Adsense

Friday, October 28, 2022

58వ మార్కండేయ మహర్షి

మన మహర్షుల చరిత్రలు
 58వ మార్కండేయ మహర్షి గురించి తెలుసుకుందాము


🌿మార్కండేయ మహర్షి
మనం తుమ్మినపుడు పెద్దవాళ్ళు పలికే పేరు . ఎందుకో తెలుసా ?

🌸ఎందుకంటే మన భారత మహర్షుల్లో మృత్యువు అంటే చావు లేకుండా వరాలు పొంది ఇప్పటికీ సజీవంగా వున్నాడు మార్కండేయ మహర్షి .

🌿తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కూడా అంతకాలం ఉండాలని కోరుకుని మార్కండేయుడంత ఆయుషు రావాలని దీవిస్తుంటారు . అదన్న మాట విషయం .

🌸ఇప్పుడు మార్కండేయ మహర్షి గురించి వివరంగా తెలుసుకుందాం ....

🌿అనగనగా మృకండుడు అనే రుషి ఉండేవారు. మృకండుడు శివుని గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతడిని రాసుకుంటూ పోయినా కూడా పట్టించుకునేవాడు కాదట.

🌸అలాంటి మృకండునికి మరుద్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది. భగవన్నామస్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఆ దంపతులకి ఒకటే లోటు. వారికి పిల్లలు లేరు!

🌿సంతానభాగ్యం కోసం వారిద్దరూ వారణాశి క్షేత్రానికి చేరుకుని శివుని పూజించడం మొదలుపెట్టారు. ఆ దంపతుల దీక్షకు మెచ్చిన శివుడు వారి ముందు ప్రత్యక్షం అయ్యాడు.

🌸కానీ ఆ పరమేశ్వరునికి వారిని పరీక్షించాలని అనిపించిందో ఏమో… 
మీకు తప్పకుండా పుత్రసంతానాన్ని ప్రసాదిస్తాను.

🌿 కానీ ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి. సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా లేకపోతే పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా?
 అని అడిగాడు. 

🌸
వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే మాత్రమేం, మాకు గుణవంతుడైన అల్పయుష్కుడే కావాలి
 అని కోరుకున్నారు మృకండుని దంపతులు.
 
🌿అచిరకాలంలోనే ఆ దంపతులకు వెలుగురేఖలాంటి ఓ బాలుడు కలిగాడు. మృకండుని కుమారుడు కాబట్టి అతనికి మార్కండేయుడు అన్న పేరు వచ్చింది.

🌸శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు సకలగుణాభిరాముడు!
బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలనూ ఔపోసన పట్టాడు మార్కండేయుడు.

🌿 మరో పక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదనిపించుకున్నాడు. ఇలా ఉండగా ఓసారి మృకండుని ఆశ్రమానికి సప్తరుషులు వచ్చారు.

🌸మార్కండేయుని చూడగానే అతనికి త్వరలోనే ఆయుష్షు తీరనుందని వారికి అర్థమైంది. మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు సప్తరుషులు.

🌿మార్కండేయుని చూసిన బ్రహ్మ, అతడిని నిరంతరం శివారాధన చేస్తూండమని సూచించాడు. అందరూ కలిసి, శివనామస్మరణ చేత అకాలమృత్యవు దరిచేరదని మార్కండేయునికి తెలియచేశారు.
 
🌸పెద్దల మాటల మేరకు ఒక శివలింగం ముందర కూర్చుని శివధ్యానాన్ని మొదలుపెట్టాడు మార్కండేయుడు. ఒకపక్క అతని మృత్యుఘడియలు సమీపిస్తున్నాయి.

🌿మరో పక్క నోటి నుంచి శివనామస్మరణ ఆగడం లేదు సరికదా ఒకో నిమిషం గడిచేకొద్దీ మరింత జోరుగా సాగుతోంది. యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకురావడానికి బయల్దేరారు యమభటులు.

🌸కానీ మార్కండేయుని తీసుకురావడం కాదు కదా! అతని దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారు. ఇక ఆ పిల్లవాడిని తానే స్వయంగా తీసుకురావాలనుకున్నాడు యముడు.

🌿తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి, యమపాశాన్ని చేతపట్టి మార్కండేయుని వైపు సాగిపోయాడు. 

🌸
ఆ ధ్యానాన్ని ఆపి ఇవతలికి రా! నీ మృత్యువు సమీపించింది
 అని హుంకరించాడు యముడు. కానీ యముని మాటలను విన్న మార్కండేయుడు ఇవతలికి రాలేదు సరికదా, గట్టిగా ఆ శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు.
 
🌿ఇక యమునికి ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఆఖరి ఆస్త్రంగా తన పాశాన్ని మార్కండేయుని మీదకు వదిలాడు. కానీ మార్కండేయునితో పాటుగా ఉన్న శివలింగానికి ఆ పాశం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటకు ఉరికాడు.

🌸తన మీదకీ, తన భక్తుని మీదకీ పాశాన్ని విడుస్తావా అంటూ యముడిని ఒక్కపెట్టున సంహరించాడు.

🌿ఆ సందర్భంలోనే శివునికి 
కాలాంతకుడు
 అనే బిరుడు వచ్చింది. అంటే కాలాన్ని/మృత్యువుని సైతం అంతం చేసినవాడు అని అర్థం. 

🌸కానీ యుముడే లేకపోతే ఈ లోకంలో చావుపుట్టుల జీవనచక్రం ముందుకు సాగేదెలా! అందుకని దేవతలందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముడిని జీవింపచేశాడు.

🌿అయితే మార్కండేయుని జోలికి అతను ఇక రాకూడదనీ, ఆ మాటకు వస్తే శివభక్తులు ఎవ్వరినీ కూడా నరకానికి తీసుకుపోకూడదనీ హెచ్చరించి వదిలివేశాడు పరమేశ్వరుడు.

🌷ఈ ఘట్టం తమిళనాడులోని 
తిరుక్కడయూర్‌
 అనే ప్రాంతంలో జరిగిందని ఓ నమ్మకం.🌷

🌸శివుడు నా భక్తుడి వైపు చూశావంటే ఊరుకోనని యముడికి చెప్పాడు .అప్పుడు మార్కండేయుడు శివుడి కాళ్ళు పట్టుకుని ఇప్పటికి చావునుంచి తప్పించుకున్నాను

🌿అసలు , చావే లేకుండా వుండాలంటే ఏం చెయ్యాలని శివుణ్ణి అడిగాడు మార్కండే యుడు . విష్ణుమూర్తిని ప్రార్థించమన్నాడు శివుడు .

🌸మార్కండేయుడు మళ్ళీ విష్ణుమూర్తి కోసం తపస్సు మొదలు పెట్టాడు . పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు . ఇంద్రుడు తపస్సు భంగం చెయ్యడానికి , ఆయన ఎన్ని చేసినా మార్కండేయుడు చలించలేదు .
🌿విష్ణుమూర్తి మార్కండేయుడికి కనిపించి ఏంకావాలి ? అన్నాడు . స్వామీ ! ఎన్ని యుగాలయినా ఈ శరీరంతోనే చావు అనేది లేకుండా చెయ్యమని విష్ణుమూర్తిని బ్రతిమలాడి వరం తీసుకుని చివరికి సాధించాడు .

🌸మొత్తం లోకాలకే పేరు తెచ్చాడు . ఆహా ! ఆ తల్లిదండ్రులకి శతకోటి నమస్కారాలు చెయ్యొచ్చు . అలాంటి కొడుకుని కన్నందుకు ... !

🌿ఇంకా మార్కండేయుడు శివధ్యానం చేస్తూ తపస్సులోనే ఉండిపోయాడు . వంద సంవత్సరాలు భూమంతా నీటితో నిండిపోతే మార్కండేయుడికి ఏం చెయ్యాలో తెలియక భయపడ్తుంటే ఒక పిల్లవాడు మట్టిచెట్టు ఆకు మీద కన్పించాడు .

🌸మార్కండేయుడు ఆ పిల్లవాడి పొట్టలోకి వెళ్ళి కొంతకాలం ఉండి శ్రీహరిని తల్చుకుని బయటికి వచ్చి చూస్తే ఆ పిల్లాడు కనిపించలేదు .

🌿భూమ్మీద ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయి ఆ ప్రదేశమంతా మామూలుగా అయిపోయింది . మహర్షి మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోయాడు .

🌸ఒకసారి పార్వతీపరమేశ్వరులిద్దరూ ఆకాశంలో తిరుగుతూ మార్కండేయుడి దీక్ష చూసి ఆశ్చర్యపోయి శివుడు నాలుగు చేతులు , విభూతి రుద్రాక్షలు ధరించి , త్రిశూలం ఢమరకం మొదలైనవి పట్టుకుని ఎద్దునెక్కి పార్వతీ సహితంగా కన్పించాడు .

🌿మార్కండేయుడు ఎంతో సంతోషించి శివపార్వతులని స్తోత్రం చేసి స్వామీ ! విష్ణుమాయ తెలుసుకోవడం చాలా కష్టం . విష్ణుమూర్తి యందు భక్తి మృత్యువుని జయించగలిగేలా అనుగ్రహించమన్నాడు .

🌸శివుడు నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందని చెప్పి అంతర్ధానం అయ్యాడు . మార్కండేయుడు విష్ణుమూర్తిని ధ్యానం చేస్తూ భూలోకం అంతా తిరుగుతుండగా ,

🌿ప్రళయం వచ్చింది ఆ నీళ్ళల్లో ఒక పెద్ద శరీరంతో గొప్ప తేజస్సుతో ఒక మనిషి కనిపించి ఏదో అడగబోయేలోగా , అతను పీల్చినగాలికి లోపలికి వెళ్ళి,

🌸మళ్ళీ పూర్వ ప్రపంచాన్ని అంటే ముందు జరిగినవన్నీ చూసి కొంతకాలం వున్నాక బయటికి వచ్చి మళ్ళీ చిన్న పిల్లాణ్ణి చూశాడు మార్కండేయుడు .

🌿మార్కండేయుడికి ఇది అర్థం కాలేదు . విష్ణుమూర్తి కనిపించి మహర్షీ ! భయపడకు ప్రళయం వచ్చినప్పుడు నిన్ను కాపాడాలని నా హృదయంలో దాచాను .

🌸అక్కడ మళ్ళీ నువ్వు భయపడకుండా పూర్వం ఉన్న ప్రపంచాన్నే చూపించాను . ప్రళయకాలంలో వచ్చిన నేను యోగనిద్రలోకి వెళ్ళిపోతాను .

🌿నేను జీవుల్ని పెంచుతాను . శివుడు నడిపిస్తాడు . ఇంక నువ్వు నిశ్చింతగా వుండమన్నాడు మార్కండేయుడు . విష్ణుమూర్తికి స్తోత్రం చేసి మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోయాడు .

🌸బ్రహ్మ మళ్ళీ సృష్టి చెయ్యడం మొదలు పెట్టాడు . పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజు మనస్సుకి బాధ తగ్గించాలని వచ్చాడు .

🌿మార్కండేయుడు అదే సమయానికి శ్రీకృష్ణుడు కూడా వచ్చాడు . ధర్మరాజుకి కలిగిన సందేహాలు తీర్చమని మార్కండేయుడికి చెప్పి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు .

🌸మార్కండేయుణ్ణి పూజించాక ధర్మరాజు మనుషుల కర్మగతుల గురించి చెప్పమన్నాడు . రాజా ! మొదటి కల్పంలో బ్రహ్మ పవిత్రమైన ధర్మంతో కూడుకున్న శరీరాల్ని పుట్టించాడు .

🌿అందులోంచి మంచి ప్రవర్తన కలవాళ్ళు , సత్యసంకల్పం వున్న వాళ్ళు , జ్ఞానవంతులు , ఎక్కువ ఆయుషు ఉన్నవాళ్ళు అయ్యారు .

🌸రానురాను మనుషులు అల్పాయుష్కులు , దరిద్రులు , రోగాలతో బాధపడేవాళ్ళు , మాయమాటలు చెప్పేవాళ్ళు , తయారయి

🌿వాళ్ళు వాళ్ళ పాపపుణ్యాలకి తగినట్లు పుడుతూ , ఛస్తూ వాళ్ళ కర్మఫలం అనుభవిస్తున్నారు . ధర్మ మార్గంలో వుండేవాళ్ళు మంచిపనులు చేస్తూ , పిల్లల్లో పుణ్యం పొందుతున్నారు .

🌸మంచి చేస్తే మంచిని , చెడు చెయ్యడం వల్ల చెడుని అనుభవిస్తున్నారు . ఇదే కర్మగతి అన్నాడు మార్కండేయుడు . మార్కండేయుడు ధర్మరాజుకి బ్రాహ్మణ ప్రభావం గురించి ,

🌿దుంధుమారుడనే రాజు గురించి , అత్రి గౌతముల వాదన గురించి వైవస్వత చరిత్ర , వామదేవుడి చరిత్ర ఇలాంటివన్నీ చెప్పాడు .

🌸ధర్మరాజు ఎన్నో విషయాలు మార్కండేయుణ్ణి అడిగి తెలుసుకున్నాడు .

🌿మార్కండేయుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాక గౌరముఖ మహర్షి అక్కడికి వెళ్ళి పితృదేవతల గురించి మార్కండేయ మహర్షి నడిగి తెలుసుకున్నాడు .

🌸మార్కండేయుడు ధర్మ పక్షుల గురించి చెప్పిన దాన్ని ' మార్కండేయ పురాణమని పిలుస్తారు .

🌿క్రోష్టుకి అనే ముని మార్కండేయుణ్ణి ప్రపంచ విషయాలు చెప్పమన్నాడు . బ్రహ్మ జన్మ గురించి , అన్ని ద్వీపాల గురించి , సూర్యుడి గొప్పతనం గురించి అన్నీ చెప్పాడు మార్కండేయుడు .

🌸కఠోరదీక్షతో విష్ణుమూర్తి కటాక్షంతో మృత్యువిజయం , మహాతపశ్శక్తి సంపాదించి ఇప్పటికీ ఎక్కడో బ్రతికే ఉన్నాడు .

🌿మార్కండేయ మహర్షిని భక్తితో తల్చుకుంటే మనకి కూడ అనుకున్నది జరుగుతుంది రోగాలు కూడా ఉండవు ఐహికం...

🌸ఇదీ మార్కండేయ మహర్షి గురించి మనకు తెలిసిన విశేషాలు రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి

No comments: