Adsense

Tuesday, May 2, 2023

శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం, పాలకుర్తి, వరంగల్ జిల్లా


 శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం, పాలకుర్తి, వరంగల్ జిల్లా


💠 పూర్వం ప్రకృతి ఎంతో స్వచ్ఛంగా వుండేదో.. మనుషులు కూడా ఆ విధంగా స్వచ్ఛమైన మనసుతో, భక్తితో దేవుడ్ని ఆరాధిస్తూ సుఖంగా జీవించేవారు. ఎంతోమంది ఋషులు పర్వతాల్లో, అరణ్యాల్లో తపస్సు చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనలోనే కాలం గడిపేవారు. అలాంటివారిలో కొందరి తపస్సుకు మెచ్చిన భగవంతుడు వారికి సాక్షాత్కరించి కోరికలు నెరవేర్చేవాడు. అలాగే వారి  కోరిక మీద ఏదో ఓ పవిత్రమైన ప్రదేశంలో వెలిసేవాడు.
అలాంటి అపురూపమైన ప్రదేశాల్లో వరంగల్ జిల్లాలోని పాలకుర్తి ఒకటి.

💠 రాష్ట్ర వ్యాప్తంగా ప్రశస్తి పొందిన పుణ్యక్షేత్రాలలో వరంగల్ జిల్లా పాలకుర్తి లోని “సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి" ఆలయం విభిన్నమైనది.

💠 దట్టమైన వృక్ష సంపద గల ఎత్తైన కొండ పై ఉన్న రెండు గుహల్లో సోమేశ్వరస్వామిగా శివుడు ఒక గుహలో, లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామిగా మహావిష్ణువు మరో గుహలో వెలిశారు.

💠 పురాతన కాలంలో ఈ కొండ గుహలనుండి పాలవంటి నీరు ప్రవహించడంతో ఈ గ్రామం పేరు పాలకురికిగా, క్రమంగా పాలకుర్తిగా మారింది.

💠 ఇప్పటికీ శివుడి గుహనుండి అర్థ రాత్రివేళ ఓంకారనాదం వినవస్తుందని, శివలింగానికి నాగుపాము ప్రదక్షిణలు జరుపుతుందని ఇక్కడి వారు అంటారు.

🔅స్థలపురాణం🔅

💠 పురాణాల ప్రకారం శివుడి అనుగ్రహం కోసం సప్తరుషులు తపస్సు చేశారట. ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవ్వడంతో నారాయణుడితో కలిసి ఈ ప్రాంతంలో కొలువుదీరమంటూ ఆ రుషులు వేడుకున్నారట. అలా శివకేశవులు ఈ కొండ పైన రెండు గుహల్లో స్వయంభువులుగా వెలిశారని చెబుతారు.

💠 పూర్వం ఒక వృధ్ధురాలు ప్రతి నిత్యం స్వామికి ప్రదక్షిణ చెయ్యటానికి కొండపైన ప్రదక్షిణ మార్గంలేక కొండ చుట్టూ తిరిగి వచ్చేది. వయసు మీద పడుతున్నకొలదీ ఆవిడ గిరి చుట్టూ తిరగలేక ప్రయాస పడుతుంటే పరమేశ్వరుడు తన ఆలయం వెనుక కొండ చీల్చి ప్రదక్షిణ మార్గమేర్పరిచి ఆ వృధ్ధురాలి ప్రయాస తప్పించాడు. అప్పటినుంచీ స్వామి ప్రదక్షిణ ఆ మార్గంలోనే చేస్తారు.
ఈ సొరంగ మార్గం సన్నగా వుండి, కొండ చీలి ఏర్పడినట్లే వుంటుందిగానీ, ఎక్కడా కొండ పగలగొట్టి ఏర్పరచిన మార్గంలా వుండదు..

💠 భక్తులు శుచిగా, భక్తిగా ఆ మార్గంలో వెళ్తే ఎంత లావయినవాళ్ళయినా సునాయాసంగా వెళ్తారనీ, శుభ్రత పాటించకుండా ఆలయానికి కొస్తే తేనెటీగలు శిక్షణ భటులుగా వారిని వెంబడించి స్నానంచేసేవరకు వారిని వదలవట. స్వామికి మొక్కులు మొక్కి, ఆపదలు తీరిన తరువాత మర్చిపోతే స్వామి వారికి వెంటనే గుర్తు చేస్తుంటారట.

🔅 గండదీపం 🔅 
ఇక్కడే గండదీపం మిద్దె ఉంటుంది. ఈ మార్గం ద్వారా భక్తులు పైకి వచ్చి గండదీపం వెలిగించి  తమ మొక్కులను తీర్చుకుంటారు.
సర్వ శుభాలనూ కలిగించే ఈ క్షేత్రంలో ఏడాదికోసారి వెలిగించే జ్యోతి చుట్టుపక్కల 25 గ్రామాలకు కనపడటాన్ని ఓ విశేషంగా చెప్పుకుంటారు. ఇది శబరిమల, అరుణాచలం తరువాత దక్షిణభారత దేశంలోనే మూడో అతి పెద్ద జ్యోతి అనీ అంటారు.

💠 ఆలయం ప్రక్కనుంచి  పైనున్న  వీరాంజనేయస్వామి  ఆలయానికి మెట్లు ఉన్నాయి. ఈ ఆంజనేయుని దర్శనానికి వేకువజామునే సుదూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి ఉప్పురాశిగా పోసి ,దాని పై  ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించి, ప్రదక్షిణలు చేస్తారు.ఎటువంటి భూత , ప్రేత,పిశాచాది బాధలున్నా తొలగిపోతాయని, సంతానం లేనివారు సంతానం పొందుతారని  భక్తుల నమ్మకం.

💠 సోమేశ్వరస్వామిని దర్శించి, పూజలు చేసి, పక్కనే ఇంకొక గుహలో వున్న (బయటకు వస్తున్న మార్గంలోనే కనబడుతుంది) శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కూడా సేవించవచ్చు.

💠 కొండ దిగువున ప్రఖ్యాత కవి పాలకుర్తి సోమేశ్వరుడి సమాధి వున్నది. ఈయన జన్మస్ధలం ఇదే. సోమేశ్వర కవి తల్లిదండ్రులు ఈ స్వామిని సేవించి, కొడుకు పుడితే ఆ స్వామి పేరే పెట్టారుట. ఈ కవి జీవిత కాలం క్రీ.శ. 1160 – 1240. ఈ మహా కవి కూడా ఈ సోమేశ్వరుని ఆరాధించాడుట. అంటే అంతకు పూర్వంనుంచీ సోమేశ్వరస్వామి అక్కడ కొలువై భక్తుల అభీష్టాలు తీరుస్తున్నాడన్నమాట.

💠 ఇక్కడకి 2 కి.మీల దూరంలో భాగవతం రచించిన మహాకవి పోతన నివసించిన బమ్మెర గ్రామం వున్నది. ఇక్కడే మహా భాగవతం రచింపబడ్డది.

💠 శివుడు, కేశవుడు ఒకే చోట ఉండటం చాలా అరుదైన విషయం . అందువల్లే ఈ క్షేత్రం అటు శైవులతో పాటు వైష్ణవులకు కూడా అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.

💠 ముడుపుల చెల్లింపు కోసంఇక్కడకు వచ్చే భక్తులు మొదట సోమేశ్వరుడినీ, ఆ తరువాత లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు.
సంతానం లేనివారు ఈ ఆలయంలో కొబ్బరికాయల్ని ముడుపుగా కడితే పిల్లలు కలుగుతారని భక్తుల నమ్మకం.

💠 మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు, మహాజాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

💠 ఈ కొండ కింద కోనేరు, దత్తాత్రేయుడు, ఓంకారేశ్వరుడు, రమా సహిత సత్యనారాయణుడు, వాసవి కన్యకాపరమేశ్వరి, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు.

💠 పాలకుర్తి వరంగల్ కు 54 కిమీ.

No comments: