Adsense

Monday, August 22, 2022

పిలిచిన పలికే స్వామిమలై కుమారస్వామిl



🌿స్వామిమలై
స్వామినాధన్ దర్శనానికి
కొండ మెట్లు ఎక్కడానికి ముందు అక్కడ వున్న పుష్కరిణిలోని తీర్ధాన్ని
నెత్తిన జల్లుకోవాలి. 

🌸చల్లని  ఆ తీర్థజలాన్ని తాకి జల్లుకోగానే
మనసుకు ,  దేహానికి ఒక పవిత్రమైన
భావం కలుగుతుంది. 

🌿పుణ్యక్షేత్రాల లోని తీర్ధాలకి ఎన్నో
మహిమలు వున్నాయి. 
ఈ తీర్ధంలోనే స్వామినాథన్ తెప్పోత్సవం జరిగుతుంది. 

🌸ఈ స్వామి దర్శనానికి
మొత్తం 60 మెట్లు ఎక్కాలి. ఒక్కొక్క
మెట్టు ఎక్కుతుంటేనే మనసులో వుండే భారాలన్నీ  తీరినట్లనిపిస్తుంది. 

🌿కుమారస్వామి సన్నిధికి ముందు సాధారణంగా మయూరం వుంటుంది. 
కాని స్వామినాథన్ ఆలయంలో ఏనుగు వుంటుంది.  

🌸భక్తులు  స్వామినాథన్ దివ్యమంగళ రూపాన్ని దర్శించగానే తనువంతా పులకరించి తెలియకుండానే కన్నుల నుండి  ఆశ్రువులు వస్తాయి. 

🌿స్వామి సన్నిధానంలో , అర్చకులు ఇచ్చే దీపారాధన హారతి కాంతిలో స్వామినాధ స్వామి "నేనుండగా భయం ఎందుకు?" అన్నట్లు చిరునవ్వుతో దర్శనమిస్తాడు. 

🌸ఆ దీప కాంతులమధ్య  కుమారస్వామి
దివ్యమంగళ విగ్రహం ప్రకాశిస్తూంటుంది.

🌿స్వామినాధ స్వామి దర్శనంతో,  భక్తుల పాపాలు ,  సమస్యలు సమస్తం పటాపంచలౌతాయని
భక్తుల విశ్వాసం.
  
🌸కుమారస్వామి నివాసముండే ఆరు  ప్రముఖ ఆరుపడై క్షేత్రాలలో  స్వామిమలై  ఒకటి.  స్వామిమలై మీద సుబ్రహ్మణ్య స్వామి తనే సర్వాంతర్యామిగా  అవతరించాడు. 

🌿దానికి ఒక ఉదాహరణ..
సాధారణంగా  పంచమూర్తుల
ఊరేగింపు జరుగుతుంది. 
సోమస్కందుడు వినాయకుడు, మురుగన్, 

🌸పరాశక్తి మూర్తి,  చండికేశ్వరుడు మొదలైనవారికి  ఊరేగింపు
జరుపుతారు. కాని ఈ ఆలయంలో 
వళ్ళీ , దేవసేనా సమేత
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, 

🌿బాల దండాయుధపాణి, 
వినాయకుడు, చండికేశ్వరుని
మాత్రం ఊరేగిస్తారు.
ఇక్కడ అమ్మవారు పరాశక్తి, 
అయ్యవారు పరమేశ్వరుడు
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 
స్వరూపం.  

🌸ఇక్కడ వున్న నటరాజస్వామి సుబ్రహ్మణ్య
స్వామి స్వరూపమే. 
మార్గశిర మాసంలో ఆరుద్రా
నక్షత్రం రోజున జరిగే
"తిరువాదిరై" అభిషేకం
సుబ్రహ్మణ్య స్వామికే చేస్తారు.

🌿ఇక్కడ ప్రవహించే కావేరినదికి
పేరు కుమారధార. 
ఇక్కడ  సర్వం స్వామినాధమయం. 
ఈ ఆలయంలో వున్న వినాయకుడు " నేత్ర వినాయకుడు" .

🌸ఒకనొక సమయంలో ,  కళ్ళు కనబడని ఒక భక్తునికి కంటిచూపుని ప్రసాదించాడని  ఐహీకం. సుబ్రహ్మణ్య స్వామి దయామయుడు. 

🌿జీవితమంతా కష్టాలతో కాలం గడుపుతూ తనను
వేడుకునే  భక్తుల సమస్యలను కష్టాలను తీర్చి కరుణతో అనుగ్రహం ప్రసాదించేది ఈ వైద్యనాధుడే.

🌸స్వామినాధస్వామి మహిమ గురించి ప్రచారంలో వున్న గాధ. 
సుమారు నలభై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన :

🌿బొంబాయి నుండి ఒక వ్యక్తి తన భార్య , బిడ్డతో వచ్చాడు. పాప బంగారు బొమ్మలా చక్కగా చూడ ముచ్చటగా వుంది.  భక్తుల రద్దీ అంత ఎక్కువగా లేని సమయం.  

🌸వారు ముగ్గురూ స్వామి సన్నిధిలో కూర్చున్నారు.  వారి కళ్ళ వెంట ధారగా  నీరుకారిపోతోంది..అది చూసిన అర్చకుడు  కారణం అడిగాడు. వారి సమాధానం విన్న అర్చకుడి నోట  మాట రాక నిశ్చేష్టుడైయ్యాడు.

🌿ఆ దంపతులకు ఆ పాప ఒక్కతే శిశువు. ఎంతో  గారాబంగా పెంచుతున్నారు.
దురదృష్టం ,   ఆ పాపకి పుట్టినప్పటి నుండి  హృదయంలో రంధ్రం వున్నదట.  ఎంత తొందరగా
ఆపరేషన్ చేస్తే అంత మంచిదని డాక్టర్లు చెప్పేరట. 

🌸చేయవలసిన ఆపరేషన్ కొంచెం  కష్ట తరమైనదని కూడా చెప్పడంతో పాప విషయంలో ఆ తల్లిదండ్రులు యమయాతన అనుభవిస్తూ
ఆపరేషన్ కి ముందు
స్వామినాధ స్వామిని దర్శించుకోవాలని వచ్చారట.

🌿అర్చకుడు ఏమీ సమాధానం చెప్పలేదు విని వూరుకున్నాడు.  ఆ నాడు
స్వామికి చందన పూత అలంకారం.

🌸 అర్చకుడు స్వామి వక్షస్ధలం నుండి కొంచెం చందనం తీసి  ఆ పాప  తల్లి
తండ్రులకిచ్చి,  తమ ఊరు  చేరగానే
11 రోజుల పాటు 

🌿రాత్రి పూట  కొంచెం  కొంచెం గా యీ చందనాన్ని పాలలో కలిపి  యివ్వమని  , తరువాత డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూడమని  ధైర్యం చెప్పి పంపాడు.

🌸తరువాత  అర్చకుడు
ఆ విషయం గురించే మర్చిపోయాడు.
తరువాత మరొక  మాసానికి  అర్చకునికి   బొంబాయి నుండి ఒక ఉత్తరం వచ్చింది. అందులో ఇలా వుంది.

🌿" నాగరాజ అర్చకులకి వందనాలు. (అది అర్చకుని పేరు)   బొంబాయి రాగానే
మీరు చెప్పినట్టు పాపకి నిత్యం
కొంచెం కొంచెం గా  చందనం
కలిపి ఇచ్చాను.  

🌸11 రోజుల తరువాత డాక్టరు వద్దకి చెకప్ కి తీసుకు వెళ్ళేము.  ఆపరేషన్ కి అడ్మిట్ చేసుకుని కొన్ని పరీక్షలు జరిపారు. 

🌿మేము స్వామినాధ స్వామి  మీద భారం వేసి , పరీక్షలు
ముగించుకొని అడ్మిట్
అయ్యేము.  

🌸పరీక్షలు జరిపిన రిపోర్టు లు పట్టుకొని వైద్యులు మా రూమ్ కి వచ్చారు.  ఎప్పుడు ఆపరేషన్
చేస్తారోనని ఎదురు చూస్తున్నాము.

🌿 మా పాపకు ట్రీట్మెంట్ ఇస్తున్న  వెద్యుడు  నవ్వుతూ, ' సార్ మేము నమ్మలేకపొతున్నాము. 
ఇప్పుడు తీసిన ఎక్స్ రే లలో మీ పాపకి  హృదయంలో రంధ్రమే
కనపడలేదు. 

🌸చాలా మిరకిల్ గా వున్నది పాపకు ఏ విధమైన ఆపరేషన్ అవసరంలేదు. చాలా ఆరోగ్యంగా వుంది. పాపను మీరు ఇంటికి తీసుకు వెళ్ళిపోవచ్చు.  
అని చెప్పి మమ్మల్ని ఇంటికి 
పంపేశారు.
🌿స్వామిమలై  స్వామినాధ స్వామి మా జీవితంలో పాలు పోశాడు"  అన్నది
ఆ ఉత్తరం లోని సారాంశం.

🌸కరుణామయుడైన స్వామినాధ స్వామిని ఏం కోరుకున్నా లేదనే మాటే ఉండదు. స్వామిమలై కొండకి  60 మెట్లుంటాయి . అవి మన  సంవత్సరాల పేర్లకి సంకేతంగా చెపుతారు.  

🌿ఈ  స్వామియే  కాలాలన్నింటికీ అధిపతిగా  అర్ధం చేసుకోవాలి. స్వామి సన్నిధిలోని నాలుగు మెట్లు  నాలుగు వేదాలు. 

🌸ఈ స్వామినాధనే  వేదబ్రహ్మ స్వరూపంగా దర్శన మనుగ్రహిస్తున్నాడు.

🌿స్వామినాధ స్వామి యీ కొండమీద గురువుగా కూడా గోచరిస్తాడు. తన
తండ్రి అయిన పరమేశ్వరునికే
మంత్రోపదేశం చేసిన స్ధలం యిది.

🌸సాధారణంగా గురువు స్వభావం  ఏమిటంటే తనను  శరణు వేడుకొన్న 
జీవాత్మల స్థితి , స్థాయి,  అంతస్తులతో నిమిత్తం లేకుండా  తన
దివ్యశక్తితో  తన ఉపదేశాన్ని కోరి వచ్చినవారిని కరుణతో అనుగ్రహిస్తారు.

🌿స్వామినాధ స్వామి శరణు కోరుకొన్న భక్తులకి సర్వ శుభాలు లభిస్తాయి...స్వస్తి...

No comments: