Adsense

Tuesday, October 4, 2022

శ్రీవారి బ్రహ్మోత్సవాలు7వ రోజు రాత్రి : చంద్రప్రభ వాహనం

 


💠 ఏడవనాటి రాత్రి వేంకటేశ్వరుడు చల్లని వాతావరణంలో చంద్రప్రభ వాహనంపై తిరుమల మాడవీథులలో విహరిస్తాడు.

💠 వేంకటాద్రి విష్ణుదేవునికి సూర్యచంద్రులు రెండు నేత్రాలు.
పగలు సూర్యప్రభలో ఊరేగిన వేంకటాద్రి విష్ణుదేవుడు రాత్రి నిశాకరుడైన అమృతకిరణాలు గలిగిన చంద్ర ప్రభ వాహనంపై ఊరేగుతాడు.

💠 శ్రీకృష్ణభగవానుడు “నక్షత్రాణా మహం శశీ” చుక్కలలో చంద్రుడను నేను - అని తెలియజేసినాడు.
“చంద్రమా మనసో జాతః" అని పురుషసూక్తం భగవంతుని మనస్సు నుండి చంద్రుడు జన్మించినాడని వివరిస్తున్నది.

💠 సూర్యుడు దివాకరుడు కాగా చంద్రుడు నిశాకరుడు. సూర్యకాంతితోనే చంద్రుడు ప్రకాశిస్తాడు. కనుక పగలు సూర్యప్రభవాహనం జరిగిన తర్వాత రాత్రిపూట చంద్రప్రభవాహనం జరుగుతున్నది. చంద్రుడు అమృతకిరణాలు గలవాడు.
వేంకటేశ్వరుడు దేవతలకు అమృతం పంచిపెట్టిన మోహిని అలంకారంతో అమృత కలశంతో దర్శనమిస్తూ భక్తులకు అమృత విద్యను బోధిస్తుంటాడు. "యథా ప్రహ్లాదనాత్ చంద్రః” - చంద్రుని వలన సంతోషం గలుగుతుంది.

💠 అట్లాగే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న వేంకటేశ్వరస్వామి దర్శనం భక్తులకు సంతోషాన్ని కల్గిస్తుంది. సూర్యుని తీక్షత్వం, చంద్రుని శీతలత్వం రెండూ తన స్వరూపమేనని వేంకటేశ్వరుడు సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాల ద్వారా వెల్లడిస్తున్నాడు. సూర్యచంద్రులు భగవంతుని నేత్రాలు. మానవునికి సూర్యుని వలన దృష్టి, చంద్రునివలన మనస్సు ఏర్పడుతున్నాయి.

No comments: