Adsense

Wednesday, July 20, 2022

ఖమ్మం జిల్లా : గార్ల మండలం, మర్రిగూడెం శ్రీ వేట వేంకటేశ్వర స్వామి ఆలయం

 

💠 భారతీయుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు దేవాలయాలతో ముడిపడి ఉన్నాయి.
చరిత్ర ప్రసిద్ధి గాంచిన దేవాలయాలు ఖమ్మం జిల్లాలో గార్ల మండలంలో కోకొల్లలుగా ఉన్నాయి. 

💠 శ్రీ వేంకటేశ్వర స్వామికి ఇష్టమైన ఆహారం ఏమిటి !? 
దఽధ్యోదనం అని కొందరంటారు! 
లడ్డూ అని మరికొందరు అంటారు! 
వడ ప్రీతిపాత్రమని ఇంకొందరంటారు! 
తిరుమల అయినా, ద్వారకా తిరుమల అయినా, చిలుకూరు అయినా మరెక్కడైనా ఇదే పరిస్థితి! 
కానీ, వేట మాంసం తినే వేంకటేశ్వరుడిని ఎన్నడైనా దర్శించుకున్నారా !?
 
👉 ఆయన పేరే వేట వేంకటేశ్వరస్వామి.
ఆసియాలోనే అరుదైన జంతుబలి ఆలయం..

💠 కొలిచిన వారికి కొంగు బంగారంగా ఆపద మొక్కులు తీర్చే శ్రీ వేట వేంకటేశ్వరస్వామి తిరుపతి నుండి స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి వెలసినట్లు పూర్వీకులు చెపుతున్నారు. 

💠 ఆ స్వామి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలోని ( నేటి మహబూబాబాద్‌ జిల్లా) , గార్ల మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలోని మర్రిగూడెంలో కొలువై ఉన్నారు. ఆసియాలోనే అత్యంత అరుదైన ఈ ఆలయంలో స్వామి వారికి జంతు బలి ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత! 
తిరుమల వేంకటేశ్వర స్వామి వేట కోసం స్వయంగా ఇక్కడికి వచ్చి వెలిసినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది.

💠శ్రీ వేంకటేశ్వరుడు స్వయంగా అశ్వారుఢుడై వేటకు వచ్చి ఈ ప్రాంతంలో వెలిశాడని, ఇక్కడి నుంచి అర కి.మీ. దూరంలో ఉత్సవ విగ్రహం రూపంలో ప్రత్యక్షంగా దర్శనమిచ్చాడని చెబుతారు.
 
💠 సుమారు ఆరు శతాబ్దాల కిందట ఇక్కడికి వేటకు వచ్చిన శ్రీ వేంకటేశ్వరుడు ఈ ప్రాంతానికి చెందిన  “ఎక్జి వెంగళయ్య” అనే పేదవాడు మరియూ మూగవాడు అయిన చాత్తాధ శ్రీ వైౖష్ణవుడు భక్తితో తన నువ్వుల చేను వద్ద ఉండి భగవంతుని ప్రార్థిస్తుండగా స్వామి  అడవికి వేటకు వస్తున్న రూపంలో ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. 
చేతులెత్తి జోడించిన వెంగళయ్య మూగవాడు కావడం చేత, నీకు ఏమికావాలో కోరుకొమ్మని స్వామి భక్తుణ్ని అడిగాడు. 
ఆ భక్తుడు ఎల్లవేళలా తన చెంత నుండి కష్టాలను తీర్చి కాపాడాలని వేడుకున్నాడు. స్వామి సరే అని తాను ఇక్కడ అవతరించబోతున్నానని, ఇక్కడ తనకొక ఆలయం నిర్మించి నిత్య దూపదీప నైవేద్యాలతో ఆరాధించాలని ,ఈ విషయం మీ గ్రామ పెద్దలకి చెప్పి, వారిని పిలుచుకొని రమ్మని పంపించాడు.

💠 మూగసైగలతో గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి ... ప్రభువు నా నువ్వుల చేను వద్ద ఉన్నాడు, మిమ్ములను రమ్మని చెప్పినారని వెంగళయ్య చెప్పగా విని వారు గొల్లున నవ్వి  ప్రభువు ఇక్కడకు రావడమేమిటి ? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 
ఆ రాత్రి ఒక వ్యక్తికి కలలో స్వామి ప్రత్యక్షం కాగా వెంగళయ్య చెప్పిన విషయం యదార్థమని ఆ వ్యక్తి గ్రామ పెద్దలతో చెప్పడంతో గ్రామస్తులు మూకుమ్మడిగా బయలుదేరారు.

💠 గ్రామ ప్రజల రాకను గమనించిన స్వామి ప్రజలు చూస్తుండగా నల్లని గోవుగా మారిపోయి, పరుగు తీసి సమీపంలోని జువ్విచెట్టు వద్ద చేరి, భీకరమైన శబ్ధం చేస్తూ శిలగా మారి వెలసినట్లు అక్కడి స్థలపురాణం.

💠 శ్రీ వేంకటేశ్వరస్వామి ఆజ్ఞాపించగా వెంగలయ్య గ్రామ ప్రముఖుల సహకారంతో ఆలయం నిర్మించారని ఈ ప్రాంతవాసులు చెప్తున్నారు.

💠 శ్రీ వేంకటేశ్వరస్వామితో పాటు శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలు భూపాలపల్లి పట్టణంలోని ‘ఒంటిమీసం తోట’ అనే ఉద్యానవనంలో లభ్యం కాగా డోర్నకల్‌ సమీపంలోని అమ్మపాలెం గ్రామానికి చెందిన మల్లం గోపయ్య, మల్లం నర్సయ్య ఇక్కడకు తెచ్చి ప్రతిష్టించారు .
నాటి నుంచి వంశపారంపర్యంగా అదే కుటుంబానికి చెందిన వారు స్వామి వారి కల్యాణానికి తలంబ్రాలు తీసుకొస్తున్నారు. దేశంలో ఎక్కడా వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో జంతుబలి ఇవ్వరు. 
కానీ ఇక్కడి వేంకటేశ్వరస్వామికి భక్తులు జంతుబలులు ఇవ్వడం విశేషం. 

💠 ఈ దేవాలయంలోని పంచలోహ విగ్రహాలు అడవిలోని పుట్టలో లభించాయి. 
ఖమ్మం జిల్లాలో ఎంతో ప్రసిద్ధికెక్కిన గార్ల వేంకటేశ్వరస్వామి దేవాలయమును 15వ శతాబ్దంలో నిర్మించారు. 
విగ్రహాలు, ఆ కాలం నాటి ఆభరణాలు నేటికి ఈ దేవాలయములో చెక్కు చెదరకుండా ఉన్నాయి. రాతితో చెక్కిన కళ్యాణమండపం కాకతీయుల కాలంనాటి శిల్పకళా వైభవమును ప్రతిబింబిస్తుంది. 
ఈ దేవాలయం ప్రక్కనే శివాలయం ఉండటం గొప్ప విశేషం. 


💠 మండల కేంద్రమైన గార్లకు మూడు కిలోమీటర్ల దూరంలోని మర్రిగూడెం గ్రామం వద్ద వెలిసిన వేట వేంకటేశ్వరస్వామికి ప్రతీ ఏటా ఆశ్వయుజమాసంలో వారం రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామి వారికి గొర్రెలు, మేకలు, కోళ్లను బలిస్తారు.

💠 ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్, కృష్ణా జిల్లాలకు చెందిన భక్తులు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. 
స్వామివారి కల్యాణం యాగ్నికము పూజారి కల్వకుంట్ల వెంకన్నచార్యులు, బుచ్చమయ్యచార్యులు నిర్వహిస్తారు.

No comments: