Adsense

Saturday, December 28, 2024

కుంభమేళా ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది? అంత ప్రాముఖ్యం పొందడానికి గల కారణాలు ఏమిటి?

ఇది పన్నెండు యేళ్ళకి ఒకసారి ఒక చక్ర భ్రమణం లాగా జరిగే ఉత్సవం.నాలుగు ప్రదేశాల్లో అంటే గంగా-యమునా-సరస్వతి సంగమం అయిన అలహాబాదు లేక ప్రయాగరాజ్ వద్ద ఇంకా,హరిద్వార్ లో,నాశిక్ లో,ఉజ్జయని లో దఫాల వారీగా ఇది జరుగుతుంది. ఆ కాలంలో నదీ స్నానం తో పాటు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలుకూడా జరుగుతూ ఉంటాయి.ఈ పద్ధతి ని శంకరాచార్యుల వారు ప్రవేశపెట్టారని నానుడి.అయితే ఇంతకు ముందు అంటే రమారమి 18వ శతాబ్దం ముందుదాకా “మాఘ మేళ” అనె పేరు తో ఉండేదని తర్వాత అదే ఇలా కుంభ మేళ గా మారిందని కూడా అంటారు.

(న్యూస్18 వారి చిత్రం)

కుంభమేళ జరిపే సమయాన్ని బృహస్పతి లేదా గురు నక్షత్ర గమనం పై ఆధార పడి లెక్కిస్తారు .పురాణాల పరంగా సముద్ర మధనం లో వచ్చిన అమృతం, కుండలోనుంచి ఇలా నది లో పడిందని అంటారు."ఋగ్వేదం" లో,బౌద్ధ గ్రంధం "మజ్జిమ నికాయ" లో ఇలాంటి నదీ స్నాన ఉత్సవం గురించిన వివరణ ఉందట.

ఇక దీన్లో కొన్ని తేడాలున్నాయి.అవేంటంటే ..

పూర్ణ కుంభ మేళ : 12 యేళ్ళు గడిచాకా వచ్చేది.

అర్ధ కుంభ మేళ :6 యేళ్లకు జరిగేది.అంటే రెండు ప్రయాగ,హరిద్వార్ పూర్ణకుంభమేళా లకు మధ్య వచ్చేది .

మహా కుంభ మేళ :12x12 =144 యేళ్లకు జరిగేది.

ఇవిగాక ప్రతి చోటా లోకల్ గా కొన్ని స్నాన ఉత్సవాలు కూడా ఉన్నాయి.కురుక్షేత్ర,సోనేపట్ ,మన తమిళనాట కుంభకోణం లో “మహా మాఘ” ఉత్సవం.తిరుచానూర్ లో పద్మావతి అమ్మవారి కి జరిగే “పంచమి తీర్థం” ,ఇలాంటివి కూడా లక్షల్లో జనాలు హాజరు అయ్యే ఉత్సవాలే.

బృహస్పతి గ్రహం పై ఒక రోజుకి 10 గంటలే.అంటే తన చుట్టూ తాను తిరిగేందుకు పట్టే సమయం అన్నమాట.ఇక సూర్యుని చుట్టూ తిరిగేందుకు సుమారు 12 సంవత్సరాలు పడుతుంది (అంటే మన భూమి లెక్కలో )ఇది రమారమి గా చూస్తే 11.8618 భూమి సంవత్సరాలు అయితే కాలెండర్ సవరణలను(అధిక మాసాలు) కలిపితే పన్నెండు అనుకోవచ్చు.అంటే పదకొండు సంవత్సరాల తర్వాత ఒక కుంభ మేళ అనేది ఇలా నిర్ణయం చేశారన్న మాట.ఇక వీటిలో తేడాలు చూస్తే హరిద్వార్ కుంభ మేళ సమయంలో గురువు కుంభ రాశి ,సూర్యుడు మేషరాశి లో ఉండాలి.ప్రయాగ లో జరిగేటప్పుడు గురువు మేషం,సూర్య చంద్రులిరువురు మకరం లేదా గురువు వృషభం,సూర్యుడు మకరం లో ఉండాలి.ఇలా గ్రహ స్థితి ఉన్నప్పుడే కుంభమేళా లగ్నం నిర్ణయం అవుతుంది.నాసిక్ ,ఉజ్జయిని లలో ఒకే సంవత్సరం లో కుంభమేళా జరుగుతుంది.1986 లో హరిద్వార్ లో కుంభ మేళ జరిగితే మరలా 1998 లో ఆపైన 2010 ,2021 లో జరిగినవి.అలాగే ప్రయాగ లో 1989,2001,2013 లో జరిగినవి.సరిగా వీటి మధ్యలో అర్ధ కుంభ మేళాలు జరిగాయి.

(ట్రిప్ సావి వారి చిత్రం)

ఇక్కడ స్నానం జరిగే తిధులలో కూడా ఒక క్రమం ఉంటుంది.అమావాస్య స్నానం కు ప్రత్యేకత ఉంటుంది.అందులోకి షాహీ స్నాన్/రాజయోగి స్నాన్ ప్రాధాన్యత ఎక్కువ.అప్పుడే నాగా సాదువులు దిగంబరంగా పెద్ద ఊరేగింపుగా స్నానానికి వస్తారు.

వచ్చే కుంభమేళా ప్రయాగ లో 2025 లో జరగబోతుంది.

ఇక ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే మత సంబంధమైన ఉత్సవం గనక. విశ్వాసాలు,ఆచారాలు,సంప్రదాయాలు మనలో గాట్టిగా పెనవేసుకు పోయాయి గనక.కొందరికి భక్తి ,కొందరికి ఇలాంటి ఉత్సవాలంటే అనురక్తి,ఇంకొంతమందికి భయం, వెరసి అదో పెద్దసంబరం.ఎవరి కారణం వారికి ఇంపు.

(సేకరణ)

No comments: