Adsense

Wednesday, March 29, 2023

శ్రీ శ్వేతార్కమూల గణపతి ఆలయం, వరంగల్ జిల్లా : కాజీపేట.

 💠 తెల్ల జిల్లేడు వేరులో వినాయకుడు ,
మర్రిచెట్టులొ శివుడు వుంటాడని , రావిచెట్టులొ శ్రీ మహావిష్ణువు వుంటాడని,పారిజాత చెట్టు మూలంలొ హనుమంతుడి రూపం వుంటుందటా చెపుతున్నాయి మన పురాణాలు.

💠 అలాగే తెల్ల జిల్లేడు వేరులో వినాయకుడు వుంటాడటా ఆ స్వామినే శ్వేతార్క గణపతి అని పిలుస్తారు ...శ్వేతార్కంలో 'శ్వేతం' అంటే తెలుపు వర్ణం, 'అర్క' అంటే జిల్లేడు.
శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు గణపతి.

💠 శ్వేతార్క మూలంలో వినాయకుడు నివశిస్తాడని ప్రతీతి. దీన్ని మనం పొందగలిగి, గృహంలో ప్రతిష్టించుకో గలిగితే శుభప్రదం.

💠 మహా గణపతి మనకు వివిధ రూపాలలో కనిపిస్తాడు . కానీ మనము చాల అరుదుగా చూసే రూపం శ్వేతార్కమూల గణపతి రూపం .

💠 వరంగల్ జిల్లాలో కాజీపేట పట్టణమునందు స్థిరనివాసంతో వేలాదిమంది భక్తులకు దర్శనమిస్తూ గత ఎనిమిదేళ్లుగా కోరిన కోర్కెలను ప్రసాదిస్తూ, కేవలం గరికలతో ప్రదక్షిణాలు చేస్తూ సంకల్పసిద్ధిని పొందుతున్న అనేకమంది భక్తులకు పూర్తి విశ్వాసంగా అభయమిస్తూ సకల కార్యసిద్ధికరుడుగా వెలుగొందుతున్న ఈ శ్వేతార్కమూల గణపతిస్వామి వారు సర్వావయవ సంపూర్ణుడిగా ఎలాంటి చెక్కడముల మల్చడములు లేకుండా స్పష్టంగా నేత్రములు, నుదురు, దంతములు, జ్ఞానదంతము, కాళ్లు, పాదములు, చేతులు, తల్పము, సింహాసనము, మూషికము (ఎలుక) మోదకములతో ఆకృతినిపొంది దర్శనమిచ్చాడు.

💠 శ్రీ స్వామివారిని సరిగ్గా తూర్పుముఖంగా కూర్చుండ చేస్తే స్వామి వారి చూపు ఈశాన్యం వైపునకు కైలాస స్థానాన్ని చూస్తున్నట్టుగా సమస్త వాస్తుదోష నివారకుడిగా ఉండటం ఈ స్వామిలోని విశిష్టత.
కాగా ఈ స్వామివారి రూపంలో మూషికాసుర యుద్ధసమయంలో తన కుడి దంతాన్ని బయటకులాగి సగం విరిచి (శుత్రువుపై) వేసినట్టుగా, శుత్రువు తన పాదాల చెంత చేరినట్టుగా, యుద్ధానంతరం శ్రీ గణేషుడు సుఖాసీనత పొందినట్టుగా పురాణ చరిత్రను కలిగి ఉండటం ఇక్కడ మరో విశేషం.

💠 అసలు శ్వేతార్కమూల గణపతి అనే పేరు, మనకు తరచుగా తెలియని స్థితిలోనిది. గణేశుడికి అనేక రూపాలు ఉన్నాయి.
ఏ దేవునికి కనిపించని రూపాలు మనకు గణపతిలో కనిపిస్తుంటాయి.
గణపతి రూపాలు 64 అని, అందులో ముఖ్యంగా 32 ఉన్నాయని అందులో షోడస రూపాల గణపతులకు అత్యంత ప్రాధాన్యం ఉన్నదని పురాణాల్లో చెప్పబడి ఉంది.
పైన చెప్పబడిన రూపాలలో శ్వేతార్క గణపతిని గూర్చి స్పష్టంగా ఎక్కడా చేర్చబడినట్టుగా చెప్పబడలేదు.

💠 తెల్ల జిల్లేడు చెట్టు యొక్క గొప్పతనం ఏమిటంటే గణపతి ఉపనిషత్ చెప్పినట్టు " త్వం మూలధారేస్థితోసినిత్యం"  అన్నట్టుగా సహజసిద్ధంగా ఉండే చెట్టు, గణపతి ఆకృతి అన్ని అవయవములతో తయారు కావడం విశేషంగా భావించబడుతుంది.
హనుమంతు విషయంలో కూడా పారిజాత తరుమూల వాసితం అని ఉంది.
అంటే స్వామి వారి ఆకృతి పారిజాత (పూలు) చెట్టు మూలంలో లభ్యమవుతుంద తెలుస్తుంది. ఏది ఏమైనా సాధనాత్ సాధయతే అన్నట్టు ఏకాగ్రతతో సూక్ష్మ పరిశీలనతో భగవన . విశ్వాసం కలిగి చేసేపని ఎప్పుడు వృధాకాదని పెద్దలంటున్నారు.

💠 స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి స్వామివారి ఆలయ ప్రాంగణంలో  శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ  జ్ఞానముద్రా సరస్వతీ అమ్మవారు. (ఇక్కడి అమ్మవారికి చేతిలో వీణలేకుండా జ్ఞానముద్రను కలిగి ఉంటుంది ),
శ్రీ సంతోషిమాత, శ్రీ సంతాన నాగలింగేశ్వర స్వామి,శ్రీ షిర్డీ సాయిబాబా, శ్రీ వేంకటేశ్వర దేవాలయాలు మరియు కొన్ని నిర్మాణములో ఉన్నవి.
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నవగ్రహములు, అయ్యప్పస్వామి, ఆంజనేయస్వామి, సత్యనారాయణ స్వామి దేవాలయాలు కూడా కలవు.

💠 ఇక్కడ వెలసిన స్వామిని కార్యసిద్ధి  వినాయకుడు అని కూడా పిలుస్తారు. 

💠 శ్వేతార్క మూలాన్ని సాక్షాత్తూ గణపతిగా భావించి పూజలు చేస్తారో వారికి జ్ఞానసంపద, సురక్ష, సుఖశాంతులు లభిస్తాయి.

💠 సూర్యగ్రహ దోషాలు ఉన్నవారు, జాతక చక్రంలో సూర్యుడు నీచ స్థానంలో ఉన్నవారు, ఇంటికి నరదృష్టి ఉన్నవారు, వీధిపోటు ఉన్నవారు, సర్వకార్య సిద్ధి కొరకు శ్వేతార్క గణపతిని గృహంలో ఉంచుకుని పూజిస్తే చాలా మంచిది కానీ ప్రతిష్టించుకునేందుకు సరైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి.

💠 పురోహితుల్ని సంప్రదించి వారి సలహా మేరకు ముహూర్తం పెట్టించుకోవాలి.

💠 ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళలో పడితే చూపు పోతుందని భయపడతారు. కానీ గమ్మత్తేమిటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారుచేస్తున్నారు.

💠 యోగ ముద్రలొ వున్న ఆంజనేయుడు ఈ ఆలయానికి ద్వారపాలకుడు.

💠 వినాయకుడు సరస్వతి లక్ష్మీ ఈ ముగ్గురూ ఉండే ఆలయాలు చాలా అరుదు అందులొ శ్వేతార్క గణపతి ఆలయం ఒకటి.

💠 ఈ ఆలయంలొ భక్తులు తెచ్చిన ప్రసాదాలు స్వామికి నైవేధ్యంగా సమర్పించరు.
నూతన సంవత్సరంలొ వచ్చే మొదటి శుక్రవారం నాడు మాత్రమే భక్తులు స్వయంగా చేసి తెచ్చే చిత్రాన్నాన్ని స్వామికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సంవత్సరం అంతా అన్నపూర్ణదేవి అనుగ్రహం వుండాలని ఇలా చేస్తారటా.

💠 హైదరాబాద్ నుండి  135 కి మీ దూరం.

No comments: