Adsense

Tuesday, April 4, 2023

శ్రీ కోటగుళ్ళు, గణపురం Sri Kotagullu, Ganapuram



💠 కోటగుళ్లు లో గణపయ్య, ఈశ్వరుడు ఇద్దరూ కొలువై ఉన్నారు. వాళ్ల పేర్ల మీదుగా ఈ ఆలయం  "గణపేశ్వరాలయం" గా పిలవబడుతున్నది.
ఆ కాలంలో ఈ గణపేశ్వర ఆలయం చుట్టూ ఒక పెద్ద మట్టికోట ఉండి దాని లో 22 చిన్న గుడులు ఉండేవట. అందువల్లనే దీనికి "కోట గుళ్ళు" అనే పేరు వచ్చిందట. ఈ కోటగుల్లు ప్రాంతాన్ని కాకతీయ గణపతిదేవుడు ఒక సామంతునికి వరం(కానుక) గా ఇవ్వడం వలన "గణపతివరం" అనే పేరు వచ్చింది. క్రమేణా ఇది 'గణపవరం', 'గణపురం' గా స్థిరపడింది.

💠 దక్షిణ భారతదేశాన్ని ఓరుగల్లును రాజధానిగా చేసుకొని ఘనంగా పాలించిన కాకతీయ చక్రవర్తుల్లో అగ్రగణ్యుడైన గణపతిదేవ చక్రవర్తి పేరున క్రీ.శ. 1234లో జయ సంవత్సర వైశాఖ శుద్ధ త్రయోదశి బహస్పతి వారం రోజున గణపురం(గణపవరం), గణపేశ్వరాలయం(కోటగుళ్లు), గణపసముద్రం(చెరువు) నిర్మితమయ్యాయి. రామప్ప దేవాలయాన్ని నిర్మించిన కాకతీయ సర్వ సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రారెడ్డి మూడో కుమారుడు గణపురం సామంతుడు గణపతి రెడ్డి ఆధ్వర్యంలో ఆ నిర్మాణాలు జరిగాయి.

💠 దక్షణ భారతదేశానికే తలమానికగా,
ప్రపంచాన్ని అబ్బురపరిచే శిల్ప కళా సంపద వైభవంతో, అద్భుత కట్టడాలతో ఒకప్పుడు తులతూగిన ఈ  ఆలయాలు ఇప్పుడు శిథిలమై దర్శనమిస్తున్నాయి.

💠 గణపేశ్వర ఆలయానికి పై కప్పు లేదు.
బహుశా ఆలయ నిర్మాణ సమయంలో ఏదైనా సంక్షోభం కారణంగా నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయి ఉండవచ్చు. లేదా ముస్లిం దండయాత్రల వల్ల పైకప్పు ధ్వంసం అయి ఉండవచ్చు.

💠 ఇక్కడ ప్రధాన దైవం శివుడు.
శివాలయానికి కుడివైపున అరలో చిన్న వినాయకుడి విగ్రహం ఉంటుంది.
ఇక్కడ కూడా శివలింగం కొంత పక్కకు ఒరిగి నట్టే ఉన్నాకూడా లింగం పైన ఒక తోరణం లాగా ఉండి దానిపై నాగుపాము చిత్రాలు ముద్రించబడి ఉంటాయి.

💠 కోట గోడల చుట్టూ చిన్న చిన్నవి 9 గుడులు ఉన్నాయి. ఒకప్పుడు ఇవి 22 ఉండేవట.
కానీ ముస్లిం రాజైన మహ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్రలతో ఆలయము, విగ్రహాలు, శిల్ప కళాకృతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
అయితే ప్రస్తుతం ఉన్న 9 గుడులలోనూ దైవ విగ్రహాలు ఉంచే చోట లోతైన గుంతలు తవ్వ బడి ఉన్నాయి. ఈ తవ్వకాలకు ఒక కారణం ఉంది. కాకతీయుల ఆచారం ప్రకారం " ఏదైనా ధ్వజస్తంభం లేదా విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు వాటి పునాదులలో వెండి, బంగారంవంటి విలువైన సొమ్ములు ఉంచి విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు" అని ఒక నమ్మకం ఉంది. అందువల్లనే ఇక్కడ ప్రాంగణం చుట్టూ ఉన్న అన్ని గుళ్లలో గుప్తనిధుల తవ్వకాలు జరిగాయి.

💠 గణపేశ్వర ఆలయంలోని స్తంభాల మీద పడగవిప్పిన నాగులు, ఏనుగులు, నెమళ్లు, నాట్యకత్తెలు, పుష్పాలు ఇంకా వివిధ రకాల కళాకృతులు చెక్కబడి మనలను ఎంతో ఆకట్టుకుంటాయి.

💠 శివలింగo నక్షత్రకారం పానఘట్టంపై కొలువై ఉన్నట్లు కనపడడంతోపాటు ఆలయ గుర్భగుడి ముఖద్వారంపైన చండిక, త్రిముఖ బ్రహ్మ, పంచముఖ గరుత్మంతుడు, నందీశ్వరుడు, గిరిజా కళ్యాణం, మహావిష్ణువు ఉట్టిపడేట్లు చిత్రీకరించారు. దీని కింద లక్ష్మిదేవి తామర పువ్వు పై కూర్చోగా రెండువైపులా ఏనుగులు తొండాలతో సంయుక్తంగా కలశం పట్టుకుని ఉన్న ఈ విగ్రహం కళానైపుణ్యంతో కాంతులీనుతుంటుంది.

💠 ప్రధాన ఆలయానికి దక్షిణ దిక్కున దాదాపు 60 స్తంభాలుగల మండపం నిర్మించబడింది. దీనిని స్తంభాల గుడి అని పిలుస్తారు. డంగుసున్నం, కరక్కాయ మిశ్రమంతో నిర్మించిన ఈ ఆలయం చుట్టూ కిన్నెర, కింపురుష, మందాకిని శిల్పాలు.. ఆలయ గోడలమీద జంతుజీవాలు, రాతి స్తంభం, చతురస్రం, దీర్ఘచతురాస్ర, వృత్తాకార శిల్పాలున్నాయి.
ఈ మండపంలో ప్రతిరోజూ ఒక నర్తకి, 16మంది వాయిద్య కళాకారులచే నాట్య ప్రదర్శనలు జరిగేవి అంటారు.

💠 మహాశివరాత్రి, కార్తీకమాసంలో ఇక్కడున్న గణపేశ్వరాలయానికి భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తారు.

💠 కాకతీయ చక్రవర్తులు తమ సామ్రాజ్య పాలనను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ఇప్పటి మండలాల మాదిరిగా సామంత రాజ్యాలను ఏర్పర్చారు.
ఆ క్రమంలో ట్రిపుల్ టీ విధానంలో సామంత రాజ్య కేంద్రాన్ని నిర్మించారు.
ట్రిపుల్ టీ విధానం అనగా టీ (టౌన్) నగరం,
టీ (టెంపుల్)ఆలయం,
టీ(ట్యాంక్) చెరువు ఈ విధంగా సామంత రాజ్య కేంద్ర నిర్మాణ క్రమంలో నగరాన్ని నిర్మించారు.
ఆ నగరంలో ఒక దేవాలయాన్ని, ఒక చెరువును నిర్మించే వారు.
ట్రిపుల్ టీ విధానం అంటే ఇదే.
ఈ ట్రిపుల్ టీ విధానంలోనే అప్పుడు గణపురం సామంత రాజ్య కేంద్రంగా ఏర్పాటు చేసి, గణపవరం పేరుతో నగరం, గణపేశ్వరాలయం పేరున ఆలయం, గణపసముద్రం పేరున పెద్ద చెరువును నిర్మించారు.

💠 ఓరుగల్లుపై దాడి చేసిన దేవగిరి మహారాజును 15రోజులు యుద్ధం చేసి ఓడిచినందుకు గుర్తుగా గణపేశ్వరాలయంలో కాకతీయ అష్టమ చక్రవర్తి రాణి రుద్రమదేవి మత్తగజం(ఏనుగు) కుంభ స్థలంపై లంఘించి, సింహం దాన్ని నిర్జిస్తున్నట్లుగా ఉన్న గజకేసరి శిల్పాన్ని తన యుద్ధ విజయ చిహ్నాలుగా ప్రతిష్ఠింపజేసింది. అనగా ఏనుగులాంటి మహాదేవులను, సింహంలాంటి తాను(రుద్రమదేవి) అణచివేసినట్లుగా ఉన్నవి విగ్రహాలు.

💠 వరంగల్ నుండి 60 కిమీ దూరం.

No comments: