Adsense

Friday, July 22, 2022

ఖమ్మం జిల్లా : "వనంవారి కృష్ణాపురం" శ్రీ రామచంద్ర దేవాలయం

 

💠 దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు భగవంతుడు అవతారమెత్తినట్లే భక్తుల కోరిక మేరకు వారికనువైన రూపంలో, స్థలంలో దర్శనమిచ్చి స్థిరనివాసం కూడా ఏర్పరచుకుంటాడట. అందుకు నిదర్శనం వనంవారి కృష్ణాపురంలోని స్వయంవ్యక్తమైన శ్రీరామచంద్రుడే.


💠 శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం రామావతారం. 
అయితే శ్రీరాముడు స్వయంభువుగా వెలసిన పుణ్యక్షేత్రం భద్రాద్రి.
 శ్రీ రాముడు కొలువై ఉన్న ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు అనేవి ఉన్నాయి. 
ఇది ఇలా ఉంటె భద్రాద్రి రాముడు ఒక భక్తుడి కోసం వచ్చి భద్రాచల రాముడి రూపంలోనే వెలిశాడని పురాణం.
మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? 
ఈ ఆలయ స్థల పురాణం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
💠 తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, కృష్ణాపురం అనే గ్రామంలో శ్రీరామచంద్ర ఆలయం ఉంది. 
ఈ ఆలయం మహిమ గల ఆలయంగా భక్తులచే పూజలను అందుకుంటుంది.
 శ్రీ రాముడి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో శ్రీ రాముడు ఏ విధంగా అయితే దర్శనమిస్తాడో ఈ ఆలయంలో కూడా శ్రీరాముడు అదేవిధంగా దర్శనమివ్వడం విశేషం.

💠 వనంవారి  కృష్ణరాయలు అనే భక్తుడి   కోరిక తీర్చేందుకు, శ్రీరామచంద్రుడు, భద్రాచలంలో వున్నట్లు ఈ గ్రామంలో కూడా వెలిసి, ముక్తి వరం – ముత్తవరం - ముత్తారం రామాలయంగా దాన్ని ప్రఖ్యాతి గావించాడని చుట్టుపక్కల వారి నమ్మకం. 
         
💠 ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, సుమారు 200 సం॥ క్రితం ముత్తవరం (ఇప్పుడు ముదిగొండ మండలంలోని ముత్తారం)లో వనం కృష్ణరాయలనే భక్తాగ్రేసరులుండేవారు. 

💠 కృష్ణ రాయలు గారు అచంచలమైన శ్రీ రామ భక్తుడు. 
ప్రతిఏటా భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు విధిగా కాలినడకన హాజరయ్యేవాడట.  
అపర రామభక్తుడైన కృష్ణరాయులు గోటితో స్వయంగా ఒడ్లను ఒలిచి మూటకట్టి నెత్తినపెట్టుకొని శ్రీరామనవమికి భద్రాచలం కాలినడకన వెళ్లేవారట.
ఆయనకు వృద్ధాప్యం వచ్చేవరకు ఈ సాంప్రదాయం కొనసాగింది. 

💠 కృష్ణ రాయలు గారు కాలం గడుస్తున్న కొద్దీ, వయసు మీరుతుండడంతో, వెళ్ళిరావడానికి ఇబ్బందిపడుతుండేవాడు. 
అలా అతడు ప్రతిసంవత్సరం సీతారాముల కళ్యాణం చూడటానికి కాలినడకన భద్రాచలం వెళ్ళేవాడు. 
అయితే కొన్ని సంవత్సరాలకు అతడికి వృద్యాప్యం వచ్చిన రాముడి మీద ఉన్న భక్తితో నడవలేని స్థితిలో కూడా కళ్యాణం చూడటానికి రాగ, అతడి భక్తిని చూసి మనసు కరిగిన శ్రీరాముడు భక్తుని రూపంలో వచ్చి ఆ వృద్ధుడిని ఇంటివరకు చేర్చాడు. 

💠 వచ్చే సంవత్సరము నీ కళ్యాణం ఎలా చూడటమంటూ చింతిస్తూ నిద్రించిన కృష్ణరాయలకు శ్రీరాముడు స్వప్నమున సాక్షాత్కరించి, నీకొరకు నీ తోటలో ఉన్న పుట్టలో, భద్రాచలంలో ఉన్న రూపములోనే వెలసి ఉన్నాను. నన్ను దర్శించి, నాకు గుడి కట్టించి, ధన్యుడవు కమ్ము, కాని భద్రాద్రిలో అభిజిల్లగ్నములో కళ్యాణం జరుగుతుంది. ఇచట సూర్యాస్తమయం తర్వాత జరిపించు ఆదే నాకు ఇష్టము అని చెప్పి అంతర్థానమైనాడట. 

💠 ఆశ్చర్యంగా కొంత దూరంలో, భద్రాచలంలోని రామాలయంలో వున్న సీతారామ లక్ష్మణ విగ్రహాల లాంటి విగ్రహాలే కనిపించాయి వారికి. 
వామాంకంమీద సీత కూర్చున్న రీతిలో, భద్రాచల రాముడి విగ్రహాలు దొరకడంతో ఏం చెయ్యాలన్నది ఆలోచించసాగారు.

💠 శ్రీ రాముడి విగ్రహాలు ఊరిలోనే లభించడంతో స్వామివారే అనుగ్రహించారని తలచి ఆలయ నిర్మాణం చేశారు. 
ఆయన ఆదేశానుసారం కృష్ణ రాయలుగారు ముత్తారం రామాలయాన్నీ, పక్కనే శివారు గ్రామమైన వనం వారి కృష్ణాపురాన్నీ నిర్మించారు.      
వనం కృష్ణ  రాయులు అ సంవత్సర కాలంలో  ఈ దేవాలయం నిర్మించారు అని స్థల పురాణం .  
దానితోపాటు ఒక ఊరు నెలకొన్నది. అదే నేటి వనంవారి కృష్ణాపురం (ముదిగొండ మండలం).


💠 శ్రీ లక్షణస్వామి ఆదిశేషుని అంశావతారము - శ్రీ రాముడుతోటలో వెలసినది పుట్టలోనే కనుక... ఈ రెంటికి నిదర్శనముగానో ఏమోకాని శ్రీరామచంద్రుని సన్నిధిలో చాలా పర్యాయాలు సర్పము కన్పించినదట.

💠 భద్రాచలంలో వలెనే ప్రతిసంవత్సరం శ్రీరామనవమి నాడు, ముత్తారంలో కూడా కళ్యాణోత్సవం అశేష జనవాహిని మధ్య జరుగుతుంది. 
చుట్టుపక్కల గ్రామాలనుండి వేలాది భక్తులు ఆ వేడుకను చూసేందుకు తరలి వస్తారక్కడికి. భద్రాచలంలో మధ్యాహ్నం జరిగే కళ్యాణోత్సవం, ముత్తారంలో సాయంత్రం జరుగుతుంది. 
వామాంక సీతా సమేత లక్ష్మణ విగ్రహాలతో కూడిన ఈ ఆలయంలో శ్రీరామనవమిని సాయంత్రం 6 గంటల తర్వాత నిర్వహించడం నాలుగు శతాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. 

💠 అప్పటి ముక్తవరపురమే ఇప్పటి ముత్తారంగా మార్పుచెందింది. 
వనం కృష్ణరాయుల ముగ్గురి కుమారులు, వారి సంతానం ద్వారా ఏర్పాటు అయిన గ్రామమే వనంవారి కృష్ణపురంగా పిలువబడుతోంది. గోదాదేవి కళ్యాణం భోగి రోజున జరుగుతుంది.
          

💠 ఇటీవలే గ్రామస్తులంతా కలిసి జీర్ణావస్థలో వున్న ముత్తారం రామాలయాన్ని పునర్మించి, 
ఆ ప్రాంతంలో పెద్ద దేవాలయంలాగా చేసారు.


💠 భద్రాద్రి రాముని రూపంలోనే దర్శనమిస్తున్న వనం వారి కృష్ణాపురంలోని స్వయం వ్యక్తమైన శ్రీ రాముని దర్శనము మహాభాగ్యదాయకము అని తలచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

No comments: