Adsense

Wednesday, October 5, 2022

దసరా, విజయ దశమి శుభాకాంక్షలు*

05.10.2022.    బుధవారం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు


ఈ రోజు *విజయ దశమి,దసరా*. ఈరోజు  శ్రీరాముడు రావణాసురుడి మీద విజయం సాధించిన రోజని, మహిషాసురుడు మీద దుర్గా దేవి విజయం సాధించిన రోజని భక్తుల విశ్వాసం. విజయ దశమి రోజున అపరాజితదేవి పూజ, శమీవృక్ష పూజ, సీమోల్లంఘన పూజ ఆచరిస్తారు.

ఈరోజు *అపరాజిత దేవి పూజ*. అపరాజిత దేవిని విజయ దశమి రోజు భక్తులు పూజిస్తారు. ఏదయినా ముఖ్య ప్రయాణాలు చేయడానికి ముందు,ప్రయాణ ఉద్దేశ్యం నెరవేరాలని, ప్రయాణం సుఖవంతంగా జరగాలని కోరుకుంటూ భక్తులు అపరాజిత దేవిని స్మరించు కుంటారు. రామాయణ కాలం లో శ్రీరాముడు రావణాసురుడి మీద యుద్దం ప్రారంభించడానికి ముందు అపరాజితదేవి ని పూజించాడని పురాణ కథనం.

ఈరోజు కొన్ని ప్రాంతాలలో *సీమోల్లంఘన పూజ* ఆచరిస్తారు. మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు జమ్మిచెట్టు మీద తమ ఆయధాలను దాచారు అని, అజ్ఞాతవాసం ముగిసిన అనంతరం విజయ దశమి రోజు   భద్రంగా తమ ఆయుధాలను తిరిగి తీసుకుంటూ జమ్మిచెట్టు నీ, తమ ఆయుధాలను పూజించారు అని ,ఈరోజు భక్తులు శమీ వృక్షాన్ని, తమ ఆయుధాలు,పనిముట్లను, వాహనాలను పూజిస్తారు.

ఈరోజు బెంగాల్,తమిళనాడు, మైసూర్ ప్రాంతాలలో విజయ దశమి, దసరా పండుగ జరుపుకుంటారు. ఈరోజు మైసూరులో *చాముండేశ్వరి అమ్మవారిని* ఏనుగు మీద ఊరేగిస్తారు.మైసూర్ ప్యాలెస్ నుండి అనేక ఏనుగులు, గుఱ్ఱాలతో ప్రారంభమయ్యే ఈ భారీ ఊరేగింపు *బన్నిమండప* అనే పిలవబడే జమ్మిచెట్టు వరకూ కొనసాగుతుంది.

ఈరోజు *దుర్గా దేవి విసర్జనం*. నవరాత్రులు పూర్తి అయిన తరువాత పదవరోజు దశమి తిథి ఉన్నప్పుడే ప్రాతఃకాలంలో కానీ అపరాహ్న కాలం లో కానీ దుర్గాదేవి విసర్జనం చేయాలి. దుర్గాదేవి విసర్జన ముహూర్తం ఈరోజు సూర్యోదయం నుండి ఉ.08.30 వరకూ ఉంటుంది.

ఈరోజు *విద్యారంభం*. సరస్వతీ పూజ చేసిన మరుసటిరోజు నాలుగు అయిదు సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు చేస్తారు.

విజయవాడ శ్రీ కనక దుర్గా దేవి దేవాలయం లో, అమ్మవారిని  *శ్రీ రాజ రాజేశ్వరీ దేవి* అలంకారం లో పూజిస్తారు. తదుపరి ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత కృష్ణా నది లో అమ్మవారికి హంస వాహన తెప్పోత్సవం ఘనం గా జరుగుతుంది.

ఈరోజు *శ్రీ మధ్వాచార్యుల వారి జయంతి*. *శ్రీ మాధవ జయంతి* గా కూడా పిలుస్తారు. ద్వైత సిద్ధాంతకర్త *శ్రీ మధ్వాచార్యుల వారు* (క్రీ.శ.1238 -1317) క్రీ.శ.1238 లో కర్ణాటకలోని ఉడుపి లో జన్మించారు. *తత్వవాదం* గా కూడా పిలవబడే *ద్వైత సిద్ధాంతం*, అద్వైత సిద్ధాంతానికి, విశిష్ట అద్వైత సిద్ధాంతానికి పూర్తి విరుద్ధంగా ప్రతిపాదించబడిన సిద్ధాంతం. మధ్వాచార్యుల వారి శిష్యులు,వారు క్రీ.శ 1317లో బదరీ కి వెళ్ళిన రోజునే వారు అంతర్ధానం అయిన రోజుగా భావించి *మధ్వనవమి* రోజు ఆరాధన చేస్తారు.

ఆశ్వయుజ మాస శుక్లపక్ష దశమి తిథి రోజు ను *సోపపద పుణ్యకాలం* అని పిలుస్తారు. ఈరోజు పితృదేవతలకు తర్పణాలు వదలడానికి ప్రత్యేకమైన రోజు.

కొన్ని ప్రాంతాల్లో ఈరోజు *బుద్ధ జయంతి* జరుపుకుంటారు. విష్ణుమూర్తి దశావతారాలలో ఒకటి అయిన బుద్ధ అవతారం ఈరోజు అవతరించింది అని నమ్మకం. వైష్ణవులు ఈరోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు.

శ్రవణా నక్షత్రం ఈ రోజు రాత్రి 09.15 వరకూ ఉండటం వలన, ఈరోజు *మాస శ్రవణా వ్రతం*. తిరుమల శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణం అని భక్తుల విశ్వాసం. వైష్ణవులు ఈరోజు ఉపవాసం ఉండి, విష్ణుమూర్తి ఆరాధన చేస్తారు.

దుర్గా దేవి స్మరణం తో....సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..నమస్కారం.....

No comments: