Adsense

Thursday, March 30, 2023

శ్రీ ధారగంగమ్మ ఈశ్వరాలయము, విజయనగరం జిల్లా : పుణ్యగిరి

💠 పచ్చటి ప్రకృతి కొండలపై పుణ్యగిరి పరమ పవిత్రమైన క్షేత్రం. పచ్చటి ప్రకృతి మధ్య కొండలపై పరమేశ్వరుడు ఉమా కోటిలింగేశ్వర స్వామిగా వెలసి భక్తుల నీరాజనాలందుకుంటున్న అద్భుత పుణ్యక్షేత్రం.

💠 ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ క్షేత్ర పరిసరాలన్నీ వనభోజనాలకు వచ్చే వారితోనూ, పర్యాటకుల శివనామస్మరణతో మారు మోగిపోతాయి. పరమేశ్వరుని దర్శనంతో జన్మ పునీతం చేసుకోవాలన్న తలంపుతో వచ్చే భక్త జనులతో పుణ్య గిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతం కిక్కిరిసిపోతుంది.

💠 ఈ ఆలయం పర్వత పంక్తి నుండి వచ్చే జలధారపై నిర్మింపబడినది కనుక ధారగంగమ్మ ఈశ్వరాలయముగా పేరుగాంచినది.
ఇది తొలుత ధారగంగమ్మ ఆలయం, ఆ తరువాత ఇచట ఈశ్వరుడు గూడ ప్రతిష్టింపబడ్డాడు.
అందుచే ఈ ఆలయాలు ధారగంగమ్మ, ఈశ్వరాలయముగా ప్రసిద్ధమైనది.

💠ఇక్కడ కోటిలింగాలు, గొడుగుల దార అనే ఎండు స్నానఘట్టాలున్నాయి. అతి పురాతనమైన శివాలయంలోని లింగం క్రింద భూమిలో నీరు ఊరుతూ ఉంటుందని లింగం ఎల్లప్పుడు అభిషిక్తమైనట్లు కనపడుతూ ఉంటుంది. త్రిమూర్తి గుహల వద్ద మూడు లింగములు ప్రతిష్ఠింపబడినాయి. అవి నీటిలో మునిగి ఉంటాయి.

💠 ఉత్తరాంధ్రలో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఉమాకోటిలింగేశ్వరస్వామి ఆలయం ఒకటి.
ఇక్కడ ఋషులు తపస్సు చేసి పరమేశ్వరుని సాక్షాత్కారం పొందారు. అనంతరం ఇక్కడ శివుడు లింగరూపంలో ఆవిర్భవించాడని పూర్వీకుల కథనం.

🔅 స్థలపురాణం 🔅

💠 ఈ దేవాలయానికి మహాభారత కాలానికి సంబంధం ఉందని తెలుస్తుంది. అలనాటి పాండవుల ఆవాసమే ఈ పుణ్యగిరి క్షేత్రం. మహాభారత కాలంలో పాండవులు జూదమాడి కౌరవుల చేతిలో ఓడిపోయి 13 ఏళ్ళు అరణ్యవాసం, ఒక ఏడు అజ్ఞాతవాసం చేశారు. పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసం ఈ ప్రాంతంలోనే చేశారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

💠 ఇక్కడ విరాట్‌రాజు కొలువు ఉండేదని, ఆ కొలువులోనే పాండవులు అజ్ఞాతవాసం గడిపారని పౌరాణిక గాథల వల్ల తెలుస్తుంది.
ఆ సమయంలో పాండవులు ప్రతి రోజూ ఇక్కడ జలధారలలో స్నానమాచరించి, పరమేశ్వరుని ఆరాధించేవారని భక్తుల విశ్వాసం.

💠 ఇక్కడ తలస్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.
మహా శివరాత్రి రోజున జలధారల కింద స్నానాలు చేసి పరమేశ్వరుని దర్శించుకొని జాగరణ చేసినట్టయితే సర్వపాపాలు తొలగిపోవడమేగాకుండా కైలాస ప్రాప్తి లభిస్తుందన్నది భక్తుల నమ్మకం.

💠 ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు మూడు రోజుల పాటు ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువగా పాల్గొంటారు. ఎక్కువగా శివరాత్రి రోజు, ఆ మరుసటి రోజు భక్తులు శ్రీ ఉమాకోటి లింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు.
దాదాపుగా ఈ మూడు రోజుల్లో లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా.

💠 ఈ పుణ్యగిరి క్షేత్రంలో వెలసిన కోటిలింగాలు, త్రినాథ గుహ, ధారగంగమ్మ జలపాతం అతి ముఖ్యమైన దర్శనీయ స్థలాలుగా పేరుపొందాయి.
ఇవి కాకుండా పుణ్యగిరిలో ప్రముఖంగా దర్శించాల్సిన పుణ్యస్థలం ధార గంగమ్మలోవ, పుణ్యగిరికి కొండపై గల శ్రీ ఉమా కోటిలింగేశ్వర దేవాలయానికి 5 కిమీ దూరంలో విరాటరాజు నిర్మించినట్టు చెప్తున్న మట్టి కోటను ఇప్పుడు కూడా మనం చూడవచ్చు.
ఆ కొండ మీద నుంచి ధారగా వచ్చే జలాన్ని దేవతగా పూజించేవారట.
ఆ జలధారే నేడు ధారగంగమ్మగా భక్తుల పూజలందుకుంటోంది.
భక్తుల కోర్కెలు నెరవేర్చే తల్లిగా శృంగవరపుకోట గ్రామ దేవతగా ఈ ప్రాంత ప్రజల నీరాజనాలందుకుంటోంది.

💠 1945లో శృంగవరపుకోట పట్టణంలో ఒక చిన్న మందిరంగా ఏర్పడిన ఈ ఆలయం నేడు సకల సౌకర్యాలతో అలరారుతోంది.
ఈ అమ్మవారికి సంవత్సరం విడిచి సంవత్సరం ఘనంగా పండగను నిర్వహిస్తారు.

💠 తన కాముకత్వంతో మారువేషంలో ఉన్న ద్రౌపదిని కోరుకున్న కారణంగా భీముని చేతిలో మరణిస్తాడు విరాటరాజు బావమరిది అయిన కీచకుడు.  సోదరుడి మరణంతో అపరిమితంగా శోకిస్తుంది విరాటరాజు భార్య, కీచకుని సోదరి అయిన సుధేష్ణాదేవి.
ఆమె శోకం తీర్చడానికి ఆమె ఇష్టదైవమయిన పరమేశ్వరుడు తన జటాఝూటం విసిరి ధారగా జలాన్ని పుట్టించాడని, అదే కాలక్రమంలో పుట్టుధారగా ప్రాచుర్యం లోకొచ్చిందని భక్తుల నమ్మకం.

💠 ఇక్కడ మరొక విశిష్టత అస్థిక మంటపం. సహజసిద్ధంగా వెలిచి కోటి లింగాలుగా పిలవబడుతున్న ఇక్కడ శివలింగాలు ఊర్ధ్వ దిశలో ఉంటాయి. పై నుంచి నీరు నిరంతరం పడుతూ ఉంటుంది. ఆ నీటిలోనే చనిపోయిన వారి అస్తికలను నిమజ్జనం చేసి పితృకార్యాలు చేస్తుంటారు. అందుకనే దీనికి అస్థిక మంటపంగా పేరు స్థిరపడింది.

💠 శృంగవరపుకోట పేరు ఎలా వచ్చిందంటే
ఈ చుట్టు పక్కల ప్రాంతాల పేర్లుకూడా మహాభారత కథనాలకు సంబంధించి పుట్టినవేనని చెప్తారు.
ప్రస్తుతం మనం శృంగవరపుకోట అని పిలుచుకుంటున్న ప్రాంతంలోనే కీచకుడి కోట ఉండేదని దానిని అతడు తన శృంగార కార్యకలాపాలకు వినియోగించుకునేవాడని, కాలక్రమేణా ఈ ప్రాంతం శృంగారకోటగా ఆ తరువాత శృంగవరపుకోటగా పిలువబడుతుందని పురాతన చరిత్ర చెబుతోంది.

💠పుణ్యగిరి ఆలయం.. విజయనగరానికి 35 కిమీ, శృంగవరపు కోటకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.

No comments: