Adsense

Thursday, October 27, 2022

30వ మహర్షి.. జడ మహర్షి

మహర్షుల దివ్య చరిత్రలు..

30 వ జడ మహర్షి  గురించి తెలుసుకుందాం

🌿పూర్వం భార్గవుడనే బ్రాహ్మణుడుండేవాడు . ఆయన సమస్త వేద శాస్త్రాలు నేర్చుకున్నాడు . మంచి వాళ్ళకే మంచివాడు .

🌸ఈ భార్గవుడి కొడుకే జడ మహర్షి జడ మహర్షి పుట్టాక ఆయనకి జాతకర్మ , చెవులు కుట్టించడం , ఉపనయనం లాంటి చెయ్యవలసినవన్నీ పూర్తిచేశాడు భార్గవుడు .

🌿 ఒకనాడు కొడుకుని పిలిచి నువ్వు వెళ్ళి ఒక గురువుగార్ని ఆశ్రయించి విద్య నేర్చుకుని గృహస్థుడవై సంతానాన్ని కని

🌸వానప్రస్థాశ్రమానికి వెళ్ళి తపస్సు చేసుకుని అన్నీ పరిత్యజించి , నిర్మోహివి , నిర్జితేంద్రియుడివి నిరంకారివి , నిర్మత్సరుడివి , నిత్యోపవాసివి అయి జీవించమని చెప్పాడు .

🌿కాని జడ మహర్షి మాట్లాడలేదు . తండ్రి చాలా సార్లు అడిగాక తండ్రీ ! నువ్వు చెప్పినవి చాలా జన్మల్లో చేశాను . నేను ఇప్పటికి అయిదువేల జన్మలెత్తాను .

🌸అన్ని రకాలయిన
దుఃఖాలు అనుభవించాను . పుత్ర , మిత్ర , కళత్ర , శత్రు , భ్రాతృ వియోగాలన్నీ అనుభవించాను . కొన్ని వేలమంది తల్లుల పాలు త్రాగాను .

🌿 బాల్యం , యౌవనం , ముసలితనం అన్నీ నాకు తెలుసు . ఎన్నిసార్లో పుట్టాను . ఎన్నిసార్లో చచ్చాను . ఇప్పుడు నీకు కొడుకుగా పుట్టాను . నేను జ్ఞానినై పుట్టాను .

🌸నువ్వు చెప్పేవేవీ నా మనసులోకి వెళ్ళవు . జడుడు అనే పేరు నాకు సరిపోతుంది కూడా ... అన్నాడు . అన్నీ విని భార్గవుడు కుమారా ! నీకీ జడత్వం ఎందుకు వచ్చింది ?

🌿ఇంత విజ్ఞానం వుంది కదా ... నీకేమయినా శాపం వుందా ... వివరంగా చెప్పమన్నాడు . నేను పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణి  చాలా మంది శిష్యులకి జ్ఞానోపదేశం చేసిన గురువుని .

🌸అజ్ఞానమనే చీకటిని పోగొట్టుకుని , ఎవరికీ దొరకని జన్మజన్మలు గుర్తు చేసుకోగలిగిన జ్ఞానం ఈ జన్మలో పొందాను .

🌿నేను ఇంక మోక్షానికి దారి వెతుక్కోవాలి . నీకేమైనా సందేహాలుంటే అడుగు అవి తీర్చి వెళ్ళిపోతానన్నాడు

🌸జడ మహర్షి భార్గవుడు కొడుకుని చూసి ఆశ్చర్యంతో గర్భంలో వుండగానే జ్ఞానివైన నిన్ను కన్న మేము ఎన్నినోములు నోచి ఉంటామో !

🌿ఇల్లాంటి కులదీపంలాంటి కొడుకుని పొందే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది ? నేను నిన్ను గురువుగా అనుకొని కొన్ని ప్రశ్నల అడుగుతాను , సమాధానం చెప్పమని ఇలా అడిగాడు భార్గవుడు .

🌸ప్రాణికి పుట్టడం , బ్రతకడం , మరణించడం ఇవి ఎలా జరుగుతున్నాయి ? ఎలా పుడుతున్నాడు ? ఎలా చచ్చిపోతున్నాడు ? ఎలా పాపపుణ్యాలు అనుభవిస్తున్నాడు ?
జ్ఞానం ఎలా పొందుతున్నాడు ? అని అడిగాడు .

🌿 జడ మహర్షి తండ్రిగారూ ! మొదట మనిషి మరణించే విధం చెప్తాను వినండి . మరణకాలం వచ్చినప్పుడు శరీరం బాగా వేడెక్కి ఆవిర్లు వస్తాయి .

🌸 మలమూత్రాలు బయటికి వచ్చే దారులు మూసుకుపోయి మలమూత్రాలు రావడం ఆగిపోతుంది . పొట్ట పెరిగి పెదవులు ఎండి , గొంతు తడి ఆరిపోయి ,

🌿మాటపడిపోయి , కళ్ళు జీవం లేనట్లయి , నాలుక వెనుకకి లాక్కుపోయి , శ్వాసాగిపోతుంది .

🌸 ధర్మం తప్పనివాడు , అన్నం నీళ్ళు దానం చేసి పెద్దలని గౌరవించి , అసూయ లేకుండా , అసత్యం పలకకుండా ఉన్నవాడు సుఖంగా మంచిగా మరణిస్తాడు .

🌿అలా మంచిగా వుండని వాడు బాధపడూ , కష్టపడూ మరణిస్తాడు . మరణించాక తల్లిదండ్రుల వల్ల వచ్చిన శరీరం పోయి , వారివారి పనులు , వయస్సు , రూపాన్ని బట్టి జీవులు యాతనా శరీరాల్లో ప్రవేశిస్తారు .

🌸 ఇలా పాపం చేసిన వాళ్ళ యాతనా శరీరాల్ని యమభటులు కాళ్ళు చేతులు కట్టేసి కర్రలతో కొడూతు , వేడి నేలమీద ఈడ్చుకుంటూ , రాళ్లు , గుట్టలు , ముళ్ళు గల భయంకరమైన మార్గంలో

🌿నక్కలు పిక్కలు కొరికి తింటూ వెంట వస్తూ ఉండగా తీసికెడతారు .
ఇలా తీసుకెడుతూ వుండగా బంధువులు మిత్రులు అతని దేహాన్ని కాలుస్తుంటే ఆ వేడికి తట్టుకోలేక బాధపడ్డాడు .

🌸పన్నెండు రోజుల వరకు బంధువులు చేసే పిండప్రదానాలు , భూమిమీద పడుకునే ముఖ్య వ్రతం వల్ల యాతనా శరీరం తృప్తిపడుతుంది . పన్నెండవ రోజు మైలస్నానాలు , తర్పణాలు ఇలాంటి వాటి వల్ల యాతనా శరీరం సంతోషపడుతుంది .

🌿పదమూడో రోజు జీవిని యమధర్మరాజు దగ్గరకి తీసుకెడతారు . చిత్రగుప్తుడి దగ్గర పాపాల పట్టీ ఉంటుంది కదా ... అది చూసి యమధర్మరాజు శిక్ష వేస్తాడు .
వాటి గురించి కొన్ని తెలుసుకుందాం .

🌷రౌరవం : 🌷

🌸ఇది ఉండే ప్రదేశం రెండువేల యోజనాలు . అదంతా ఎర్రటి నిప్పులు భగభగమంటూ ఉంటాయి .

🌿అందులో వేస్తే కాలి బూడిద అవడం మళ్ళీ మామూలు అవడం ఇలా జరుగుతూనే ఉంటుంది .

🌷మహారౌరవం :🌷

🌸 ఇది ఎన్నో వేల యోజనాలు . ఇందులో యమభటులు పాపాలు చేసినవాళ్ళని కాళ్ళు , చేతులు కట్టి పడేస్తే కుక్కలు , నక్కలు , పాములు గ్రద్దలు ఒకటేమిటి
అన్ని కలిసి పొడిచి కఱచి మాంసం ఎముకలు నమిలి నమిలి బాధ పెడ్తాయి .

🌷తమో నరకం : 🌷

🌿ఇది అతి చల్లగా ఉంటుంది . కాళ్ళు , చేతులు కొంకర్లుపోయి ఒకళ్ళరక్తం ఒకళ్ళు తాగేస్తారు .

🌷నికృంతం : 🌷

🌸దీంట్లో చక్రాలు తిరుగుతూ శరీరాల్ని ముక్కలుగా చేస్తుంటే మళ్ళీ అవి అతుక్కుంటూ అవి మళ్ళీ ముక్కలవుతూ ఆచక్రంలో తిరుగుతూనే ఉంటారు . 

🌷అప్రతిష్ఠ నరకం : 🌷

🌿పేగులు పిండి మెడలు వేల్లాడుతూ రక్తాలు కారుతున్న కళ్ళతో రాట్నాలమీద వేలవేల సంవత్సరాలు త్రిప్పించబడతారు .

🌷అసిపత్రవనం : 🌷

🌸ఇది కొన్ని వేల యోజనాల్లో వున్న ప్రదేశం . ఇది చాలా చల్లగా వుండి , ఆకులు , పూవులు లాంటి
కత్తులతో వున్న చెట్లతో వుంటుంది .

🌿 పాపాత్ములని దీంట్లో పడేయ్యగానే ఆ కత్తులు నరికేస్తూ ఉంటాయి . పెద్ద పెద్ద కుక్కలు అవి నోటితో పట్టుకుని తిరుగుతూ ఉంటాయి . 

🌷తప్తకుంభ నరకం : 🌷

🌸ఎప్పుడూ మండుతూ వుండే మంటలమీద పెద్ద పెద్ద కుండల్లో సలసలకాగే నూనెలో తలక్రిందులుగా పడేస్తారు . 

🌷అమితకర్ధమ : 🌷

🌿ఈ నరకంలో పెద్ద పెద్ద పక్షులు ఇనపముక్కులతో పొడుస్తూ వుంటే విపరీతమైన ఆకలి దాహంతో రక్తం కారుతూ అరుస్తూ ఉంటారు .

🌸ఇలాంటి నరకాలు ఎన్నో ఉన్నాయని చెప్పాడు జడ మహర్షి . భార్గవుడు మళ్ళీ ఏ పాపాలు చేస్తే ఏ జన్మ వస్తుందో వివరంగా చెప్పమన్నాడు జడ మహర్షిని .

🌿నరక బాధలు అనుభవించిన తర్వాత వాళ్ళ జన్మలు ఎలా ఉంటాయో విపులంగా చెప్తాను విను అన్నాడు జడ మహర్షి .

🌸కడజాతి వాడి నుంచి దానం తీసుకున్న బ్రాహ్మణుడు గాడిదగాను , అతనికి సహాయం చేసినవాడు పురుగుగాను పుడతారు .

🌿గురువుని మోసగించిన వాడు కుక్క గురువు భార్యతో కలసిన వాడు గాడిద , తల్లిదండ్రులు చెప్పినట్లు విననివాడు గోరువంక ,

🌸 వాళ్ళకి మనోవ్యాధి కలిగించినవాడు తాబేలు , ఒకరి ఉప్పు తిని తర్వాత శతృవర్గంలో చేరినవాడు కోతి , విశ్వాసహీనుడు చేపగాను , అసూయకలవాడు డేగగాను ,

🌿 ధనం లాంటివి దొంగతనం చేసినవాడు కొంగగానూ , మిత్రుడి భార్యతో కలిసిన వాడు పంది , యజ్ఞం , దానం , వివాహం చేసేటప్పుడు విఘ్నం కలిగించినవాడు , కూతుర్ని ఒకరికిచ్చి పోట్లాడి మళ్ళీ వేరే పెళ్ళి చేసినవాడు పురుగులు గాను ,

🌸 దేవతలకి , పితరులకి , అతిథులకి ముందు అన్నం పెట్టకుండా తానే తినేవాడు కాకి , బ్రాహ్మణుడు శూద్రస్త్రీతో వెడితే కట్టెలోని పురుగుగాను , కృతజ్ఞతలేని వాడు పురుగు , తేలు , చేపగాను ,

🌿 ఆడవాళ్ళని పిల్లలని చంపినవాడు పురుగుగాను , అన్నం దొంగతనం చేసినవాడు ఈగగాను ఇలా రకారకాలుగా పుడతారు . పాపం పూర్తి అయ్యేవరకు మనుష్య జన్మ రాదని చెప్పాడు .

🌸మరి పుణ్యం చేసుకున్న వారి గురించి చెప్పనే లేదని భార్గవుడు అడిగితే జడ మహర్షి పుణ్యం చేసుకున్న వాళ్ళ సంగతి కూడా చెప్తున్నాడు .

🌿వాళ్ళు దివ్యాభరణాలు , దివ్యాంబరాలు , దివ్య సుగంధాలు అనుభవిస్తూ విమానంలో స్వర్గానికి వెళ్ళి అక్కడ స్వర్గసుఖాలు అనుభవించి పుణ్యం అయిపోగానే మళ్ళీ మనిషి జన్మ ఎత్తుతారని చెప్పాడు .

🌸 భార్గవుడు కుమారా ! గర్భం లోకి మనిషి ఎలా ప్రవేశిస్తాడు ? ఎలా పెరుగుతాడు ? వివరంగా చెప్పమన్నాడు .

🌿స్త్రీ పురుషులు కలిసే సమయంలో పరలోకానికి వెళ్ళిపోయిన జీవుడు చాలా వేగంగా గాలి రూపంలో శుక్లంలో కలుస్తాడు . అది మావిగా పిండంగా మారుతుంది .

🌸తర్వాత పంచాంగాలు , ఉపాంగాలు పుడతాయి . అన్ని అవయవాలు పెరిగి ఒక బొటన వ్రేలిమీది ఒకటి వేసుకుని తొడల ప్రక్కన చేతులు పెట్టి , చేతులు మోకాళ్ళ పైన , కళ్లు మోకాళ్ళ వెనుక , ముక్కు మోకాళ్ళ నడుమ భాగంలో ,

🌿 రెండు పిక్కలు దగ్గరకి చేర్చి బాగా ముడుచుకుపోయి మోకాళ్ళ మధ్య ఉండగా ఆ తల్లి కడుపులో వేడిని భరిస్తూ , ఆమె తీసుకునే ఆహారం శరీరాన్ని పెంచుతుండగా

🌸 పుణ్యపాపాలు అతన్ని ఆశ్రయించడం చేత అతనికి జ్ఞానం కలుగుతుంది . తొమ్మిది మాసాలు నిండిన తర్వాత శిశువు రూపంలో బయటికి వచ్చి ఏడుస్తాడు .

🌿మిగిలింది మామూలే మీకు తెలిసిందే కదా ... భార్గవుడు చేతులు జోడించి యోగీంద్రా ! మోక్షాన్ని పొందడానికి యోగవిద్యని కూడా నువ్వే ఉపదేశం చెయ్యమన్నాడు .

🌸జడ మహర్షి ఇలా చెప్పాడు . యోగి అవమానం అమృతంలా , గౌరవం విషంలా , మాట ఎప్పుడు సత్యాన్ని చెప్పేదిగా , తలపులు బుద్ధిగా ఉండి బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ

🌿తన ఆత్మని పరమాత్మమీద నిలిపి లోకంలో పరమాత్మ తప్ప యింకేమి లేదన్నట్లుగా ధ్యానం చేసుకుంటూ పరమాత్మని అనుభవించగలిగిననాడు మోక్షం కలుగుతుందని చెప్పి తాను కూడా యోగ సాధన కోసం వెళ్ళిపోయాడు ...

🌸ఇదండీ జడ మహర్షి చరిత్ర 

No comments: