Adsense

Thursday, May 18, 2023

అయ్యప్ప చరితం - 2

అయ్యప్ప చరితం - 2 


త్రిమూర్తులు , దేవీమాతలు అతని వైపు ప్రసన్నంగా చూశారు! ‘‘వత్సా! ఇప్పటికి పరిస్థితులు అనుకూలమైనవని ఏమరిపాటుతో ప్రవర్తించకూడదు సుమా! మంచి , చెడులమధ్య సంఘర్షణ తల ఎత్తుతూనే వుంటుంది! అందుకు కారణం గర్వాహంకారాలే! వాటిని దరి చేరనీయకుండా మసలుకోవాలి! భూలోకంలో ఇప్పుడు ఋషి , మునులకు యజ్ఞయాగాలు సక్రమంగా జరుపుకునే అవకాశం ఏర్పడింది ! ఆ ప్రశాంత వాతావరణంలోకి వెళ్లి జీవించడానికి ఒక జంట అవతరించబోతున్నది, చూడండి!’’ అన్నాడు బ్రహ్మదేవుడు చిరునవ్వుతో చూస్తూ ! సభలో వారందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా త్రిమూర్తులనుండి తేజస్సులు వెలువడి , అవి క్రమంగా కలిసి ఒక పురుషాకృతిని దాల్చాయి !  దేవీమాతలు ముగ్గురునుండి తేజస్సులు వెలువడి కలిసిపోయి స్త్రీ ఆకృతిని పొందాయి ! వాళ్లవైపు ప్రసన్నంగా చూసారు త్రిమూర్తులు ! ‘‘ఆహా !  అసమాన సౌందర్యంతో అలరారుతున్నారు !  వీరిని ఎందుకు సృష్టించినట్లు?’’* అనుకుంటూ కుతూహలంగా చూస్తున్నారందరూ ఆ జంటవైపు ! శ్రీ మహావిష్ణువు వాళ్లవైపు చూస్తూ ‘‘సుందరదత్తుడు, లీలావతి అనబడే మీరిద్దరూ దంపతులై భూలోకంలో ధర్మమార్గాన జీవించండి! గృహస్థాశ్రమ ధర్మాన్ని నెరవేరుస్తూ ఆదర్శప్రాయంగా గడపండి!’’ అని ఆదేశించాడు. ‘‘మీ ఆజ్ఞను శిరసావహిస్తున్నాను!’’ అంటూ నమస్కరించి భూలోకాన్ని చేరుకున్నారు. 

మానుష్యాకృతులు పొందిన ఆ ఇద్దరూ ! సుందర దత్తుడు, లీలావతి బదరికారణ్య ప్రాంతం చేరి అక్కడ ఆశ్రమం నిర్మించుకుని ఇతర మునిగణాలతో పాటు జీవించసాగారు! అక్కడకు చేరిన కొద్దికాలంలోనే తమ సత్ప్రవర్తనతో అందరి ఆదరాభిమానాలు చూరగొన్నారు ! ‘‘ఈ జంటను చూస్తుంటే ఎంతో ముచ్చటవేస్తున్నది ! ఆ యువకుడు పేరుకు తగ్గట్లే సుందర రూపంతో మనందరికీ దత్తుడై పుత్రుడికన్నా ఎక్కువగా గౌరవాభిమానాలు చూపుతున్నాడు !  అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ,  దైవకార్యాలు ఏ కొరతా లేకుండా నెరవేరస్తున్నాడు ! లీలావతి కూడా అతనికి తగిన పత్నిగా , ఆదర్శ గృహిణిగా జీవిస్తున్నది ! పెద్దలంటే గౌరవం , అందరినీ స్నేహపూర్వకంగా పలకరిస్తూ సహాయపడుతుంటుంది. వీళ్లిక్కడికి రావడంతో ఈ ప్రాంతానికి కొత్త కళ వచ్చింది కదూ?’’ అంటూ మెచ్చుకునేవాళ్లు అక్కడ నివశిస్తున్న మునిగణాలు !

ఆ ప్రశంసలు అతిశయోక్తులు కావు ! నిజంగానే దత్తుడు , లీలావతి మనసా , వాచా కర్మణా ఎన్నడూ ఎవరినీ నొప్పించకుండా మసలుకునేవారు !  కాలం వేగంగా గడిచిపోసాగింది. తమకున్నదానిలో పరులకు ఉపకారం చేస్తూ,  ఎవరినీ నొప్పించకుండా సంతోషంగా కాలం గడుపుతున్న ఆ దంపతుల జీవితం హఠాత్తుగా అనుకోని మలుపు తిరిగింది !

ఒక రోజు...‘‘లీలావతి !  ఒకసారి ఇలారా !  నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి ! ’’ లోపల పనిలో వున్న లీలావతి భర్త పిలుపు విని బయటకు వచ్చింది. ఆశ్రమం ముందున్న అరుగుమీద కూర్చుని ఏదో ఆలోచిస్తున్న దత్తుడి ఆమె రావటం చూసి ‘‘ఇట్లా కూర్చో లీలా!’’ అన్నాడు ప్రక్కకు జరుగుతూ. ‘‘ఏమిటి చెప్పండి!’’ అంటూ ప్రక్కన కూర్చుంది, భర్త ముఖంలోకి పరిశీలనగా చూస్తూ. ‘‘ఈవేళ ఉదయం నుండి ఎందుకో ఏదో ఆలోచిస్తూ గంభీరంగా వున్నారు ! ఏ విషయం గూర్చి ఆలోచిస్తున్నారు చెప్పండి ? ’’ అడిగింది లీలావతి. ‘‘చెబుతాను. జాగ్రత్తగా విను. మనకు వయస్సుమీద పడుతున్నది. ఈ గృహస్థాశ్రమాన్ని త్యజించి సన్యసించి తపస్సులో కాలం గడపాలన్న సంకల్పం నాలో చోటుచేసుకుంది..’’ అతని మాట పూర్తికాకుండానే ‘‘ఏమిటండీ వింతగా మాట్లాడుతున్నారు ? మనకు సంతాన భాగ్యం కూడా కలగలేదింకా ! నాకు సంసారిక సుఖాలమీద ఇంకా మోహం తీరలేదు. మీరు సన్యసించి తపస్సుకు వెళ్లడమేమిటి?’’ అన్నది ఆందోళనగా చూస్తూ!

‘‘పిచ్చిదానా! సంతానం మోక్షసాధనకు అవరోధమని గ్రహించే భగవంతుడు మనకా బంధాలను అనుగ్రహించలేదు. భార్యా, పిల్లలు అనే సంసార బంధాలలో కూరుకుపోవడం నాకు ఇష్టం లేదు  ఈ జన్మకు ఇంతవరకు మనం సాగించిన ఈ గృహస్థాశ్రమం మీద నాకు విరక్తి కలిగిందని చెబుతున్నాను గదా ! ఐహిక సుఖాలు శాశ్వతం కావు !  యవ్వనం క్షణభంగరమైనది! వయస్సు పెరుగుతున్నకొద్దీ మనస్సు నిలకడపొంది ఐహిక సుఖాలవైపు గాక శాశ్వతమైన మోక్షాన్ని పొందడానికి ప్రయత్నించాలి !  అందుకే నీవు కూడా నాతో వైరాగ్య మార్గాన్ని అనుసరించు. ఇద్దరం తపస్సుకు తరలి వెళదాం పద !’’ అన్నాడు దత్తుడు శాంత స్వరంతో నచ్చచెబుతూ! ‘‘ఊహూ ! మీ మాటలు నాకెంత మాత్రం సమ్మతం కావు! నాధా!  భార్య కోరిక తీర్చి ఆమెను సంతోషపెట్టాల్సిన బాధ్యత భర్తదన్న విషయం మర్చిపోతున్నారు మీరు. నా తనివితీరి తృప్తి చెందేవరకు నన్ను మీరు సుఖాలలో ఓలలాడించక తప్పదు!’’ అంటూ భర్తను గట్టిగా పెనవేసుకుంది లీలావతి!

దత్తుడు నిర్వికారంగా ఆమెను జరిపి లేచి నిలబడ్డాడు! చిన్నగా నిట్టూర్చి ‘‘భర్త అడుగుజాడలలో నవడం ఉత్తమ సతీ ధర్మమనే విషయాన్ని మరచి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు సుమా! నా నిర్ణయం మారదు. నేను తపస్సుకు తరలి వెళుతున్నాను. నా మార్గానికి అడ్డురాకు’’ అన్నాడు, కోపం, విసుగు కొద్దిగా ధ్వనించాయి ఆ మాటలలో.

‘‘మిమ్మల్ని నేను వెళ్లనివ్వను. ఇంతకాలం మీ ప్రేమానురాగాలలో పరవశిస్తూ ప్రేమసామ్రాజ్యాన్ని పట్టమహిషిలా పాలిస్తూ వస్తున్నాను. నా ఆనందాన్ని భంగపరిచి మీరెలా వెళతారో అదీ చూస్తాను. ఇలా చూడండి!’’ భర్తలో కోరిక కలిగించాలన్న ఉద్దేశ్యంతో వక్షోజాలమీది ఆచ్ఛాదన వస్త్రాన్ని తొలగించి గట్టిగా కౌగిలిలలో బిగించబోయింది లీలావతి.  ఆ చర్యకు దత్తునిలో అణచివుంచిన కోపావేశాలు పొంగివచ్చాయి!

‘‘లీలావతి! ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా పశువాంఛతో నా మార్గానికి అడ్డుపడుతున్న నీవు ఉత్తమ స్త్రీ జన్మకు తగవు. మరుజన్మలో రాక్షస కులంలో మహిషిగా జన్మించి నీ పశువాంఛను తీర్చుకో’’ అంటూ శపించాడు కఠినంగా చూస్తూ! లీలావతి కళ్లు ఎరుపెక్కాయి.

‘‘నాది పశువాంఛనా? నేను మహిషిగా జన్మిస్తానా? అయితే నా మాట కూడా వినండి. మహిషినైనా మిమ్మల్ని విడువను. ఆ జన్మలో కూడా మహిషంగా వచ్చి మీరే నన్ను సంతోషపెడతారు, వెళ్లండి. వెళ్లి తపస్సుతో ఏం సాధించుకుంటారో అదీ చూస్తాను’’ అంటూ విసురుగా ఆశ్రమంలోకి వెళ్లిపోయింది. ‘‘ప్చ్! పరమేశ్వరా! మీరు రాత్రి స్వప్నంలో ఆదేశించినట్లు తపస్సుకు తరలివెళ్లిపోవాలనుకుంటే లీలావతి ఈ విధంగా ప్రవర్తిస్తుందనుకోలేదు.

ఆమెకు చెప్పి పొరబాటు చేసి వుంటే నన్ను మన్నించండి! ఆమెకు సద్బుద్ధిని అనుగ్రహించండి’’  అని మనస్సులో ప్రార్థించి గబగబా అక్కడినుండి వెళ్లిపోయాడు దత్తుడు! భర్త వెళ్లిపోవడంతో లోపలనుండి గమనించిన లీలావతి దుఃఖోద్వేగంతో ప్రాణత్యాగం చేసింది. 

‘‘ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః
కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః ఓం నమశ్శివాయ! ఓం నమశ్శివాయ!’’ అని పంచాక్షరీ మంత్రాన్ని ధ్యానిస్తూ కైలాసంలో అడుగుపెట్టాడు నారదుడు. వెండికొండమీద కొలువై వున్న పార్వతీ పరమేశ్వరులకు హారతులిస్తూ ప్రస్తుతిస్తున్నారు ప్రమథగణాలు ఆ సమయంలో.

No comments: