THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Saturday, October 1, 2022
శ్రీ దేవి శరన్నవరాత్రలు సందర్బంగా....!!దేవీ కన్యా కుమారీ దేవాలయం
🌸మనదేశంలో ప్రసిద్ధి గాంచిన శక్తిపీఠాలలో కన్యాకుమారీ క్షేత్రం ఒకటి.
🌿అరేబియా, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాల త్రిసంగమంగా అలరారుతున్న ఈ దివ్య క్షేత్రంలో సాక్షాత్తు కన్యాకుమారీ అమ్మవారు కొలువైంది.
🌸భక్తుల చేత నిత్యనీరాజనాలు అందుకొంటూ, కన్యాకుమారీ మాత నామస్మరణతో పునీతమౌతున్న పుణ్యధామం కన్యాకుమారీ.
🌿ఈమెకి శ్రీ బాలభద్ర, కన్యాశ్రమం కన్యాకుమారీ, బాలంబిక, కన్యా దేవీ, అని కూడా పేర్లున్నాయి.
🌸దేశంలో ఉన్న సుందర క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ దివ్య క్షేత్రం, కన్యాకుమారీ అగ్రంగా కూడా పేరుగాంచింది. సాక్షాత్తు ఆదిపరాశక్తి, అపర అంశ అయిన కన్యాకుమారీమాత కొలువైన ఈ దివ్యధామం లోని అడుగడుగూ ఆధ్యాత్మికతకు నెలవుగా, సుందర మనోహర దృశ్యాలకు కొలువుగా అలరారుతూ ఖ్యాతికెక్కింది.
🌿బంగాళాఖాతం, హిందూ, అరేబియా సముద్రాలు కలిసేచోటున అలరారుతోన్న ఈ దివ్యధామం అష్టాదశ శక్తిపీఠలలో ఒకటిగా పిలవబడుతోంది. సతీదేవికి చెందిన వీపు భాగం ఇక్కడ ఈ ప్రదేశంలో పడడం వలన ఈ క్షేత్రం శక్తిపీఠంగా మార్పు చెందిందని భక్తులు చెబుతారు.
🌸ఈ దివ్య క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా అమ్మవారి ఆలయానికి సమీపంలో ఉన్న స్నానఘట్టానికి చేరుకుంటారు. నిత్యం భక్తులతో రద్ధీగా వుండే ఈ స్నానఘట్టం కన్యాకుమారీ నామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది.
🌿ప్రధానాలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే, కుడివైపున చిత్రశాల దర్శనమిస్తుంది. ఈ చిత్రశాలలో అమ్మవారికి చెందిన వివిధ అవతరమూర్తులు మనోహరంగా దర్శనమిస్తాయి.
🌸అలానే పక్కన బాలాసుందరి అమ్మవారి మందిరం దర్శనమిస్తుంది. ఈ అమ్మవారి ఆశీస్సులు సదా జయం కలుగజేస్తాయని భక్తుల విశ్వాసం.
🌿ప్రధానాలయ ప్రాంగణంలో కుడివైపు భాగంలో పురాతన కాలంనాటి ఓ బావి కనిపిస్తుంది. ఈ బావిలోని శుద్ధ జలాలను అభిషేక తీర్థంగా వినియోగిస్తారు.
🌸ఈ అభిషేక జలాన్ని తీయడానికి ఓ నియమం ఉంది. అమ్మవారిని సేవించే ప్రధాన అర్చకుడు ఒక్కడే శుచీశుభ్రతలను పాటిస్తూ పాతాళం నుంచి ఈ బావిలోకి ప్రవేశించి తీర్థపు బిందెలతో అభిషేక జలాన్ని తీసుకువచ్చే సంప్రదాయం ఈ ఆలయంలో ఉంది. ఆ కారణంగా ఈ తీర్థాన్ని పాతళగంగ తీర్థంగా పిలుస్తారు.
🌿ఇదే దేవాలయ ప్రాంగణంలో భక్తులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన ఆదిశంకరులు మందిరానికి చేరుకుని, ఆదిశంకరాచార్యులవారిని మనసావాచా కొలుస్తారు.
🌸కన్యాకుమారీ అమ్మవారిని పరాశక్తికి చెందిన అంశగా చెబుతారు. అమ్మవారిని శర్వాణీగా,పరమేశ్వరుని నిమీశుడుగా పిలుస్తారు.
🌿సుచింద్రంలో ఉన్న పరమశివుడు, కన్యాకుమారీలో ఉన్న కన్యకామాత ప్రేమించుకున్నారట, అయితే కొన్ని కారణాల వలన పరమశివుడు కన్యకామాతను వివాహం చేసుకోలేదట, దీనికి మనస్తాపం చెందిన కన్యకామాత పెళ్లి చేసుకోకుండా కుమారీగానే మిగిలిపోవడంతో ఆనాటి నుంచీ కన్యకా అమ్మవారు కన్యాకుమారీగా పేరొందింది.
🌸ఆమె వెలసిన క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రం కన్యాకుమారీగా ప్రసిద్ధికెక్కిందని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతుంది.
🌿ఈ క్షేత్రంలో అమ్మవారు కొలువై ఉండడానికి మరో పురాణగాథ ప్రచారంలో ఉంది.
🌸పూర్వం బాణాసురుడు అనే రాక్షసుడు, దేవతలను మునులను విపరీతంగా హింసిస్తూ ఉండేవాడు. వాని ఆకృత్యాలను భరించలేని దేవతలు శ్రీ మహావిష్ణువుని శరణుకోరగా, అతను కన్య వలనే మృత్యువు వచ్చేలా బ్రహ్మ నుండి వరం పొందడం వలన, పరాశక్తి మాతే వానిని అంతమొందించగలదని ఆమెను వేడుకొమ్మని సలహా ఇచ్చాడట.
🌿అంతట దేవతలు, మునులూ పరాశక్తి సాక్షాత్కారం కోసం యజ్ఞయాగాదులు చేయగా పరాశక్తి ప్రత్యేక్షమై బాణాసురుని అంతమొందిస్తానని వాగ్ధానం చేసింది. ఈ కారణంగా మాత, ఓ అవివాహిత యువతిగా ఉద్భవించింది, సరిగ్గా అదే సమయాన మహాశివుడు దేవీ కన్యాకుమారీ మాత పై ప్రేమలోపడి వివాహం చేసుకోడానికి నిశ్చయించుకున్నాడు.
🌸శివుడు దేవిని వివాహం చేసుకుంటే వ్రత భంగమౌతుందని భావించిన నారదుడు, బ్రహ్మ మూహూర్త కాలంలో వివాహం చేసుకోడానికి పరమశివుడు, కన్యాకుమారీకి వస్తుండగా, నారదుడు కోడిపుంజు రూపంలోకి మారి అరవడంతో ముహూర్త కాలం దాటిపోయిందని, శివుడు తిరిగి సుచింద్రం వెళ్ళిపోయాడు.
🌿శివుని కోసం చూస్తూ అక్కడే మాత కన్యగా మిగిలిపోయింది, అదే సమయంలో బాణాసురుడు కన్యకామాత అందానికి పరవసితుడై, ఆమెను బలవంతంగా వివాహము చేసుకోడానికి ప్రయత్నించగా, మాత ఆగ్రహించి, బాణాసురుని తన చక్రాయుధంతో వధించింది.
🌸ఆనాటి నుంచీ పరాశక్తి మాత, కన్యాకుమారీగా వర్ధిల్లుతూ భక్తులను రక్షిస్తుందని భక్తుల నమ్మకం.
అమ్మవారు తూర్పు భాగానికి అభిముఖంగా ఉన్నప్పటికీ, పర్వదినాలలో తప్ప మిగిలిన రోజుల్లో ఆ తూర్పు ద్వారం మూసే ఉంచుతారు.
🌿అందువల్ల అమ్మవారి గర్భాలయంలోకి చేరుకోడానికి ఉత్తరద్వారం ద్వారానే ఆలయ ప్రవేశం చేయాల్సి వుంటుంది.
ఇక్కడ అమ్మవారి వజ్రపు ముక్కుపుడకను పరశురాముడు ఏర్పాటు చేసినట్లు చెబుతారు...స్వస్తి..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment