Adsense

Thursday, March 30, 2023

దశరథుని పూర్వజన్మ వృత్తాంతము

దశరథుని పూర్వజన్మ వృత్తాంతము 
శతరూపామనువుల తపస్సు:

🌾సృష్టి ప్రారంభ కాలమున బ్రహ్మదేవుడు మొట్టమొదట స్వయంభువు మనువును, శతరూపను సృష్టించెను.

🌾అనంతరము ఈ పుణ్యదంపతుల వలననే సృష్టి విస్తరించెను. వారి సదాచారములను, శీలములను, పవిత్ర ధర్మాచరణములను గూర్చిన వర్ణనలు వేదములలో గలవు.

🌾మానవులందఱును ఈ శతరూపామనువుల సంతానమే.

🌾వారి పెద్దకుమారుని పేరు ఉత్తానపాదుడు. భాగవతోత్తముడైన ధ్రువుడు ఆ ఉత్తానపాదుని కుమారుడే.

🌾మనువు యొక్క రెండవ కుమారుడు ప్రియవ్రతుడు, కూతురు దేవహూతి. ఈమె వివాహము కర్దమఋషితో జరిగెను.

🌾భగవంతుడు ఈ దంపతులకు 'కపిలుడు' అనుపేరుతో పుత్రుడుగా జన్మించెను. ఇతడు తనతల్లియైన దేవహూతికి సాంఖ్య దర్శనమును ఉపదేశించెను.

🌾మనుచక్రవర్తి సప్తద్వీపములతో గూడిన ఈ భూమండలమును పెక్కుసంవత్సరములు పరిపాలించెను.

🌾అతని రాజ్యమున ప్రజలు సుఖముగా జీవించిరి. ఎవ్వరికిని ఎట్టికష్టమూ లేకుండెను.

🌾అందఱును ధర్మనిరతులై ఉండిరి. ఇట్లు పెక్కు సంవత్సరములు ప్రజాపాలనము చేసిన పిమ్మట మనువు తన ముసలితనము నందు తన పెద్దకుమారుడైన ఉత్తానపాదునకు రాజ్యభారమును అప్పగించెను.

🌾పిమ్మట ఏకాంతమున భగవద్ధ్యానము చేయుటకై ఆయన తన భార్య శతరూపతో గూడి, నైమిశారణ్యమునకు వెళ్లెను.

🌾నైమిశారణ్యమునందలి మునులు ఆ పవిత్రదంపతులకు సాదరముగా సాకిరి.

🌾శతరూపా మనువులు అచటి తీర్థములలో స్నానములను ఆచరించిన పిదప ఒక వటవృక్షము క్రింద కూర్చుని తపస్సు చేసిరి. కొన్నిదినములు వారు కేవలము నీటినే ఆహారముగా తీసికొనిపి దీక్షవహించియుండిరి.

🌾ఆ పరమాత్మను వేదములు నేతినేతి (న+ఇతి, న+ఇతి)యన ఒక్క అంశము నుండియే పెక్కు మంది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉద్భవింతురు.

🌾శతరూపామనువులు ఈ విధముగా కేవలము జలాహారముతోడనే ఆఱువేల సంవత్సరములు తపమొనరించిరి.

🌾పిమ్మట ఏడువేల సంవత్సరములు వాయువును ఆహారముగాగొనుచు తపస్సు చేసిరి.

🌾 పదివేలసంవత్సరములు వారు ఒంటికాలి పైనిలబడి తపస్సును ఆచరించిరి.

🌾బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి తీవ్రతపస్సులకు మెచ్చి, వరములను ఇచ్చుట కొఱకు పెక్కుమార్లు సిద్ధపడిరి. కాని మనువు ఆవిషయమును పట్టించుకొనలేదు.

🌾కఠిన తపస్సు చేసిన కారణముగా వారి శరీరములు కేవలము అస్థిపంజరములుగా మిగిలియుండెను.

🌾 వారు మనో వాక్కాయకర్మలచే (త్రికరణశుద్ధిగా) తనకు పరమభక్తులని భావించి, వరములను కోరుకొనుడు అని భగవంతుడు ఆకాశవాణిరూపములో పలికెను.

🌾వెంటనే వారి శరీరములు రక్తమాంసములతో పరిపుష్టములయ్యెను. అప్పుడు మనువు చేతులు జోడించి, నమస్కరించుచు ఇట్లు పలికెను.

🌾 "ప్రభూ! మీరు మాయెడ ప్రసన్నులైనచో మనోహరమైన మీ దివ్యరూపమును సాక్షాత్కారమొనర్పుడు. దయతో మాకు ఈ వరమును ప్రసాదింపుడు.

🌾వెంటనే భగవానుడు మనువుతో ఇట్లనెను. "ఓ రాజా! నేను మీయెడల మిగుల ప్రసన్నుడనైతిని.

🌾నీ మనస్సులోని కోరికను నిస్సంకోచముగా తెలుపుము. నీవు దేనిని అడిగినను ఇచ్చెదను.

🌾అప్పుడు మనువు ఇట్లు పలికెను. "ప్రభూ! మీరు నాయెడల ప్రసన్నులైనచో మీవంటి పుత్రుని ప్రసాదింపుడు.

🌾ఓ కృపానిధీ ! ఇదియే మిమ్ము మేము కోరెడు వరము."

🌾అంతట భగవంతుడు ఇట్లు నుడివెను. "రాజా! అట్లేయగును.

🌾కాని నావంటి పుత్రుని కొఱకు నేను ఎక్కడ వెదకుదును? మీరు ఇద్దఱును నా ఆదేశమును పాటించి, కొంతకాలము వరకు ఇంద్రుని అమరావతిలో నివసింపుడు.

🌾 త్రేతాయుగమున దశరథుడు అను పేరుతో అయోధ్యకు రాజువు అగుదువు.

🌾 అప్పుడు నేను నా అంశలతో గూడ నాలుగు రూపములతో మీకు పుత్రునిగా అవతరింతును.” ఇట్లు పలికినపిమ్మట భగవానుడు అంతర్ధానమయ్యెను.

No comments: