Adsense

Thursday, October 27, 2022

32వ మహర్షి.. జాబాలి మహర్షి

 మహర్షుల చరిత్ర...
32వ జాబాలి మహర్షి గురించి తెలుసుకుందాము


🌿జాబాలి ముని దశరధ మహారాజు రాజ పురోహితులలో ఒకడు . ఆయన మంత్రి వర్గ సభ్యులలో కూడా ఒకడు.

🌸శ్రీరామచంద్రుడు అరణ్యవాసము నుండి తిరిగి ఎలాగైనా అయోధ్యకు తీసుకుని వచ్చి పట్టాభిషిక్తుని చేయాలని తలంపుతో భరతునితో కూడా వెళ్ళిన పరివారములో జాబాలి ఒకడు.

🌿జాబాలి ప్రసక్తి వాల్మీకి రామాయణం అయోధ్య కాండలో ఉంది . జాబాల అనే ఒక విప్ర స్త్రీకి కన్యత్వ దశలోనే దేవతా వరప్రసాదమున పుట్టిన వాడే ఈ జాబాలి.

🌸జాబాలికి యుక్త వయసు రాగానే అతనిని తల్లి హరిద్రుమతుడు అనే గురువు దగ్గర విద్య నేర్చుకునేందుకు అప్పగిస్తుంది.

🌿కొంతకాలానికి గురువు జాబాలికి ఉపనయనము చేసే సంకల్పముతో అతని కుల గోత్రములు అడుగగా, అవి తనకు తెలియవనుట వలన, మీ తల్లిని అడిగి తెలుసుకుని రావలసినదని పంపుతాడు.

🌸ఆ సందర్భములో ఇంటి దగ్గర తన తల్లిని అడుగగా, తనకు భర్త లేని విషయము తెలుపుతూ, మన గోత్రం ఏమిటో నాకు తెలియదు.

🌿 నా యౌవనంలో దాసిగా అనేక చోట్ల తిరిగి పనిచేసాను. అనేక మందికి సేవలు చేసి, నిన్ను కన్నాను. కానీ నీ తండ్రి ఎవరో నాకు తెలియదు.

🌸ఒక్కటి మాత్రం సత్యం. నా పేరు జాబాల. ఇంక నుండి నీ పేరు సత్యకాముడు అను జాబాలి అని చెప్పమని కుమారునితో చెప్పి గురువు దగ్గరకు తిరిగి పంపుతుంది.

🌿గురువు తన దివ్య దృష్టితో అతని జన్మకథను తెలుసుకొని గాయత్రీ మంత్ర ఉపదేశము చేస్తాడు. తదుపరి కాలములో ఆయన “సత్యకామ జాబాలి” అని కూడా ప్రసిద్ధి చెందుతాడు.

🌸బ్రహ్మ విద్యను అభ్యసించు అర్హత సంపాదించే వరకు గురువు జాబాలిని తన గోవులను మేపుతూ ఉండమని ఆదేశిస్తాడు.

🌿గురుభక్తితో సత్య సంధుడై జాబాలి గురు గోవులను తోలుకొని వనమునకు వెళ్ళేవాడు. ఇతని గురుభక్తికి, గోపూజపరతకు దేవతలు మెచ్చుకొని ఉపకారము చేయాలని సంకల్పిస్తారు.

🌸 ఒకనాడు వాయుదేవుడు ఒక వృషభములోనికి ప్రవేశించి, “నీవు సత్యనిష్టతో మమ్ములందరిని కాపాడుట వలన వేల మందిమి అయితిమి.

🌿గురు గృహమునకు మమ్మల్ని తోలుకొని వెళ్ళితే, మేము నీకు చేతనయినంత సహాయము చేస్తాము” అని అనుట వలన జాబాలి గోవులతో గురు గృహమునకు బయలు దేరాడు.

🌸 మార్గమధ్య దారిలో వృషభ రూపములో ఉన్న వాయుదేవుడు జాబాలికి బ్రహ్మ జ్ఞానమునకు సంబంధించిన ఒక దివ్యమైన మంత్రపాదము చెప్పగా,

🌿 అదేవిధముగా ఇంకొక వృషభ రూపములో ఉన్న అగ్నిదేవుడు నేర్పించగా, మరొక వృషభములోనికి ప్రవేశించి సూర్యదేవుడు, చివరగా ” మద్గియ” అను పక్షి కూడా మంత్రపాదములు బోధించగా బ్రహ్మజ్ఞాన సంపన్నుడయ్యాడు జాబాలి.

🌸గురువైన హరిద్రుమతుడు దివ్య తేజస్సుతో బ్రహ్మజ్ఞానము పొందిన జాబాలిని చూసి, నీవు ఇంక ఒక స్వంత ఆశ్రమము నిర్మించుకొని దివ్య జీవితము గడుపు మనగా, జాబాలి నిరాకరిస్తాడు.

🌿గురుముఖముగా బ్రహ్మజ్ఞానము పొందినదే శాశ్వతమని తలంచి,
ఆ సంగతి గురువుకు తెలియజేయగా, గురుభక్తితో ఉన్న అతనికి బ్రహ్మజ్ఞానమును గురువు తన ఆశ్రమము నందే ఉపదేశించి పంపాడు.

🌸జాబాలి మహర్షి తిరుమల అనే పవిత్ర ప్రదేశంలో నివసించి, తపస్సు సాధన చేశాడు. ప్రస్తుతం తిరుపతి సమీపంలోని ప్రదేశానికి ” జాబాలి తీర్థం ” అని పిలుస్తారు.

🌿జాబాలి తీర్థము శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయమునకు, వాయవ్యభాగమున ఉన్నది. అనేక మంది ప్రజలు తమ తీవ్రమైన గ్రహా దోషాలను పరిష్కరించ బడతాయని

🌸హనుమంతుడు, వినాయకుడు విగ్రహాలను కూడా పూజించడంతో పాటుగా ఈ జాబాలి తీర్థం కూడా సందర్శించుకుంటారు.

🌿చిత్రకూట పర్వత ప్రాంతమున జాబాలి ఒక ఆశ్రమము నిర్మించుకొని సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించి పరతత్వ రహస్యాలను ఎన్నింటినో గ్రహించాడు.

🌸పరమ పవిత్ర జ్ఞానమునకు అర్హుడు అయిన పిప్పలాద మహర్షికి, జాబాలి మహర్షి సర్వము బోధించిన బ్రహ్మజ్ఞానమే “జాబాల్యుపనిషత్తు”. “జాబాల ఉపనిషత్తు” అనేది జాబాలి మహర్షి బోధనము. జాబాలి గోత్రం క్లుప్తంగా దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణులు ఉపయోగిస్తారు.

🌿తండ్రి మాటను పక్కన పెట్టి రాజ్యాధికారాన్ని తీసుకోవచ్చని జాబాలి రామునికి చెబుతాడు. ఇక్కడ జాబాలి నోట పలికించినదంతా కూడా చార్వాకుల(వైదికాచారాలను ఖండించినవారు) ధోరణి సుస్పష్టంగా కనిపిస్తుంది.

🌸అప్పటికి వైదికాచారాలను, కర్మకాండనూ, యజ్ఙక్రతు విధానాలను నిరసించే ధోరణి బలపడుతోంది.

🌿అందుకే కర్మకాండను బలంగా ప్రచారం చేసే రామాయణం అవసరమైంది. చార్వాక మతాన్ని జాబాలి నోట చెప్పించి దాన్ని ఖండించటం రామాయణ లక్ష్యాలలో ఒకటి.

🌸 “ప్రత్యక్ష్యంగా ఉన్నదే వాస్తవం. పరోక్ష ఫలాల కోసం ప్రత్యక్ష ఫలాన్ని వదలి పెట్టకు. తండ్రి బీజమూ, తల్లి శుక్లమూ, రక్తమూ జీవి పుట్టుకకు కారణాలు

🌿అవి కేవలం నిమిత్త మాత్రాలు. ప్రత్యక్ష లోకాన్ని విడిచి పరోక్ష లోకాన్ని గురించి చింతించటం అవివేకం. క్రతు కర్మలన్నీ దానాలు చేయించటానికి కల్పించినవే. ఇవన్నీ కల్పితమైన ఆచారాలు .

🌸 పరలోకం అనేది లేదనుకో. కనిపించని దానిని వదిలిపెట్టు, కనిపించేదే సత్యం. అందరినీ అందరూ ఈ భూమ్మీద నుంచి వదలిపోతారు. నీవు యవ్వనంలో ఉన్నావు.

🌿భోగభాగ్యాలు అనుభవించవలసిన తరుణమిది. మరణానంతరం జీవరాసులన్నీ పంచభూతాల్లో కలసిపోతాయి .

🌸మరణానంతరం ఏమీలేదు. దేహం ఉండగానే సుఖించాలి. బుద్ధిహీనులే ఈ భూమిలో ప్రత్యక్షమైనదాన్ని వదలుకొని, పరోక్షమైనదాన్ని నమ్ముకుంటారు.

🌿ఓ రామచంద్రా! ఆత్మ లేదు. మోక్షం లేదు. స్వర్గం లేదు. కర్మ లేదు. కర్మఫలం అనుభవించే వారు లేరు. పాప పుణ్యాలు లేవు .

🌸భగవంతుడు లేడు. కష్టాలను, దుఃఖాన్ని ప్రజ్ఙచేత తగ్గించుకొని, దేహాన్ని పటిష్టం చేసుకోవడమే బుద్ధిమంతుని లక్షణం.

🌿ఎందుకంటావా ఈ దేహం పతనమైపోతే మళ్ళీ తిరిగి రాదు …”ఇలా సుదీర్ఘంగా జాబాలి రాముడితో చెబుతాడు.

🌸దానికి రాముడు ఖండన కూడా అంతకంటే సుదీర్ఘంగా ఉంటుంది. భగవంతుని సృష్టిలో ఏదీ అనవసరంగా సృజించపడి ఉండదు.

🌿ప్రతిదానికీ ఏదో ప్రయోజనం ఉండే ఉంటుంది. అది నాస్తికవాదమైనా, ఆస్తికవాదమైనా! వనవాసానికి శ్రీరాముడు వెళ్ళినతరువాత , భరతుడు రావటం.

🌸తన తల్లిచేసినదానికి బాధపడటం, తరువాత రామున్ని తిరిగి తీసుకురావటానికి అరణ్యానికి మంత్రి బంధువర్గ, ఆచార్య సమేతంగా వెళతాడు.

🌿అక్కడ రాముని మనసు మార్చటానికి అందరూ ప్రయత్నించి విఫలం చెందుతారు. ధర్మ మార్గమునుండి రామున్ని మరల్చటం ఎవ్వరి వల్లాకాదు.

🌸అప్పుడు దశరధుని మంత్రి జాబాలి రంగప్రవేశం చేసి పై విధంగా రాముడితో చెబుతాడు. జాబాలి చేసిన నాస్తికవాద ధోరణి విని ,

🌿రాముడు గంభీరంగా, “స్వామీ! మీరు నా మేలుకోరి చెప్పిన మాటలన్నీ చాలా వింతగా ఉన్నాయి . మీ ఉపదేశాన్ని నేను ఆచరిస్తే నాకంటే దుశ్శీలిడు మరొకడు ఉండడు.

🌸ప్రజలందరూ నన్ను అసత్యపరాయణునిగా వేలెత్తి చూపుతారు. ” అప్పుడు వశిష్టుడు కలుగచేసుకుని,

🌿“శ్రీరామా! నిన్ను అయోధ్యాధీశునిగా పట్టాభిషిక్తుని చేయాలని తలంపుతోనే జాబాలి అలా మాట్లాడాడు గాని, నిజానికి అతను నాస్తికుడు కాడు”

🌸జాబాలి రాముడి మాటలు విని రామా ! నేను నాస్తికుణ్ణి కాదు . నీ మనస్సు తెలుసుకునేందుకు అలా అన్నాను అని రాముణ్ణి పూజించి వెళ్ళిపోయాడు .

🌿తేజఃపురానికి రాజు ఋతంభరుడు . అతనికి చాలా మంది భార్యలున్నారు . కాని , సంతానం లేదు . ఒకసారి జాబాలి మహర్షి ఋతంభరుడి రాజ్యానికి వచ్చాడు .

🌸రాజు ఆయనని తగిన విధంగా సత్కారం చేసి మహర్షీ ! నాకు సంతానం లేదు . నాకు ఈ బాధ నుంచి విముక్తి కలిగించండన్నాడు .

🌿రాజా ! గోపూజ చేస్తే సంతానం కలుగుతుంది . ఆవుని కొట్టిన పాపాత్ముడు చెయ్యి నరకబడి నరకానికి పోతాడు .

🌸ఆవుని ఏ రకంగా హింసించినా నరకానికి పోతారు . ఎందుకంటే ఆవు దేహంలో దేవతలున్నారని చెప్పాడు జాబాలి . జాబాలి చెప్పినట్లే ఋతంభరుడు ఆవుని పూజించాడు .

🌿కాని ఒకనాడు రాజు ఆవుని తీసుకుని వెడుతుంటే సింహం దాని మీద పడి చంపేసింది . రాజు భయపడి జాబాలిని ఏం చెయ్యమంటారని అడిగాడు . ఋతుపర్ణుణ్ణి అడగమని పంపించాడు జాబాలి .

🌸ఋతుపర్ణుడు రాజు చెప్పింది విని రాజా ! ఇంకొక ఆవుని తెచ్చుకుని రామనామం చేస్తూ దాన్ని పూజచేసి ఒక బ్రాహ్మణుడికి దానమియ్యి అని చెప్పాడు .

🌿రాజు అలాగే చేసి ఒక కొడుకుని పొందాడు . అతడి పేరు సత్యవంతుడు . అతడు గొప్ప రామభక్తుడు కూడా ...

🌸ఇదండీ జాబాలి మహర్షి చరిత్ర  స్వస్తి.

No comments: