ఒకేలా కంటికి కనబడే రెండు ప్రత్యేకమైన ఒడిశా మిఠాయిలు ఇవి. చూడటానికి మన దిబ్బ రొట్టెలు లా కనబడతాయి, కాని తియ్యగా వుంటాయి.
చెన్నాపొడ(Chenna Poda):
దీనర్థం "కాల్చినజున్ను" అని. పొడ అంటే కాల్చడం అని, చెన్న అంటే జున్ను అని అర్థం.
(ఇక్కడ జున్ను అంటే ఈనిన పశువుల పాలతో చేసినది కాదు, నిత్యం వాడే పాలను విరుగగొట్టి చేసినది)
ఇది పూర్తిగా ఒడియా మిఠాయి పేరైనప్పటికీ శ్రీకాకుళం ప్రాంతంలో తెలుగులో ప్రత్యేకమైన పేరు లేకపోవడం వలన తెలుగు వారు ఇదే పదాన్ని వాడతారు. ఇక ఈ మిఠాయిని నిత్యం వాడే చిక్కని ఆవు/గేదె పాలను విరుగగొట్టి తీసిన జున్నుకు పంచదార, యాలకులు, కొంచెం రవ్వను జోడించి ముద్దను చేసి మనం దిబ్బ రొట్టెను కాల్చినట్టు కొంచెం తక్కువ సెగతో కాల్చి తయారు చేస్తారు. అలాకాల్చాడం వలన పంచదార, పాలపదార్ధం సమ్మేళనంతో కొద్దిపాటి ద్రవం తయారయ్యి ఈ మిఠాయికి అద్భుతమైన రుచి తెస్తుంది. ముక్కలుగా గాని, ఏక మొత్తంగా గాని ఈ మిఠాయిని అమ్ముతారు.
పొడాపిఠా (Poda Pitha) :
దీనర్థం "కాల్చిన పిండివంటకం" అని. ఒడియాలో పిఠా అంటే పిండివంటకం.
రూపంలో తయారీలో, కాల్చడంలో చెన్నాపొడాకు దీనికి తేడా కనబడదు. విరిగిన పాలజున్నులో వరి పిండి, మినపపిండి అదనంగా కలపడం మూలాన కొంచెం గట్టిగా వుంటుంది. రుచిలో తేడా వుంటుంది.
ఈ చిత్రంలో ఈ రెండూ వున్నాయి. రూపంలో తేడా వుండదు కాబట్టి నిశితంగా గమనించాలి. ఒడిశా వెళ్లేవారు వీటి రుచి చూడాల్సిందే.
No comments:
Post a Comment