హంపీ అనగానే కొడాలి వెంకట సుబ్బారావు ,కామరాజు గడ్డ శివ యోగానంద రావు గార్ల “హంపీ క్షేత్రం” గుర్తొస్తుంది. అందులో మకుటాయమానమైన పద్యం ..
“శిలలు ద్రవించి ఏడ్చినవి జీర్ణము లైనవి తుంగభద్రలో
పల గుడి గోపురంబులు సభాస్థలు లైనవి కొండముచ్చు గుం
పులకు చరిత్రలో మునిగిపోయిన దాంధ్ర వసుంధరాధిపో
జ్వాల విజయప్రతావర భవం బొక స్వప్న కధా విశేషమై “
ఎంతటి భావనాశక్తి.
“కురిసిన దెచట వాక్కుల జృంభణము లోన
కవిరాజుపైన బంగారు వాన
సలిపిన దెచట ధూర్జటి దివ్యలేఖిని
నవ్య వారాంగనా నర్తనంబు
తొడిగిన దెచట నిస్తుల రాజ హస్తము
కవి పితామహు కాలి కంకణంబు “
అంటూ అష్ట దిగ్గజాలను స్మరించుకుంటారు కవులు.
(పర్యాటక చిత్రం )
అసలు విషయానికి వస్తే హంపి విజయ నగర రాజుల రాజధాని అని,అది అత్యున్నత స్థాయిలో ఉండి, బహమనీ రాజుల దాడిలో, కాలి మసై పోయి, శిథిల నగరంగా మారిందని, అందరికి తెలుసనీ, నేను భావిస్తాను. అందులో ఎక్కువ భవనాలు,నిర్మాణాలు చెక్కవే కావడం వల్ల, రోజుల తరబడి, తగలబడి బూడిద అయి మిగలగా ఉన్న, రాతి నిర్మాణాలనే హంపి శిథిలాలని అంటున్నాం.
(trawell.in image)
వాటిలో రాజ ప్రాసాదం,లేదా నిర్మాణాలుగా(Royal enclosure) చెప్పుకునే భాగం లో ఉన్న ప్రధాన భాగమే ఈ మహర్నవమి దిబ్బ. ఇది కాక ఆస్థాన మండపం అనే నిర్మాణం కూడా ఈ ప్రాకారం లో కనిపిస్తుంది.
దీన్ని డామింగో పేస్ జయ భవనం (house of victory) అన్నాడు. అక్కడ పై భాగం లో ఉండే ఒక గదిలో రాజు గారి సింహాసనం ఉండేదని పేర్కొన్నాడు. ఈ దిబ్బనే "దసరా దిబ్బ" అని కూడా పిలుస్తారు. ఇది దసరా పండుగ రోజుల్లో మరింత శోభాయమానంగా అలంకరింపబడి ఉండేదట. రాజు ఇక్కడ ఆసీనుడై ఉత్సవాలను ,వినోద ప్రదర్శనలను వీక్షించే వాడట. అలాగే సామంతులు ఇక్కడే రాజుకు బహుమానాలు సమర్పించేవారట.
ఇది మొత్తం ప్రాంగణం లోకి ఎత్తైన ప్రదేశం. పదకొండు వందల చదరపు అడుగుల పునాది నుండి, నలభై అడుగుల ఎత్తు వరకు, నిటారుగా నిలబడిన ఈ వేదిక వంటి నిర్మాణం పై, చెక్క స్తంభాలకు అనువైన ఆనవాళ్ళు కలిగి ఉంది. అందువల్లనే ఈ వేదిక పై భారీ భవంతి, దారువుతో నిర్మింప బడి ఉందని భావిస్తారు. కింది భాగం 130 అడుగుల పైన చదరం తో మొదలై ,పైభాగాన 80 అడుగుల చదరం ఉన్న వేదిక నేడు కనపడుతుంది.
(ఫ్లికర్-మకుల్ బెనర్జీ చిత్రం)
దీని కట్టుబడి లో త్రిస్తరిత (three layered) విధానం కనిపిస్తుంది. తూర్పు,పడమర ,దక్షిణం వేపుగా , మెట్ల వరుసలు పైకి చేరటానికి ఏర్పరచి ఉన్నాయి. కింది భాగం లో కుడ్యం అంతటా సైనికులు,గుర్రాలు,ఆశ్వికులు,మల్లయుద్ద వీరులు వంటి చిత్రాలతో అలంకరించబడి ఉంటుంది. మెట్ల భాగంలో ఉన్న చిన్న అంతర గృహంలో విదేశీయుల బొమ్మలు కనిపిస్తాయి.
(సోహం బెనర్జీ చిత్రం)
శ్రీ కృష్ణ దేవరాయలు దీన్ని ఉదయగిరి (ప్రస్తుతం ఒరిస్సా) మీద జరిగిన యుద్ధంలో (1513AD) విజయ చిహ్నంగా నిర్మించాడు. తరువాతి రాజులు ఈ నిర్మాణంలో అనేక ఉప నిర్మాణాలు చేర్చారు. ముందున్న ఆకుపచ్చ రూపాంతరశిల (green schist stone) ఈ విషయాన్నీ ధ్రువ పరుస్తుంది.
మైసూరు లో జరిగే దసరా ఉత్సవాలు ఇక్కడి ఆ కాలపు అలవాట్లను గుర్తుచేసేవే.
ఇది మొత్తం 1565 లో జరిగిన దాడిలో నాశనం అయింది.
_సేకరణ
No comments:
Post a Comment