Adsense

Thursday, October 6, 2022

నేడు ఆశ్వయుజ శుద్ధ "పాశాంకుశ" ఏకాదశి

 


🌸బ్రహ్మవైవర్తపురాణములోని శ్రీకృష్ణ - యుధిష్ఠిర సంవాదము-

🌿ఒకనాడు ధర్మరాజు ఆశ్వయుజ శుద్ధ ఏకాదశికి మరియొక పేరు ఏమికలదో! దాని ఫలితమెట్టిదో ? దయతోనాకు చెప్పుమని శ్రీ కృష్ణుని ప్రార్ధించెను. శ్రీ కృష్ణుడు మిక్కిలి సంతోషముతో చెప్పసాగెను.

🌸ఓ ధర్మరాజా ! ఈ ఏకాదశిని "పాశాంకుశ" లేక ' పాపాంకుశ' ఏకాదశి యని పిలిచెదరు. దీనిని పాటించిన సర్వశుభములు కలిగి సమస్త పాపములు నశించును. ఈ తిథి యందు యథాప్రకారముగా భగవానుడు శ్రీపద్మనాభుని అర్చించవలెను.

🌿ఈ వ్రతాచరణవల్ల ధర్మార్థకామమోక్షములు సంప్రాప్తమగును. భూమండలములో నున్న సకల తీర్థములలో స్నాన ఫలమును ఒసంగును.

🌸సంసారమునయున్న మానవులు ఏ కారణము వలననైనను మోహవశులై ఎట్టి దుష్కర్మములు చేసివారైనను నరకయాతన అనుభవించుచున్ననూ ఈ వ్రతాచరణవలన ఆ కష్టముల నుండి విముక్తి పొందుదురు.

🌿ఎవరు భగవంతుని తఱుచు (నిందించుచు) భగవద్భక్తులను అవమానించుదురో వారికి తప్పక నరకము ప్రాప్తించును. అట్టివారు ఎన్ని వ్రతములు ఆచరించినను సత్ఫలితమును పొందజాలరు.

🌸మనుష్య జన్మమును పొంది ఈ ఆశ్వయుజ శుద్ధ ఏకాదశిని పాటించని వారు ఎందులకూ పనికిరానివారై జీవితము వ్యర్ధమగును. అట్టి వారు యజ్ఞయాగములు చేసినను నిష్ఫలమేయగును. కనుక ఈ ఏకాదశిని మించిన వ్రతము లేదని శాస్త్రములు మఱల మఱల ఘోషించుచున్నవి.

🌿ఈ తిథియందు ఉపవాసముండి, కృష్ణసేవ, కృష్ణనామము చేయుట, కృష్ణకథాశ్రవణము చేయుట అత్యావశ్యకములు. రాత్రియందు జాగరణ చేయవలెను. ఈ వ్రతమును ఆచరించిన వారి వంశములలో మూలమున పితృ మాతృ పది తరములవారు ఉద్ధరింపబడుదురు.

🌸బాలకులు, యువకులు, వృద్ధులు, ఎవ్వరైనను యీవ్రతమును పాటించవచ్చు. దురాచార సంపన్నులైన మానవులు యీ ఏకాదశీ ఉపవాసము చేసి ఊర్ధ్వ లోకముల పొందుటకు అవకాశము గలదు.

🌿తిల సువర్ణ - భూ- జల - ఛత్ర(గొడుగు) మఱియు పాడుకలు దానము చేసినచో వారికి యమలోక నరకబాధలు కలగవు. సత్యర్మములు చేయనివాని జీవితం నిష్ఫలము.

🌸అంతేకాక ఓ ధర్మరాజా ! ఈ వ్రతమాచరించిన వారు దీర్ఘాయుస్సు కలిగి యుండి ధనధాన్యములతో సుఖముగా నుందురు. మఱియు సర్వదోషముల నుండి విముక్తి పొంది భగవత్ లోకమునకు వెళ్ళెదరు అని చెప్పెను....స్వస్తి.

No comments: