Adsense

Wednesday, May 3, 2023

ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా, పట్టిసీమలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం

ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా, పట్టిసీమలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం.


శ్రీశైలం కాశీ కేదారం కాళహస్తించ పట్టిసం |
పంచ క్షేత్రం పఠెన్నిత్యం మహా పాథక నాశనమ్ |

స్కాంద పురాణంలోని పంచ క్షేత్రాలలో ఐదోది దేవకూట పర్వతంపై ఉన్న పట్టిసం దేవాలయం. దీనినే పట్టిసాచలం అని, పట్టిసీమ దేవాలయం అని కూడా పిలుస్తారు.

పురాణాల ప్రకారం ఒకప్పుడు పర్వతాలకు రెక్కలు ఉండేవి. అవి ఆ ప్రదేశంలో దిగినప్పుడు చాలా  జన, ఆస్తి నష్టం జరిగేది. కాబట్టి దేవేంద్రుడు వారి రెక్కలను కత్తిరించాడు. దీంతో ఈ పర్వతాలను దేవకూటాద్రి పర్వతాలు లేదా నీలాద్రి పర్వతాలు అంటారు.
పర్వత రాజు కరవీరుడు, అతని కుమారుడు.. కైలాసనాథుని కోసం కఠినంగా  తపస్సు చేయగా...  ప్రత్యక్షమైన శివుడితో కరవీరుడు, లింగాకారంలో తనపై నివాసం ఉండాలని వరం కోరాడు. భక్తుని కోరిక మేరకు పరమశివుడు ఆ కొండపై నివాసం ఉండేందుకు అంగీకరించాడు.


స్థలపురాణం:
పూర్వం దక్ష ప్రజాపతి తాను చేస్తోన్న యజ్ఞానికి తన అల్లుడైన శివుడిని ఆహ్వానించకుండా అవమానపరుస్తాడు.
పిలవని పేరంటానికి వెళ్లిన సతీదేవి తన తండ్రి చేసిన శివదూషణను భరించలేక యోగాగ్నిలో దగ్ధం అవుతుంది. అప్పుడు శివుడు ఆగ్రహంతో తాండవం చేస్తూ తన శిరస్సు నుంచి ఒక జటను తీసి నేలకు కొట్టగా దాన్నుంచి భీకరాకారంతో ఆవిర్భవించాడు వీరభద్రుడు.

శివుడి ఆదేశం మేరకు దక్షుడి యజ్ఞ వాటికపై వీరభద్రుడు విరుచుకుపడతాడు.
తన ఆయుధమైన 'పట్టసం'తో దక్షుడి తల నరికి దానిని గోదావరిలో కడిగాడు. ఈ కారణంగానే ఈ ప్రాంతాన్ని పట్టసమనీ, పట్టిసీమనీ, పట్టసాచల క్షేత్రమని పిలుస్తుంటారు. ఈ కొండపై భద్రకాళితో సహా లింగ రూపంలో కొలువయ్యాడనీ నాటి నుంచీ వీరేశ్వరుడిగా భక్తుల పూజలందుకుంటున్నాడని ప్రతీతి.


దక్షుడి తల నరికిన వీరభద్రుడు ఆవేశం చల్లారక దేవకూట పర్వతం పై ప్రళయతాండవం చేయసాగాడు.
ఆ సమయంలో ఆయన త్రిశూలం నేలకి గుచ్చుకోవడంతో, ఆ గుండం నుంచి 'భద్రకాళి' ఆవిర్భవించింది. దక్షుడి తల నరకడానికి ముందే వీరభద్రుడిని నిలువరించడానికి భావనారాయణ స్వామి చక్రాయుధాన్ని ప్రయోగించాడు. అయితే ఆయన ఆ చక్రాన్ని నోట కరుచుకుని నమిలి మింగేశాడు.
దాంతో ఈ స్వామిని శ్రీ భావనారాయణుడు సహస్ర కమలాలతో పూజించి శాంతింపజేయడానికి ప్రయత్నించాడు.
అయితే ప్రతిసారి ఒక కమలం తక్కువ అవుతూ ఉండటంతో, తన వామ నేత్రాన్ని ఒక కమలంగా భావించి సమర్పించాడట. ఈ సందర్భంలోనే భావనారాయణుడికి వీరభద్రుడు తిరిగి చక్రాయుధాన్ని ఇచ్చినట్టు స్థలపురాణం చెబుతోంది. వీరభద్ర భద్రకాళీ స్వరూప భీకరరౌద్ర నాట్యాన్ని ఆపడానికి దేవతలకోరిక మీద అక్కడకు వచ్చిన అగస్త్యమహర్షి వీరభద్రుడిని వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు.
అప్పుడు వీరభద్రుడి ఆవేశం చల్లారి లింగరూపంలో దేవకూట పర్వతం మీద భద్రకాళీమాతతో వెలిశాడు.ఇక్కడ వెలసిన వీరభద్రుడిని వీరేశ్వరుడిగా ఆరాధించి భద్రకాళితో ఆ స్వామి వివాహం జరిపించాడు అగస్త్యుడు. అలాగే శ్రీ భూ నీలా సమేత భావనారాయణ స్వామికి కూడా వివాహం జరిపించాడు. శివలింగంపై ఇప్పటికీ అగస్త్యుడి చేతిగుర్తులు కనిపిస్తుంటాయని అంటారు.
ఆలయంలో గల అరీశ్వరి, పురీశ్వరి దేవతలకి సంతానం లేనివారు  విశేష పూజలు చేస్తే సంతానసాఫల్యం ఉంటుందని చెప్తారు.

ఆలయ క్షేత్ర పాలకుడు భావన్నారాయణ స్వామి. ప్రధాన ఉప మందిరం లక్ష్మీ సహిత శ్రీ భావన్నారాయ స్వామి భారతదేశంలోని ఐదు భావన్నారాయణ స్వామి దేవాలయాలలో ఒకటి.
పట్టిసీమ బోటింగ్ పాయింట్ వద్ద సీతా రామభద్ర స్వామి ఆలయం, కాల భైరవ ఆలయం, సుబ్రమణ్య స్వామి, సరస్వతి, లక్ష్మీ గణపతి, సూర్యనారాయణ స్వామి, శ్రీ తాండవ వీరభద్ర స్వామి, పెద్ద హనుమాన్ విగ్రహం ఉంది.

ఈ దేవకూట కొండకు సమీపంలో, ఏనుగు కొండ అని పిలువబడే మరో కొండ ఉంది. ఇక్కడ దేవుడు శ్రీ మహావిష్ణువు గజేంద్ర మోక్షంలో పేర్కొన్న ఏనుగుకు మోక్షాన్ని ఇచ్చాడు అంటారు.

శివరాత్రి రోజున  గోదావరి నుంచి తీర్థబిందెలతో నీటిని తీసుకువచ్చి స్వామికి నిత్యాభిషేకం చేసి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమపూజ చేస్తారు. తరువాత పూజా కార్యక్రమాలు ప్రారంభమై అర్థరాత్రి వరకు సాగుతాయి. నైవేద్యం తరువాత వీరభద్ర ప్రభ సంబరం ఉంటుంది. ఉత్సవ మూర్తులను ప్రభ వాహనంపై తీరువీధులలో ఊరేగిస్తారు.
    
 శ్రీ భావన్నారాయ స్వామి ఆలయం కూడా పశ్చిమాభి ముఖంగా ఉంటుంది.
శ్రీ వైష్ణువులు కొండ ప్రాంతమును నీలా చలంగా ఆరాధిస్తారు. గర్భాలయం నందు  శ్రీ, భూ, నీల సమేత స్వామి.. చక్ర, శంఖు, గద, అభయ ముద్రతో దర్శనమిస్తాడు.  ఇచ్చట స్వామి వారి వామన హస్తమందు శ్రీ చక్రం చూడగలం. ఇది క్షేత్ర విశేషంగా చెబుతారు.
స్వామికి నిత్య అర్చనలుతో పాటు చైత్ర శుద్ధ ఏకాదశి కి కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు.
రాజమండ్రి  నుంచి 50 కిలో మీటర్ల దూరంలోని ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరు తప్పక దర్శించాలి. స్వస్తి

No comments: