Adsense

Sunday, October 2, 2022

శ్రీవారి బ్రహ్మోత్సవాలు6వ రోజు ఉదయం : హనుమద్వాహనం




💠 బ్రహ్మోత్సవాలలో ఆరవ నాటి పగలు వేంకటేశ్వరస్వామి ఒక్కడే హనుమంతుని వాహనంగా చేసికొని ఊరేగుతూ త్రేతాయుగం నాటి శ్రీరాముడను నేనే అని పలుకుతున్నట్లు వేంకటాద్రిరాముడుగా భక్తులకు దర్శన మిస్తాడు.

కృతే తు నారసింహోభూ
త్రేతాయాం రఘునందనః
ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వేంకటనాయకః||


💠 కృతయుగంలోని నరసింహస్వామి, త్రేతాయుగంలోని శ్రీరాముడు, ద్వాపరయుగంలోని శ్రీకృష్ణుడు, కలియుగంలోని వేంకటేశ్వరుడు ఒక్కరే. అందరు విష్ణుదేవుని అవతారపురుషులే. అందుకే.

కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ||


అంటూ ప్రతి రోజు ఆ రాముని పేరుతోనే మేలు కొలుపులు పాడించుకొంటూ సుప్రభాతసేవ చేయించుకొంటున్నాడు వేంకటేశ్వరుడు.

💠 లోకహితం కోసమే నేను త్రేతాయుగంలో శ్రీరామునిగ, కలియుగంలో వేంకటేశునిగా అవతరించాను.
ఆ విషయాన్ని జ్ఞాపకం చేయడం కోసమే  నేడు అనన్య భక్తుడైన హనుమంతుని అధిరోహించి మీకు వేంకటాద్రి రామునిగా కనిపిస్తున్నాను అని బోధిస్తున్నాడు వేంకటేశ్వరుడు.

💠 హనుమంతుడు దాస్యభక్తికి ప్రతీక. ఆదర్శం. భక్తజనులారా! మీరు హనుమంతునివలె నాకు దాసులై, అనన్యభక్తులై అభీష్టసిద్ధిని పొందండి. కృతార్థులుకండి. తరించండి అని ఉపదేశిస్తున్నాడు.

💠 రామరావణ యుద్ధంలో రావణుడు రథంపైనుండి యుద్ధం చేయుచుండగా శ్రీరాముడు హనుమంతుని భుజాన్నెక్కి రావణునితో యుద్ధం చేశాడు.
హనుమంతుడు భగవంతునికంటె భక్తుడే బలవంతుడని నిరూపించాడు. భగవంతునికంటే భగవన్నామమే శరణ్యమని దృఢపరచినాడు.
దేశంలో శ్రీరాముని భక్తులకంటె హనుమంతుని భక్తులే అధికంగా వున్నారు.

💠 కేసరి భార్య అంజనాదేవి వేంకటాద్రిలో ఆకాశ గంగా తీర్థ సమీపంలో తపస్సు చేసి, తపః ఫలితంగా హనుమంతుని ప్రసవించింది. కనుక హనుమంతుని జన్మస్థానం ఆకాశగంగాతీరం.
అక్కడ వున్న పర్వతానికి అంజనాచలమనే పేరు గలిగింది. అంజనాపుత్రుడు అంజనాద్రీశునకు వేంకటేశ్వరునకు వాహనమైనాడు.

💠 తాళ్ళపాక అన్నమాచార్యులు హనుమంతుని వైభవాన్ని యిట్లు కీర్తించాడు.

"ఇతడే యతడు గాబో తేలిక బంటును నైరి మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు
జలధి బంధించి దాటి చలపట్టి రాఘవుడు
అలరి వూరకే దాటే హనుమంతుడు అలుకతో రావణుని యదటణచె నతడు తలచి మైరావణుని దండించె నితడు”

💠శ్రీవైష్ణవ సంప్రదాయంలో గరుడుని 'పెరియతిరువడి' గాను హనుమంతుని ‘సిరియతిరువడి' గాను గౌరవిస్తున్నారు. అందుకు కారణం గరుత్మంతుడు అన్నియుగాలలో సదా విష్ణుదేవుని వాహనం, సేవకుడు. హనుమంతుడు త్రేతాయుగంలో మాత్రమే శ్రీరాముని సేవించి, తరించినాడు.

No comments: