Adsense

Thursday, May 4, 2023

ఈ రోజు లక్ష్మీ నరసింహ స్వామి జయంతి

04.05.2023.       గురువారం
ఈ రోజు *నరసింహ జయంతి*.విష్ణుమూర్తి దశావతారాలలో నరసింహావతారం నాల్గవది. *హిరణ్యకశిపుడు* అనే రాక్షసుడు,తనకి మనుష్యులు ద్వారా,దేవతల ద్వారా, రాక్షుసుల ద్వారా,జంతువుల ద్వారా ప్రాణహాని కలగకుండా,పగటి సమయం లో,రాత్రి సమయంలో ,ఇంటి బయట,ఇంటిలోపల, నేల మీద ,ఆకాశంలో కానీ మరణం సంభవించకుండా ఉండే ప్రత్యేక వరాలు పొందాడుట.ఈ వృత్తాంతం తెలిసిన విష్ణుమూర్తి,మానవ ఆకారం తో, సింహపుతల, కోరలుతో, మనిషి గా కాకుండా,జంతువు గా కాకుండా,నరసింహరూపం గా అవతరించాడు. పగలు,రాత్రి కాని సాయంసంధ్యా సమయం లో,ఇంటి గడప మీద,తన ఒడి లో  హిరణ్యకశిపుడు ని సంహరించాడు అని పురాణ కథనం. వైశాఖ శుక్లపక్ష చతుర్దశి రోజు ఈ ఉదంతం జరిగినది కాబట్టి ఈ రోజు నరసింహ జయంతి. విష్ణు భక్తులు,ఈ రోజంతా ఉపవాసం ఉండి, సాయంసంధ్యవేళలో *లక్ష్మీనరసింహస్వామి* కి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజు సింహాచలం లోనూ,అన్నీ వైష్ణవ దేవాలయాలలో ప్రత్యేక విశేష పూజలు జరుగుతాయి. ఈరోజు లక్ష్మీనరసింహస్వామి కి విశేషపూజలు చేయడం వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయని,ఆర్థిక,న్యాయ చట్టపర,అనారోగ్య, భాగస్వామ్య సమస్యలు తొలగి పోతాయి అని నమ్మకం.

ఈరోజు తో *నృసింహ నవరాత్రులు* ముగుస్తాయి.

ఈ రోజు *ఛిన్నమస్థా దేవి* జయంతి. తన తలను తానే ఖండించుకున్న దేవత గా, *ఛిన్నమస్థికా దేవి* దశమహావిద్యలలో 6వ మహావిద్య. ఈ తాంత్రికశక్తి ని *ప్రచండ చండిక* గా, *చింతాపూర్ణి* గా కూడా పిలుస్తారు. రాక్షస నిర్మూలనకై, పార్వతీదేవి *చ్ఛిన్నమస్థా* గా వైశాఖ శుక్ల పక్ష చతుర్దశి రోజు రూపాంతరం చెందినది అని శివ పురాణం మరియూ మార్కండేయ పురాణాల కథనం. *శక్తి యామల* సూత్రాల ప్రకారం, మన శరీరంలోని  *మూలాధార చక్రాన్ని* ప్రభావితం చేసే శక్తి *ఛిన్నమస్థిక*. ఎర్రటి మందార పువ్వు రంగులో మేనిఛాయ కలిగి,లక్ష సూర్యబింబాల తేజస్సు కలిగి, పదహారు సంవత్సరాల వయస్సు కలిగిన అమ్మాయిలా,నగ్నంగా విరబోసుకున్న జుట్టుతో, మైథునం చేస్తున్న జంట మీద నిలుచున్న రూపం. *రుద్రయామల సూత్రాల* ప్రకారం. ఛిన్నమస్థికాదేవి రూప వర్ణన చాలా భీతావహం గా ఉంటుంది. తన తలను తానే నరుక్కోని,ఎడమచేతిలో తెగిన తన శిరస్సును పట్టుకొని, కుడి చేతిలో  తల నరుక్కున్న కత్తిని పట్టుకొని ఉండగా,తెగిన మొండెం నుండి మూడు రక్తపు ధారలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండగా, ఒక రక్తపు ధారను ఎడమచేతి లో ఉన్న తెగిన తన శిరస్సు త్రాగుతూ ఉండగా,మిగిలిన రెండు రక్తపు ధారలను, డాకినీ,వర్ణిని అనే స్త్రీ యోగిని శక్తులు త్రాగుతున్నట్లుగా రూప వర్ణన. ఈ రోజు దుర్గాదేవిని ఛిన్నమస్థికా రూపం గా భావించి, *దుర్గా సప్తశతి పారాయణము* తో ప్రత్యేక పూజ చేయడం వలన సంతాన సాఫల్యతలు ఏర్పడతాయి అని, లైంగిక సమస్యలు తొలగి పోతాయి అని, రక్తనాళాల సమస్యలు, గతాన్ని మరచిపోయే ఋగ్మతలు తొలిగిపోతాయి అని నమ్మకం.

నిరయన రవి, భరణీ నక్షత్రం 3 వ పాదంలో ప్రవేశం ఈరోజు రా.03.31కి జరుగుతుంది. అప్పటి నుండి *కర్తరీ,అగ్ని నక్షత్రం* ప్రారంభం అవుతుంది.

నరసింహ స్మరణం తో.....సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..

No comments: