నిజామాబాద్ జిల్లా : జానకంపేట.. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం
💠 నరసింహుడి పేరు తలచినంతనే ఉగ్రరూపం కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. స్తంభంలో నుంచి ఉద్భవించి, రాక్షసుడైన హిరణ్యకశ్యపుడిని చీల్చి చెండాడిన వైనం గుర్తుకు వస్తుంది.
ఆ ఉగ్రనరసింహుడు శాంతించిన ప్రాంతం, భక్తవరదుడిగా పూజలందుకుంటున్న క్షేత్రం జానకంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయం. అష్టదిక్పాలకులతో ఏర్పడిన అష్టభుజి కోనేరు ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ
💠 ఇక్కడి నరసింహస్వామిని దర్శించినంతనే గ్రహ దోషాలు పోతాయని ప్రతీతి.
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా, కాకతీయుల ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి పొందాడు నిజామాబాద్ జిల్లాలోని జానకంపేట లక్ష్మీనరసింహ స్వామి.
💠 నాభిలో సాలగ్రామాన్ని ధరించిన ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి రూపం శివకేశవుల మధ్య అభేదాన్ని తెలుపుతుంది. రుద్రుడే క్షేత్రపాలకుడిగా ఉన్న ఈ ఆలయంలోని నరసింహస్వామిని దర్శించినంతనే గ్రహ దోషాలు పోతాయని ప్రతీతి.
🔅 స్థలపురాణం 🔅
💠 దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహా విష్ణువు ఎత్తిన అవతారాలలో నరసింహస్వామి అవతారం ఒకటి.
తండ్రి పెడుతున్న హింసల నుండి ప్రహ్లాదుడిని రక్షించడానికి అవతరించిన నరసింహస్వామి, తన ఉగ్రరూపంలోనే సంచరిస్తూ జానకంపేట దండకారణ్యానికి చేరుకుంటాడు.
వాతావరణం ఆహ్లాదంగా ఉండటంతో అక్కడే సేదతీరుతాడు.
💠 ఆ రూపాన్ని చూసి అక్కడ తపస్సు చేస్తున్న మునులు భయపడతారు. వారు బ్రహ్మదేవుడిని ప్రార్థించి సాధారణ రూపానికి తీసుకురమ్మని కోరుతారు. బ్రహ్మ సూచన మేరకు గండకీ నదితీరంలోని సాలగ్రామాన్ని తెచ్చి స్వామి నాభి దగ్గర ఉంచగా శాంతించి అక్కడే లక్ష్మీనరసింహ స్వామిగా వెలశాడని స్థల పురాణం. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉమామహేశ్వరుడు ఉండటం విశేషం. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటే శనిదోషాలు పోతాయని ప్రతీతి.
💠 శనివారంతో కూడిన అష్టమీ, అమావాస్య తిథుల్లో వేల సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుంటారు. కలియుగం ప్రారంభంలో మునులు ఈ దండకారణ్యంలో తపస్సు చేస్తున్నప్పుడు రాక్షసులు ఆటంకాలు కలిగించే వారు. వారి భారి నుండి బయటపడటానికి మునులు లక్ష్మీ నరసింహ స్వామిని వేడుకోగా. స్వామి ఆజ్ఞ మేరకు అష్ట దిక్పాలకులు ఎనిమిది దిక్కులకూ కాపలా ఏర్పడ్డారు.
ఋఘుల తపస్సుకు భంగం కలగకుండా మధ్యలో నీటి కొలను ఏర్పాటు చేసారు.
💠 అలా ఏర్పడిన కొలను కాలక్రమంలో
అష్టముఖి కోనేరుగా ప్రసిద్ధి చెందింది.
శనిదోషాలు ఉన్నవారు శనిత్రయోదశి లాంటి విశేషమైన రోజుల్లో ఈ కోనేటిలో స్నానం చేసి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటే గ్రహదోషాల నుంచి విముక్తి పొందుతారని చెబుతారు.
ఈ పుష్కరిణి చుట్టూ ఎనిమిదిసార్లు, గర్భాలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తే గ్రహదోషాలు తొలగి, కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.
💠 ఆ తర్వాతి కాలంలో ఒక జైనమత ప్రవక్త ఈ క్షేత్రాన్ని సందర్శించి, స్వామి విశిష్టతలు తెలుసుకుని స్వామికి ఆలయాన్ని నిర్మించాడు.
జైనులు నిర్మించిన గురుకులాన్ని
కాలక్రమేణా కాకతీయులు ఈ ఆలయాన్ని అభివృద్ధిచేశారు. జైనులు నిర్మించిన గురుకులాన్ని శివాలయంగా మార్చి శివకేశవుల అభేదాన్ని మరోసారి చాటిచెప్పారు. దీనికి గుర్తుగానే లక్ష్మీనరసింహుడి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉమామహేశ్వరుడు ఉండటం విశేషం.
🔅 జాన్కంపేట పేరు వెనుక...
పూర్వం ఈ గ్రామాన్ని కిష్టాపురంగా పిలిచేవారు. నైజాం ప్రభువులు శీలం జానకీబాయికి ఇనాముగా కొన్ని గ్రామాలను చూసుకోవడానికి వచ్చింది. ఆమె ఇందూరు పట్టణానికి చేరుకుని ఈ ఆలయాన్ని దర్శించి బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుపమని కొంత సైన్యాన్ని అక్కడే ఉంచినట్లు చెప్తారు. ఇందుకోసం ఒక చిన్న పేటను అన్ని వసతులతో నిర్మించినట్లు తెలుస్తోంది. అలా ఆనాటి ఆలయ పట్టణమే అప్పటి నుండి జానకమ్మ పేటగా వాడకంలోకి వచ్చి, కాలక్రమేణా జాన్కంపేటగా మారింది.
💠 ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ అష్టమి మొదలుకొని ఆ నెల బహుళ ప్రతిపద వరకు ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
పౌర్ణమి రోజున స్వామి వారు సతీ సమేతుడై విహరించడానికి రథంపై బయలుదేరే అపురూప దశ్యం భక్తులను పరవశింపజేస్తుంది.
ఈ పవిత్ర జలాలలో స్వామివారు స్నానమాచరించిన తర్వాతే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
💠 ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించడానికి తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచీ అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు.
💠ఎలా వెళ్ళాలి:
నిజామాబాద్ నుండి బోధన్, బాసరలకు వెళ్లే మార్గంలో ఈ క్షేత్రం ఉంది. నిజామాబాద్ నుండి బస్సు మార్గంలో 15 కి.మీ దూరమైతే, రైలు మార్గంలో జాన్కంపేట స్టేషన్ నుండి ఈ ఆలయం 5 కి.మీ దూరంలో ఉంటుంది.
No comments:
Post a Comment