💠 పెద్దమ్మతల్లి అంటేనే పెద్దదిక్కు.. ఆ తల్లి ఆశీస్సులు ఉంటే ఏ పనైనా ఇట్టే జరిగిపోతుంది. భక్తుల పాలిట కొంగుబంగారమై విలసిల్లుతున్న ఆ తల్లి నేనున్నానంటూ అందరికీ దీవెనలందిస్తోంది.' ఇదీ భక్తుల నమ్మకం.
💠 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి నిత్యం భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఆదివారం అయితే వేల సంఖ్యలోనే విచ్చేస్తారు.
💠 కొత్తగూడెం-భద్రాచలం ప్రధాన రహదారిపై పెద్దమ్మతల్లి (కనకదుర్గమ్మ) ఆలయం ఉంటుంది. ఆ రహదారిపై వెళ్లే వారెవరైనా అమ్మవారికి నమస్కరించనిదే అడుగు ముందుకెయ్యరంటే అతిశయోక్తి కాదు.
💠 ఆలయ చరిత్ర :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం-జగన్నాథపురం గ్రామాల మధ్యలో ఖమ్మం-భద్రాచలం వెళ్లే రాజమార్గం సమీపంలో ఒక పెద్దపులి సంచరిస్తూ ఉండేది.
ఆ పెద్దపులి రాజమార్గం సమీపంలో గల ఒక చింతచెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ సమీప గ్రామ ప్రజలకు ఎలాంటి హానీ తలపెట్టకుండా సాధుజంతువులా ఉండేది.
ఈ పెద్దపులిని గ్రామప్రజలు, బాటసారులు రాజమారాన పయాణించే వాహనదారులు
దైవంశ సంభూతంగా, వనదేవతగా, శ్రీకనకదుర్గ అమ్మవారిగా భావించి భక్తితో పూజించేవారు. అలా ప్రణమిల్లిన వారి మనోభావాలు, వాంఛలు నెరవేరుస్తూ కాలక్రమంలో ఆ పులి అదృశ్యం కావడంతో చింతచెట్టు కింద అమ్మవారి ఫొటోను పెట్టి గ్రామ ప్రజలు పూజించేవారు.
💠 1961-62లో శ్రావణపు వెంకటనర్సయ్య స్థలదానం చేయగా.. కంచర్ల జగ్గారెడ్డి భక్తుల ఆర్థిక సహాయ సహకారాలతో దేవాలయం నిర్మించి శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
నాటి నుంచి స్మార్త సంప్రదాయం ప్రకారం పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
💠 వనదేవత అయిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఆది, గురువారాలలో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
పెళ్లిళ్లు.. బారసాలలు ఏవైనా ఇక్కడే..
💠 శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి)లో భక్తులు ప్రత్యేక పూజాకార్యక్రమాలను నిత్యం నిర్వహిస్తుంటారు.
అంతేకాక ప్రతీ యేటా అమ్మవారి ఆలయంలో వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. బారసాల, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, పుట్టినరోజు, పెళ్లిరోజు, పదవీ విరమణ కార్యక్రమాలు... ఇలా ఏ శుభకార్యమైనా అమ్మవారి సన్నిధిలో నిర్వహించడం ఆనవాయితీ
💠 దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన ప్రత్యేక 'పొంగల్ షెడ్'తోపాటు ప్రైవేటు వారి నిర్వహణలో ఉన్న వివిధ ఫంక్షన్ హాళ్లలో నిత్యం ఏవో శుభకార్యాలు జరుగుతూనే ఉంటాయి.
💠 ఇక్కడ నవరాత్రులు ప్రత్యేకం... పెద్దమ్మతల్లి దేవాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు.
తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు నిర్వహించి.. అన్నిరకాల పూజలు చేస్తారు.
💠 దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి, శ్రీ లలితాదేవి, శ్రీ గాయత్రి దేవి, శ్రీ మహాలక్ష్మి దేవి, శ్రీ కనకదుర్గాదేవి, శ్రీ సరస్వతీదేవి, శ్రీ అన్నపూర్ణాదేవి, శ్రీ మంగళగౌరీదేవి, శ్రీ మహిషాసుర మర్దినీదేవి అలంకారాలు నిర్వహించి.. విజయదశమి రోజు అమ్మవారికి గ్రామసేవ, శమీపూజలు నిర్వహిస్తుంటారు.
💠 ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎవరు వాహనం కొనుగోలు చేసినా ముందు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజ చేయించాల్సిందే.
సమీప ప్రాంత రైతులు అమ్మవారికి పూజ చేసిన తర్వాతే వ్యవసాయ పనులను ప్రారంభిస్తుంటారు.
💠 అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రావిచెట్టు, వేపచెట్టు కలిసి ఉంటాయి.
ఈ మహావృక్షాన్ని శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాలుగా భక్తులు భావిస్తారు.
ఈ వృక్షానికి ఊయలకట్టి చుట్టూ ప్రదక్షిణ చేస్తే సంతానం లేని మహిళలు గర్భం దాలుస్తారని, అప్లైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
ప్రతి ఏటా ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలను కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తుంటారు.
💠 హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, వరంగల్ నుంచి భద్రాచలం, మణుగూరు వెళ్లే ప్రతి బస్సు అమ్మవారి ఆలయం ముందు నుంచే వెళ్తాయి.
No comments:
Post a Comment