Adsense

Wednesday, May 28, 2025

వాల్మీకి రామాయణం -08


అశ్వమేధ యాగం కు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఒకనాడు సుమంత్రుడు ఏకాంతంలో దశరథ మహారాజును
కలుసుకున్నాడు

నీకు సంతాన ప్రాప్తిని గురించి సనత్కుమారుడు ఋషిగణం సన్నిధిలో చెబుతూండగా నేను విన్న విషయం తెలియజేస్తున్నాను. ఆలకించు

కాశ్యప మహర్షికి విభాండకుడు, అతనికి ఋష్యశృంగుడూ జన్మిస్తారు. ఋష్యశృంగుడు పితృసేవ- తపస్సు తప్ప మరొకటి ఎరుగడు

సరిగ్గా ఇదే కాలానికి అంగదేశాలకు రోమపాదుడు రాజు అవుతాడు. అతని అధర్మ ప్రవృత్తివల్ల ఘోరమైన అనావృష్టి ఏర్పడుతుంది.

ఏ ఉపాయంతోనైనా సరే విభాండకసుతుణ్ని ఋష్యశృంగుణ్ని రప్పిస్తే వానలు పడతాయని విప్రులు సలహా ఇస్తారు.

ఆ ఋష్యశృంగుడికి నీ కూతురు శాంతను ఇచ్చి వివాహం చెయ్యమని కూడా చెబుతారు కానీ విభాండకుడికి భయపడి ఎవ్వరూ మేము వెళ్ళమంటే మేము వెళ్ళము అంటారు.

చివరికి వేశ్యలు ధైర్యంచేసి వెళ్ళి ఋష్యశృంగుణ్ని తీసుకువస్తారు. వానలు అతనితోనే వచ్చి కురుస్తాయి. అంగాధిపతి తన కూతురు శాంతను ఇచ్చి వివాహం చేస్తాడు.

సరిగ్గా ఇక్కడే సుమంత్రుని మాటలకు దశరథుడు అడ్డువచ్చాడు. వేశ్యలు ఋష్యశృంగుణ్ని ఎలా తీసుకురాగలిగారో వివరించమన్నాడు. సుమంత్రుడు ఇలా వివరించాడు -

విభాండకుడు ఆశ్రమంలో లేని సమయం చూసి వేశ్యలు గాత్ర మాధుర్యంతో ఋష్యశృంగుణ్ని చుట్టుముట్టారు.

స్త్రీ పురుష భేదం తెలియని ఋష్యశృంగుడు యథావిధిగా అతిథి మర్యాదలు జరిపాడు.

కుశల ప్రశ్నలు అయ్యాక ఆ వేశ్యలు తాము తెచ్చిన మధుర భక్ష్యాలను వింత ఫలాలుగా అతనికి సమర్పించి

వెంటనే తినెయ్యమని చెప్పి కౌగిలింతలతో వీడ్కొల్పి ఆశ్రమం నుంచి త్వరత్వరగా బయటపడ్డారు. అతడు అస్వస్థ హృదయుడయ్యాడు.

మరునాడు అదే సమయానికి ఋష్యశృంగుడు మనసు ఉండబట్టలేక వేశ్యలను వెదుక్కుంటూ వచ్చాడు

అప్పుడు ఆ వేశ్యలు మా ఆశ్రమానికి వస్తే ఇంకా వింతలూ విశేషాలూ చూపిస్తామంటూ అంగీకరింపజేసి ఋష్యశృంగుణ్ణి
తమ పట్టణానికి-అంగ రాజధానికి- తీసుకువచ్చారు

వర్షంతో ఋష్యశృంగుడూ, ఋష్యశృంగునితో వర్షమూ అంగ రాజ్యంలో అడుగుపెట్టాయి

రోమపాదుడు ఎదురువెళ్ళి ఋష్యశృంగుణ్ణి విధివిధానంగా అర్చించి అంతఃపురంలో ప్రవేశపెట్టి తన కూతురు శాంతను ఇచ్చి వివాహం చేశాడు.

దశరథ మహారాజా ! సనత్కుమారుడు చెప్పిన కథలో నీకు హితమైన అంశం తెలియజేస్తున్నాను శ్రద్ధగా విను ఇక్ష్వాకు వంశంలో దశరథుడు జన్మిస్తాడు.

అతనికి అంగరాజు రోమపాదునితో సఖ్యం ఏర్పడుతుంది
అనపత్యుడైన దశరథుడు తన యజ్ఞనిర్వహణకు శాంతా భర్తను పంపమని కోరుతాడు.

రోమపాదుడు అంగీకరించి పుత్రవంతుడైన ఋష్యశృంగుణ్ని అయోధ్యకు పంపుతాడు.

యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. దశరథుడికి అమిత పరాక్రమవంతులు వంశవర్ధకులు అయిన నలుగురు పుత్రులు కల్గుతారు.

మహా ప్రభూ ఇది సనత్కుమారుడు చెప్పిన విషయం కాబట్టి నీవే స్వయం గా వెళ్లి సకల రాజలాంఛనాలతో సత్కరించి ఋశ్య శుంగుణ్ణి తీసుకోరా అని సుమంత్రుడు తెలిపెను....

( స‌శేష‌ము )

No comments: