Adsense

Tuesday, April 4, 2023

హనుమంతుడు మోసుకొచ్చిన మూడు ముత్యాల పర్వతాలు. Three pearl mountains carried by Hanuman

శ్రీరామ నవమికి.. హనుమంతుడు మోసుకొచ్చిన మూడు ముత్యాల పర్వతాలు 

🌿హిమాలయాలలో నిద్రిస్తున్న హనుమంతుడికి మెడలోని ముత్యాలహారం చేతికి తగలగానే మెలకువ వచ్చింది!

🌸‘నేడు నా రామయ్య తండ్రి కల్యాణం, నా సీతారాములు ముత్యాల తలంబ్రాలు పోసుకునే రోజు. రామనామం జపిస్తూ  భద్రాద్రికి బయలుదేరతాను’ అనుకుంటూ రామనామ స్మరణతో భద్రాద్రి చేరుకున్నాడు.

🌿కల్యాణం కనులారా వీక్షించి పరవశించిపోయాడు హనుమంతుడు. కల్యాణం పరిసమాప్తి తర్వాత ఆ దంపతులతో మాట్లాడసాగాడు హనుమంతుడు.

🌹
నాటి గాథ (ఒకటో ముత్యం)🌹

🌸‘‘నీ పట్టాభిషేక సమయంలో నువ్వు సీతమ్మ చేతికి ఒక ముత్యాల హారం ఇచ్చి, ‘జానకీ! ఈ హారాన్ని నీకు ఇష్టమైన వారికివ్వు’ అన్నావు.

🌿సీతమ్మ ఆ హారాన్ని అందుకుని సింహాసనం దిగి, విభీషణ, జాంబవంత సుగ్రీవ, అంగదాది వానరులను ఒక్కొక్కరినీ దాటుకుంటూ నా దగ్గరకు రాగానే నిలబడిపోయింది.

🌸 ‘మారుతీ! ఈ హారానికి నీవు మాత్రమే అర్హుడవు’ అంటూ నా చేతికి అందించింది. అక్కడున్నవారంతా హర్షధ్వానాలు చేశారు.

🌿 నేను సిగ్గుతో ముడుచుకుపోతూ, ‘తల్లీ! అంతా రాముని మహిమ వల్లే!’ అన్నాను. ఇదంతా నాటి గాథ’’ అన్నాడు హనుమ.

🌹నేటి సందేహం (రెండో ముత్యం)🌹

🌸‘‘తండ్రీ! నీ వెంటే ఉండి, నీ అడుగులో అడుగులు వేసిన నాకు, నువ్వంటే ఏమిటో తెలుసు.

🌿ఇతరులు నిన్ను శంకిస్తుంటే
నా మనసుకి కష్టంగా ఉంది. మా సీతమ్మ తల్లి రావణుని చెరలో ఉండి వచ్చిన తరవాత, నువ్వు ఆమెను అనుమానించావని అందరూ అనుకుంటున్నారు’’ అంటుండగానే... సీతమ్మ అందుకున్నారు.

🌸‘‘హనుమా! రాముడు నాకు భర్త మాత్రమే కాదు, కోట్లమందికి ప్రభువు. ఆయనను ఎవ్వరూ వేలెత్తి చూపకూడదు.

🌿 అందుకే నాకుగా నేను చితి పేర్చుకున్నాను’’ అని చెప్పింది. రాముడు, ‘‘హనుమా! ఎవరి ఆలోచనలు వారివి. వారి కళ్లకు నా ప్రవర్తన అలా కనిపించిందేమో, వారు అలా అనుకోవడంలో తప్పులేదేమో’’ అన్నాడు.

🌹రేపటి సందేశం (మూడో ముత్యం)🌹

🌸‘‘రామా! నిన్ను తొలిసారి చూసినప్పుడే నువ్వేమిటో అర్థమైందయ్యా. సీతమ్మను వెతుకుతూ మా కిష్కింధకు వచ్చావు. సీతమ్మ జాడ అడిగావు. నేను నగల మూటను చూపించాను.

🌿 నువ్వు ఒక నగను చేతిలోకి తీసుకుని కంట తడిపెట్టి, పక్కనే ఉన్న సౌమిత్రితో, ‘తమ్ముడూ! నా కళ్లకు కన్నీళ్లు అడ్డపడుతున్నాయి.

🌸నగలు గుర్తించలేకపోతున్నాను. మీ వదినగారి నగలను గుర్తించవయ్యా’ అన్నావు. అమ్మ అంటే నీకు ఎంత ప్రేమయ్యా.

🌿అంతేనా, నీ తమ్ముడు నీకు తగ్గ అనుజుడు. ఆయనకు నగలు చూపితే, సీతమ్మ కాలి మంజీరాలు మాత్రమే గుర్తుపట్టగలిగాడు. ఎంత ఉత్తములయ్యా మీరు’’ అన్నాడు హనుమ.

🌹ఏటేటా కల్యాణం :🌹

🌸‘‘చివరగా ఒక్క మాట తండ్రీ.. ఎన్ని యుగాలు గడిచినా, దాంపత్యానికి చిహ్నంగా నా తల్లి సీతమ్మను, నా తండ్రి రామయ్యనే చెప్పుకుంటారు.

🌿అది నాకెంతో సంతోషం. నాడు మీ కల్యాణం చూడలే కపోయామని ఎవ్వరూ బాధపడక్కర్లేదు.

🌸ఏటేటా మీ కల్యాణం చూస్తూనే ఉంటాం’’ అని, సీతారాముల ఆశీస్సులు తీసుకుని హిమాలయాలలో తపస్సు కోసం నిష్క్రమించాడు హనుమంతుడు...స్వస్తీ.

No comments: