నిర్గుణ పరమాత్మ నుండి ఏదైతే ప్రథమంలో వ్యక్తమైందో దానికి 'శివమ్' అని పేరు. భక్తులను అనుగ్రహించే నిమిత్తం అదే 'శివుడు'గా, అదే 'రుద్రుడు'గా వ్యవహరింపబడుతున్నది. శివునకు త్రిమూర్తులలో ఒకడైన రుద్రునకు భేదం లేదు. బంగారానికి ఆభరణానికి భేదం లేదు గదా! వారిద్దరు భక్తులను సమానంగానే అనుగ్రహిస్తారు. మిగిలిన వారందరు ఏక్రమంలో జన్మించారో ఆక్రమంలోనే లయమవుతారు. కాని రుద్రుడు మాత్రం లయంకాడు. ఆయన శివునిలో ఐక్యమవుతాడు. ప్రకృతి నుండి పుట్టిన కార్యములన్ని రుద్రునిలో లయమవుతాయని వేదానుశాసనం.
బ్రహ్మ విష్ణువులు సైతం ప్రకృతి నుండి పుట్టిన వారు కనుకను, వారు కూడా రుద్రునిలో లయమవుతారు. గడ్డిపోచ మొదలుగా బ్రహ్మగారి వరకు ఈ జగత్తులో తెలియవచ్చే సర్వము మిథ్య. శివుని కంటె భిన్నంగా ఏదీ లేదు. సృష్టికి ముందు, సృష్టికి మధ్యలో, సృష్టి నశించిన తరువాత ఉండేది శివుడే. సగుణుడు, నిర్గుణుడు కూడా ఆయనే. ఈ సృష్టికి కారణభూతమైన శక్తి కూడ ఆయన నుండే పుట్టింది. అది ఆయన తపశ్శక్తి. ఆయనే వేదాలను, మాత్రలను, మాత్రాబద్ధమైన అక్షరాలను, ధ్యానమును ఒకటేమిటి సర్వమైన దానిని విష్ణువుకు ఇచ్చాడు. బ్రహ్మ, విష్ణువులతో కూడా కలిపి అందరికి ఆయుర్దాయం ఉంది. కాని శివునకు ఆయుర్దాయం లేదు.
No comments:
Post a Comment