Adsense

Thursday, March 30, 2023

జానకి మాత....!!




🌹జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః
న్యస్తాః రాఘవ మస్తకే చ విలసత్‌ కుంద ప్రసూనాయి తాః

స్రస్తాఃశ్యామలకాయ కాంతికలితాఃయాః ఇంద్ర నీలాయితాః
ముక్తాః తాః శుభదాః భవంతు భవతాం శ్రీ రామవైవాహికాః ||🌹

🌿సీతారాముల వంటి దాంపత్యము, అన్యోన్యత అబ్బాలి అని వారి బొమ్మ లేకుండా శుభలేక వెయ్యరు.

🌸ప్రాతఃస్మరణీయులు అపర శివావతారులు, లోకమునకు ధర్మము చెప్పిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు తరచుగా సీతారాముల ముద్ర లేకుండా వెయ్యవద్దు అని దంపతులు అంటే ఎలా బ్రతకాలో నేర్పినవారు సీతారాములే అని చెపుతూ ఉండేవారు.

🌿వాళ్ళు ఇద్దరూ నోరు విప్పి మాట్లాడుకోనక్కరలేదు ఆయన ఆవిడ వంక చూస్తే ఆవిడకు అర్ధము అవుతుంది, ఆవిడ ఆయన వంక చూస్తే ఆయనకు అర్ధము అవుతుంది.

🌸పట్టాభిషేక సందర్భములో హనుమకు తెల్లని వస్త్రములు ఇచ్చారు. అందరికీ అన్నీ ఇచ్చిన తరవాత అన్నీ ఇచ్చేసాక సీతమ్మ మెడలో నుంచి ఒక హారము తీసి పట్టుకున్నది.

🌿రాముడు చూసి అన్నీ అందరకూ ఇచ్చాము కదా! ఎవరిని అయినా మర్చిపోయామా? అంటే సీతమ్మ మనసు రాముడికి అర్ధము అయినట్టు కాదు.

🌸అలా అడిగితే రాముడు తనని అర్ధము చేసికోవలసినట్లు తను అనుగమించ లేదు అని ఆమె అనుకుంటుంది.

🌿రాముడు, సీతా ! నీయొక్క ఐదవతనమునకు కారణము అయినవాడు. మన ఇద్దరి శాంతికి కారణము అయినవాడు, పౌరుషవంతుడు, బుద్ధిమంతుడు, పరాక్రమ వంతుడు, నవవ్యాకరణ పండితుడు, జితేంద్రియుడైన వాడికి ఇయ్యి అంటే ఆమె ఆ హారము హనుమకు ఇచ్చింది.

🌸వారిద్దరి మనసులు మాట్లాడుకుంటాయి దాంపత్యము అంటే అది.
తనకు అటువంటి భర్త అని సీతమ్మ, అటువంటి భార్య తనకు అని రామయ్య ఎంతో పొంగిపోయారు.

🌿వాళ్ళు ఇద్దరూ ఎప్పుడూ సంతోషమునే పొందారా? ఇద్దరి మధ్య ఒరిపిడి లేదా అంటే ఉన్నది. ఆయన భార్యగా ఒరిపిడి పొంది తీరింది. కానీ ఆమె పొందిన కీర్తి యుగముల తరవాత కూడా నిలబడిపోయింది.

🌸 ధర్మమునందు దాంపత్యమును కూడా విడచి పెట్టని ఒరిపిడి ఉంటుంది. ఒకరికి ఒకరు కట్టుకున్నందుకు అనుభవిస్తారు. దుఃఖము, కష్టము, బాధ ఉంటుంది.

🌿కన్నీళ్లు ఉంటాయి కానీ దాని వెనక మాత్రము చెరకుకఱ్ఱ నమిలినప్పుడు వచ్చిన తీపి ఉంటుంది. అది ఎప్పటికీ నిలబడిపోయి తరవాత వంశములలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు వాళ్ళల్లా బ్రతకండి అని ఆదర్శము చూపిస్తారు. అది ధర్మమును సాధన చెయ్యడములో ఉండే గొప్పదనము...స్వస్తీ.

No comments: