Adsense

Tuesday, May 2, 2023

శ్రీ కూర్మనాథ వేణుగోపాల స్వామి ఆలయం, పెదకాపవరం, పశ్చిమ గోదావరి జిల్లా



 శ్రీ కూర్మనాథ వేణుగోపాల స్వామి ఆలయం, పెదకాపవరం, పశ్చిమ గోదావరి జిల్లా


💠 శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో శ్రీకూర్మావతారం ఎంతో విశిష్టమైనది.
అయితే మిగతా అవతారాలకు ఉన్నట్టుగా కాకుండా మనదేశంలో కూర్మావతారుడైన విష్ణుమూర్తి, దేవాలయాలు చాలా అరుదనే చెప్పాలి.

💠 శ్రీమహా విష్ణువు 'కూర్మావతారం' ధరించిన క్షేత్రాలు ... వేణుగోపాలుడిగా ఆవిర్భవించిన క్షేత్రాలు అక్కడక్కడా దర్శనమిస్తూనే వుంటాయి.
అయితే ఆయన కూర్మావతారం ధరించిన వేణుగోపాలుడిగా దర్శనమిచ్చే క్షేత్రాలు మాత్రం ఎక్కడా కనిపించవు.
అలాంటి అరుదైన ... అద్వితీయమైన క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని 'పెదకాపవరం' గ్రామంలో దర్శనమిస్తోంది.

⚜ శ్రీ కూర్మనాథ వేణుగోపాల స్వామి చరిత్ర ⚜

💠 16వ శతాబ్దంలో ఆనాటి పాలకులు సస్యసంపన్నమైన పెదకాపవరంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని నిర్మించారు. దాదాపు 200 సంవత్సరాలు ఆ వంశంవారే ధర్మకర్తలుగా వ్యవహరించి స్వామికి సకల భోగాలు జరిపిస్తూ వచ్చారు.

💠 18వ శతాబ్దం చివరి రోజుల్లో ఆలయ ధర్మకర్తగా కఠారి శేషన్నగారు వ్యవహరించారు. వారు స్వామికి పరమభక్తులు. ఒక శుభ రాత్రివేళ శ్రీ వేణుగోపాల స్వామి శేషన్న గారికి కలలో కన్పించారు.
స్వామివారి దివ్యమంగళరూపం క్రమంగా కూర్మావతారాన్ని సంతరించుకుంది.
శేషన్న గారికి కొన్ని సూచనలు చేశారు. నిద్రలేచిన శేషన్న తన స్వప్న వృత్తాంతాన్ని గ్రామస్తుంలందరికీ చెప్పారు.
తనకి వచ్చిన కల గురించి ఆ భక్తుడు గ్రామస్తులకు చెప్పాడు. అది సాధారణమైన కలనో ... భగవంతుడి ఆదేశామో తెలియడం లేదని అన్నాడు.

💠 ఆ రోజు మధ్యాహ్నం అందరూ ఒక్కటిగా చేరి భగవన్నామ సంకీర్తన ప్రారంభించారు. అందరూ గొంతెత్తి కీర్తించే సమయంలో ఒక గరుడపక్షి ఆకాశంలో కనిపించింది. భక్తులందరూ లేచి మేళతాళాలతో ఆ పక్షిని అనుసరించి, ఒక అర మైలు దూరం వెళ్ళాక ఒక మట్టి దిబ్బ మీద గరుడపక్షి వాలింది.
అందరూ ఆ ప్రదేశాన్ని తవ్వారు.
అందులో శేషన్నగారికి స్వప్నంలో దర్శనమిచ్చిన.కూర్మావతారంలో గల కృష్ణుడి విగ్రహం బయటపడింది. వారి ఆనందానికి అవధులు లేవు.

💠 ఆగమ శాస్త్రం ప్రకారం ఆ విగ్రహానికి సంప్రోక్షణ చేసి ... ప్రతిష్ఠించారు.
ఆనాటి నుంచి నిత్య ధూపదీప నైవేద్యాలు జరుగుతూ వస్తున్నాయి.
విభిన్నంగా ... స్వయంభువుగా ఆవిర్భవించిన స్వామిని ఆనాటి సంస్థానాధీశులు ... జమీందారులు ఇలవేల్పుగా భావించి ఆరాధించారు. భక్తి శ్రద్ధలతో స్వామివారి కైంకర్యాలకుగాను ఏర్పాట్లు చేశారు.

💠  శ్రీ కూర్మనాథ వేణుగోపాలస్వామి రూపం మరెక్కడా కనిపించదు. ఆనాటి ఉయ్యూరు ఎస్టేట్ జమీందారులు 50 ఎకరాల ఈనామ్ స్వామికి దానమిచ్చారు.

💠 అప్పటి నుండి స్వామి వారికి నిత్యోత్సవ, పక్షోత్సవాదులైన వేడుకలు మహావైభవంగా జరుగుతున్నాయి.
నవవిధ భక్తుల్లో దర్శన భక్తిని కోరుకునే భక్తులు ఈ స్వామి దివ్య మంగళ రూపాన్ని చూసి ధన్యులవ్వాల్సిందే.

💠 శ్రీ మహావిష్ణువు వేణుగోపాల రూపం మనకెక్కడైనా కనిపిస్తుంది. కూర్మావతార రూపం మాత్రం శ్రీ కూర్మంలోనే కనిపిస్తుంది.
శ్రీ మహా విష్ణువు రెండవ  అవతారమైన కూర్మా అవతారం ,వేణుగోపాల స్వామి
ఈ రెండు అవతారాల అరుదైన ఏకరూపం చూడాలంటే మాత్రం శ్రీ కూర్మనాథ వేణుగోపాల స్వామిని దర్శించుకోవాల్సిందే.

హరే కృష్ణ గోవిందా!!

No comments: