిద్ధి.

🔅సత్యనారాయణ స్వామి ఆవిర్భావం :

👉 భూలోక సంరక్షణార్ధం భువిని స్వర్గంలా మరిచే క్రమంలో వరప్రసాద ఫలంగా సాక్షాత్ శ్రీ మహావిష్ణువు రత్నగిరిపై అంకుడు చెట్టు మొదల్లోని పుట్టలో స్వయంభువై అవతరించాడు. 
ఈ శుభ ఆవిర్భావానికి దేవతలంతా సంతసించి, పులకించి పుష్పవృష్టి కురిపించారు.

👉 కిర్లంపూడి సంస్థానాధీశులు, శ్రీ రాజా యినుగంటి వేంకట రామరాయ బహద్దూర్ వారి ఏలుబడిలో అన్నవరం గ్రామం ఉండేది. ఈ గ్రామానికి చెందిన బ్రాహ్మణోత్తములు, నిత్యాన్నదాతలు అయిన శ్రీ యీరంకి సూర్యప్రకాశం గారి స్వప్నంలో స్వామి సాక్షత్కరించి "ఓయీ బ్రాహ్మణోత్తమా! నేను సత్యనారాయణ అను నామమున రత్నగిరిపై అంకుడు చెట్టు క్రింద పుట్టలో ఉన్నాను. భక్త రక్షణార్ధము అర్చామూర్తిగా అవతరించిన నన్ను వెలికితీయించి అర్చనాదికములు గావించుము" అని పలికాడట. 
శ్రీ సూర్య ప్రకాశలింగం గారు స్వప్నం నుంచి మేలుకుని తనకు ఆ కల తెల్లవారు ఝామున వచ్చినది కావున ఇది తప్పక 'సత్యము' అని భావించి ఈ వార్త రాజావారికి విన్నవించాడట. 
చిత్రంగా రాజావారికి సైతం ఇదే కల ఇలాగే.. సూర్యప్రకాశం గారికి వచ్చిన సమయంలోనే వచ్చిందట! ఇది ముమ్మాటికి సత్యమేనని నిశ్చయించి శ్రీ రాజావారు సపరివార సమేతంగా అన్నవరం చేరి అంకుడు చెట్టు క్రింద పుట్టలో దివ్య తేజస్సు చూసి ఆశ్చర్యపడి పుట్ట నుండి స్వామి వారి దివ్య మంగళ విగ్రహం బయటకు తీయించెను. 
శ్రీ రాజావారు, శ్రీ సూర్యప్రకాశం ఆనందంతో, భక్తితో, భగవాన్నామస్మరణ చేసి వేదమంత్ర ఘోషతో మేళతాళాలతో విగ్రహమునకు శుద్ది చేసి, స్వామివారికి తాటాకు పందిరి నిర్మించి పూజాధికాలు నిర్వహించి తరించారు. 
ఇలా కొన్నాళ్ళు గడిచాక శ్రీరాజావారికి దేవతలు, ఋషులు సాక్షాత్కరించి నీవు వెంటనే ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టమని ఆదేశించగా ఆగమ శాస్త్ర పండితులను, శిల్పులను రప్పించి రథాకృతిలో ఆలయ నిర్మాణం గావించారు.

👉రెండతస్తులుగా ఉండే స్వామి వారి ప్రధాన ఆలయం క్రింది భాగంలో యంత్రాలయం, పై భాగంలో స్వామి వారి దివ్యమంగళ రూపం దర్శనమిస్తాయి. రెండింటికీ మధ్య పానిపట్టము వంటి నిర్మాణం. అందు పీఠములు బీజాక్షర సంపుటి యంత్రం ఉంది. ఈ వాస్తు నిర్మాణంలోని క్రింది భాగంలో వృత్తాకారమైన శిలాయంత్రం బ్రహ్మ స్వరూపమని, నడుమనున్న లింగాకార స్తంభం శివస్వరూపమని, ఊర్ధ్వమండలి విగ్రహం నారాయణ స్వరూపమని పండితులు చెబుతారు. 

👉శ్రీ స్వామివారు హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మకులై అనంత లక్ష్మీ సత్యదేవి సమేతమై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా భక్త రక్షణ చేయటం అపురూప విశేషం.

👉ఆలయ నిర్మాణం 1934 లో జరిగింది. ఆలయ నిర్మాణం రెండు అంతస్తులలో జరిగింది. క్రింది భాగంలో నారాయణ యంత్రం ,  పై అంతస్తులో దేవతా మూర్తులు.
 ప్రధాన ఆలయం రధాకారంలో నాలుగువైపులా చక్రాలతో నిర్మింపబడింది. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తుంటుంది. ఈ స్వామిని మూలం బ్రహ్మ , మధ్య భాగం ఈశ్వరుడు , పై భాగం మహవిష్ణువుగా , త్రిమూర్తి స్వరూపంగా కొలుస్తారు.

👉 తెలుగు వారు అన్ని శుభకార్యాల్లో కొలిచే దేవుడు శ్రీ సత్యన్నారాయణ స్వామి. ఆయన వ్రతం ఏదో ఒక సందర్భంలో చెయ్యనివారు అరుదేమో. మరి సాక్షాత్తూ ఆ స్వామి సన్నిధిలోనే ఆయన వ్రతం చేసుకోవటంకన్నా భాగ్యమేముంటుంది.

👉 ఈ ప్రాంతం ప్రతి నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. హిందువులు పవిత్రంగా భావించే కార్తీకమాసంలో ఇచ్చట కనీవినీ ఎరుగని రీతిలో భక్తులు వస్తుంటారు.

No comments: