Adsense

Saturday, July 23, 2022

ఖమ్మం జిల్లా : నేలకొండపల్లి - శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం - శ్రీ ఉత్తరేశ్వర స్వామి ఆలయం - శ్రీ భక్త రామదాసు ఆలయం.


 

💠 నేలకొండపల్లి ఖమ్మం నుండి 21 కి.మీ. దూరంలో ఉన్నది. 
ఈ ప్రాంతంమునే పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం తరువాత అజ్ఞాతవాసం చేసిన విరాటరాజు పాలించిన విరాటనగరంగా చెబుతారు. 
అందుకు తగ్గ సాక్ష్యాలు కూడా చూపిస్తారు. క్రీ.శ. 3,4 శతాబ్దాలకు చెందిన అనేక అపురూపమైన విలువైన వస్తువులను  ఇక్కడ త్రవ్వకాలలో కనుగొన్నారట. 
ఇంకా వీరి త్రవ్వకాలలో అనేకానేకమైన , బావులు, ఆరామాలు వెలుగు చూశాయట. 
ఈ ప్రాంతం దాదాపుగా వంద ఎకరాలలో ఉన్నది. 
మట్టితో కట్టిన బౌద్ధస్థూపం శతాబ్దాల బౌద్ధసంస్కృతికి అద్దంపడుతోంది. 
ఏది ఏమయిన ఈ ప్రాంతం చారిత్రక సంపదల ఖాండాగారంగా పేర్కొనవచ్చు.
💠 అటువంటి నేలకొండపల్లిలో చూడవలిసిన ప్రముఖ ఆలయాలు 3. 
వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
అవే ..

👉శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం
👉శ్రీ ఉత్తరేశ్వర స్వామి ఆలయం
👉శ్రీ భక్త రామదాసు ఆలయం.



🔆1.  శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం : 

💠 శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం 
ఖమ్మం  జిల్లాలోని నేలకొండపల్లి గ్రామం లో కలదు..
వేణుగోపాల స్వామి దేవాలయం చాల పురాతనమైనది మరియు చరిత్రకమైనది కూడా . 
ఈ గ్రామానికి విశేసమైన చరిత్ర కలదు . 
💠 అది ఒకపుడు బౌద్ధ క్షేత్రముగా ఉండేది. కాలక్రమంలో బౌద్ధం వెనుకంజ వేసి హిందూ ధర్మం తిరిగి నెలకొన్నప్పుడు అచట వెలసిన ఆలయాలలో ఈ వేణుగోపాల స్వామి వారి ఆలయమొకటిగా పేరుగాంచిoది. 
 బౌద్దల తరువాత హిందూ ధర్మం నేలకోన్నప్పుడు వెలసిన దేవాలయం ఇది .
 
💠 ఇది చిన్న ఆలయము. 
ఈ ఆలయములో గర్భగృహములో వేణుగోపాల స్వామి దర్శనం ఇస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు.
ఈ ఆలయమును రాజగోపాలస్వామి వారి దేవాలయం అని కూడా అంటారు .
దీనినిపుడు నియోగి బ్రాహ్మణుల వంశంవారు నడుపుచున్నారు. 
ప్రస్తుతం ఇచట సంపత్ ముడుంబై కృష్నమాచార్యుల వారు అర్చకత్వం నిర్వహించుచు తమ ఆగమ శాస్త్రము ననుసరించి అర్చనలు, ప్రత్యేక పూజలు, ఉత్సవములు వైభవముగా జరుపుచున్నారు.
 
💠 భక్త రామాదాసు జన్మస్థలము అని కూడా నేలకొండపల్లి కావడం విశేషం.
నేలకొండపల్లి లోని  సంతాన వేణుగోపాల స్వామి అనుగ్రహంతోనే కంచర్ల గోపన్న (రామదాసు గారు )గారు జన్మించారు అని ఇక్కడి ఆలయ విశేషం...



🔆 2. శ్రీ ఉత్తరేశ్వర స్వామి ఆలయం :

💠 ఇది ఖమ్మం జిల్లాలో చరిత్రాత్మకమైన నేలకొండపల్లి అనే చరిత్రాత్మక గ్రామంలో కలదు.
ఇది ఒకపుడు విరాట్రాజుగారి పట్టణమని ప్రతీతి. 
ఇచటి ప్రజలు విరాట్రాజు గారన్న ఎంతో అభిమానం చూపిస్తారు.
వారు ఆ అభిమానంతో ఇచట ఉన్న ప్రాచీన బౌద్ధ స్థూపముని విరాట్ రాజు గద్దెయని పిలుస్తారు 
 
💠 ఇక్కడున్న శివాలయమును విరాట్రాజు గారి కుమారుడైన ఉత్తరుడు నిర్మించాడని కనుకనే ఇచటి ఈశ్వరుడు ఉత్తరేశ్వరనామంతో పేరు గాంచాడని వారి అభిప్రాయం.

💠 ఇది ప్రాచీనమైన ఆలయము. 
కాని ఇది చాలా చిన్న ఆలయము.
ఈ చిన్న ఆలయంలో పరమశివుడు గర్భగృహమున దర్శనమిస్తున్నారు.
అంతరాలయమున ఎడమ భాగాన పార్వతీ అమ్మవారు, మండపమున నందీశ్వరుడు, ఆలయమునకు ఈశాన్య దిశలో నవగ్రహములను దర్శనము చేసుకోవచ్చు.
అదే విధముగా ఆలయము ముందు రెండు ధ్వజస్థంభములు, ఒక కళ్యాణ మండపము కలవు.



🔆 3. శ్రీ భక్త రామదాసు మందిరము :

💠 ఇది ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి గ్రామములో కలదు. 
ఈ మందిరమును గ్రామవాసులు, రామదాసు గారి జ్ఞాపకార్థము 1972లో కట్టించినారని తెలియచున్నది. 
శ్రీ రామదాసుగారు మహాభక్తులు.
వారి నివాస స్థలంలోనే ఈ మందిరం కట్టబడుట విశేష విషయము. 

💠 ఒకప్పుడీ స్థలములో ప్రయాగలక్ష్మీ నరసింహంగారికి రామదాసుగారో, లేక వారి వంశీకులో దానముగా ఇచ్చారు అంటారు. 
ఇపుడా స్థలమును గ్రామవాసులు లక్ష్మీనరసింహంవారి వంశీకుల వద్ద విరాళంగా పొంది అచట భక్తరామదాసు గారి మందిరమును నిర్మించుట విశేష విషయం. 

💠 ఇచట ఈ మందిర నిర్మాణం జరుగక పూర్వం రామదాసు పేరు మీదనొక జ్ఞానపీఠము వెలసి, ప్రజలకు జ్ఞానబోధ చేయుచుండేది. తరువాత పౌరులు ఆ స్థలంలో రామదాసు మందిరమును కట్టించి, భద్రాచల దేవస్థానం వారికి అప్పగించారు.

No comments: