Adsense

Monday, August 22, 2022

కృష్ణా జిల్లా : " ముక్త్యాల "( శ్రీ భవానీముక్తేశ్వరస్వామి ఆలయం)

కృష్ణా జిల్లా : " ముక్త్యాల "
( శ్రీ భవానీముక్తేశ్వరస్వామి ఆలయం)

💠 కృష్ణాతీరాన వెలసిన అతి ప్రాచీన పుణ్యక్షేత్రమిది. 
రెండు శివలింగాలు .. రెండు నందులు.. 
ఒకే స్వామికి రెండు ఆలయాలు .. 
పరమ శివుడు స్వయంగా కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట మండలం, ముక్త్యాల గ్రామ ఒడ్డున ‘ముక్తేశ్వరస్వామి’గా వెలసిన సుక్షేత్రమిది. 


💠 ముక్త్యాలలో శ్రీ కోటిలింగశివ క్షేత్రానికి 2 కి.మీ. ల దూరంలో వున్నది అతి పురాతనమైన శ్రీ ముక్తేశ్వరస్వామి ఆలయం. 
ఈ ఆలయంలో శివలింగం బలి చక్రవర్తిచే ప్రతిష్టింపబడ్డది. 
పక్కన అమ్మవారి గుళ్ళో శ్రీ చక్రంకూడా ప్రతిష్టింపబడివుంది.
శివ కేశవులకు బేధం లేదన్నట్లు చెన్న కేశవ స్వామి ఆలయం కూడా ఈ ప్రాకారంలోనే వుంది. 
ఇక్కడ కృష్ణా నది ఉత్తర వాహిని. 
ఈ క్షేత్రం ఉత్తర కాశీగా పరమ పావన పుణ్య తీర్ధంగా ప్రసిధ్ధికెక్కింది. 


💠 కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ...ముక్తినొసంగుతూ... ముక్తేశ్వరస్వామి కొలువై ఉన్నందువల్ల ముక్తేశ్వరపురం, ముక్త్యాల అనే పేరు వచ్చింది.

💠 సంవత్సరంలో ఈ ఆలయం ఆరు నెలలు పాటు మాత్రమే తెరచి వుంటుంది.. మిగతా ఆరు నెలలు నదిలోనే మునిగి వుంటుంది...
ఆ సమయంలో ముక్తేశ్వరుని దేవతలు ఆరాధిస్తారని భక్తుల విశ్వాసం.... 

💠 ఈ ఆలయంలో కనిపించే రెండు శివలింగాల్లో ఒకటి స్వామి వారికి, రెండవది అమ్మవారికి ప్రతీకలుగా భక్తులు విశ్వసిస్తారు. అలాగే విగ్రహానికి ఎదురుగా రెండు నందులు ఉంటాయి.. వీటిలో దక్షిణం వైపున్న నందిని తిరుగుడు నందిగా పిలుస్తారు.. 
పూర్వ కాలంలో భార్య సుఖప్రసవానికి భర్త ఈ నందిని తిప్పేవాడని అలా చేస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా ప్రసవం అయ్యేదని భక్తుల ప్రగాడ విశ్వాసం. 
ఉత్తరవాహినిలో స్నానం చేయడం వలన సకల పాపలు తొలగుతాయాని భక్తులు భావిస్తారు.

💠 ముక్తేశ్వర స్వామిని బలి చక్రవర్తి ప్రతిష్టించాడని ప్రతీతి. బాణాసురుని తండ్రి ఐన బలి చక్రవర్తి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన పరమేశ్వరునితో స్వామి.. కృష్ణ నది ఉత్త్తర వాహినిగా ప్రవహిస్తున్న ఈ పరమ పవిత్రమయిన ప్రదేశంలో వున్న మానవాళికి ముక్తిని ప్రసాదించుటకు నీవు ఈ క్షేత్రంలో స్వయంగా వెలసి అందరిని కాపాడుతూ ముక్తిని ప్రసాదించమని కోరగా శివుడు అందులకంగీకరించి ముక్తేశ్వర స్వామిగా ఈ క్షేత్రంలో స్వయంభువుగా కొలువైనాడని పురాణగాధ.
కృతయుగంలో బలిచక్రవర్తి కట్టిన దేవాయం కాలగమనంలో నదీగర్భంలోకి వెళ్ళిపోయింది అంటారు.

💠 ఇక్కడ మరో విశేషం కూడా వుంది. సాధారణంగా శివయ్యని లింగ రూపంలో చూస్తుంటాం. 
ఇక్కడ అమ్మవారిని కూడా లింగ రూపంలో అర్చిస్తారు. 
ఇక్కడ రెండు లింగాలు, రెండు నందులు, రెండు ఆలయాలు మనకి కనిపిస్తాయి. 
ఇక్కడ దక్షిణం వైపు వున్న నందిని తిరుగుడు నందిగా పిలుస్తారు

💠 ఈ స్వామిని త్రేతాయుగంలో రామ లక్ష్మణులు, ద్వాపర యుగంలో పాండవులు దర్శించారుట. ఎఱ్ఱన, శ్రీనాధుడు మొదలగు మహాకవులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు వారు రాసిన గ్రంధాలలో వున్నది. 
త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి ఇక్కడ ఆశ్రమం ఏర్పాటుచేసుకుని నిత్యం ఉత్తరవాహినిలో స్నానంచేసేవారని మార్కండేయ పురాణంలో వున్నది. 
నదీ ప్రవాహంలో ఆయనకు జంట నందులు కనిపించేవిట. కృష్ణ ఒడ్డున జంట నందుల విగ్రహాలు వున్నాయి. ఇప్పటికీ నది లోతులో బంగారు శివాలయం వుందని భక్తుల నమ్మకం. ఋష్యశృంగ మహర్షి ఇక్కడికి సమీపంలో వున్న కొండగుహలో తపస్సు చేసేవారుట. అప్పుడు ఆ గుహ నుండి నిరంతరం సామవేదగానం వినిపించేదిట.

💠.ఇక్కడే చెన్నకేశవ స్వామి వారి ఆలయం ఉండటంతో హరిహరక్షేత్రమైంది. 
నదీ గర్భం లో బలి చక్ర వర్తి నిర్మించిన స్వర్ణ ఆలయం వుందని చెప్పు కొంటారు .

💠 కార్తీకమాసంలో విశేషపూజ లుంటాయి.
ఈ భవానీ ముక్తేశ్వరస్వామికి మాఘ బహుళ చతుర్ధశి  మహాశివరాత్రి నాడు కళ్యాణోత్సవం జరుగుతుంది. 
పర్వదినాల్లోను, పుష్కర సమయాల్లోను ఇచ్చట కృష్ణవేణి ఉత్తరవాహిని లో స్నానం చేయడానికి దూరప్రాంత భక్తులు కూడ తరలివస్తారు.


💠 సంతానం కోసం జంట నందులతో కూడిన ఈ శివాలయంలో అర్చన విశేష ఫలితాన్ని ఇస్తుందన్న విశ్వాసంతోనే వారు ఎక్కడా లేని విధంగా వీటిని ప్రతిష్టించారు. 
కాలగమనంలో ఈ నందులు కూడా ఛిద్రంకాగా ప్రస్తుత వాసిరెడ్డి వంశీయులే వాటిని పునఃప్రతిష్టించారు.


💠 పట్న వాసులు చూడదగ్గ ఇంకో విశేషం బల్లకట్టు. గుడి దగ్గరనుంచి కొంచెం దూరం వుంటుంది. ఈ బల్లకట్టు మీదమనుషులతోపాటు ఒకేసారి మూడు లారీలను ఎక్కించి అవతలి ఒడ్డుకి చేరుస్తారు. 


💠 ముక్త్యాల గ్రామం జగ్గయ్యపేట పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.

No comments: