Adsense

Saturday, October 1, 2022

శ్రీవారి బ్రహ్మోత్సవాలు5వ రోజు ఉదయం : మోహిని అవతారం

 


💠 అయిదవ నాటి పగలు వేంకటాచలపతి మోహినీరూపం ధరించి రాక్షసులను మోహింపజేసిన జగన్మోహినిగా బంగారుపల్లకిలో సిగ్గులు సోయగాలు ఒలకబోయుచు భక్తులకు దర్శనమిస్తాడు.

💠 శ్రీకృష్ణుడు డంతపుపల్లకిపై వెంబడే వస్తుంటాడు. విష్ణుదేవుని మోహినీ అవతార వృత్తాంతం భాగవతంలో కడురమణీయంగా వర్ణించబడింది, దేవతలు రాక్షసులు వైరము మాని అమృతంకోసం కలిసి పాలసముద్రాన్ని చిలుకుతారు.
చివరలో పాలసముద్రం నుండి అమృతం లభిస్తుంది. దానికై దేవతలు, రాక్షసులు తగవు లాడుకొంటారు.
ఆ సందర్భంలో జగన్నాటక సూత్రధారి విష్ణుదేవుడు జగన్మోహినీ రూపంలో అవతరించి, రాక్షసులను మోహింపజేసి, వారి వద్దనున్న అమృతభాండం తీసికొని దేవతలకు అమృతం పంచిపెడతాడు.

💠 ఇట్లు మోహినీ అవతారం బలవంతులమని అహంకరించి యున్న రాక్షసులకు అమృతం లభించకపోవుటకు, జగన్నాథుని ఆశ్రయించిన దేవతలకు అమృతం లభించుటకు కారణమయింది.

💠 మలయప్పస్వామి మోహిని అలంకారంలో నిల్చున్న భంగిమలో కాకుండా కూర్చున్న భంగిమలో కనిపిస్తాడు. స్త్రీలు ధరించే అన్ని ఆభరణాలతో స్వామి అలంకరించబడతాడు. మలయప్పస్వామికి పట్టుచీర, కిరీటంపైన రత్నఖచితమైన సూర్యచంద్ర సావేరిని అలంకరిస్తారు. స్వామివారి ముక్కుకు వజ్రపు ముక్కుపుడక, ముత్యాల బులాకిని అలంకరిస్తారు.

💠 ఊర్ధ్వ హస్తాలలో వుండే శంఖచక్రాల స్థానంలో రెండు వికసించిన పద్మాలను అలంకరిస్తారు. వరదభంగిమలో వుండే స్వామి వారి కుడి చేయి మోహిని అలంకరణలో అభయహస్తంగా వుంటుంది.

💠 ఈ మనోహరమైన రూపంలో స్వామివారు భక్తులకు కనువిందు చేస్తుంటారు. బ్రహ్మోత్సవాలలో అన్ని వాహన ఊరేగింపులు వాహన మండపం నుండి ప్రారంభమౌతుంది.

💠 మోహిని అవతారం మాత్రం శ్రీవారి ఆలయం నుండి పల్లకిపై రావడంతో ఊరేగింపు ప్రారంభమౌతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి మోహిని అవతారంలో బలగర్వితులు, అహంకారులు కార్యఫలితాన్ని పొందలేరని, వినయ విధేయతలతో భగవంతుని ఆశ్రయించినవారే కృషి ఫలితాన్ని పొందగలరని హితం ఉపదేశిస్తున్నాడు.

💠 మోహినీ అవతారం వలె బ్రహ్మోత్సవాలలో అన్ని వాహనసేవలు ఇతిహాస కథాఘట్టాలు, పురాణకథా సన్నివేశాలు ప్రాతిపదికగా కల్గివున్నాయి.
ఇవి భగవంతుని విష్ణుమూర్తి- సర్వవ్యాపకత్వాన్ని, సంరక్షకత్వాన్ని తెలియజేస్తున్నాయి. 'సర్వం విష్ణుమయం జగత్' అను సందేశాన్ని వినిపిస్తున్నాయి. 

No comments: